Saturday, December 28, 2024
HomeUncategorizedBRS Vs Congress | లగచర్ల లడాయి..

BRS Vs Congress | లగచర్ల లడాయి..

JanaPadham_EPaper_TS_15-11-2024

లగచర్ల లడాయి..

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా దాడి లొల్లి..
రోజుకో మలుపు తిరుగుతున్న వ్యవహారం..
పట్నం అరెస్టుతో తీవ్ర ఉత్కంఠ..
తప్పును తప్పించుకోవడానికి ఇరువురి యత్నం..
తెలంగాణ భవన్ వెళ్లి గోడు వెల్లబోసుకున్న బాధిత రైతుల కుటుంబీకులు..
అండగా ఉంటామన్న కేటీఆర్..
కుట్రదారులు శిక్ష అనుభవించాల్సిందే అంటున్న ప్రభుత్వ పెద్దలు..

లగచర్ల పోరు రోజురోజుకు రగులుకుంటున్నది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, రిమాండ్ తో బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. దళితులను థర్డ్ డిగ్రీతో చిత్రహింసలకు గురిచేసి నడవలేకుండా కొట్టిన ఘటనపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నది. జానెడు భూమిని ఇవ్వడానికి ఇష్టపడని రైతులను బలవంతపెడుతూ, భయాందోళనకు గురిచేస్తూ లాక్కునే ప్రయత్నంలో ఇంటలిజెన్స్ వైఫల్యంతో జరిగిన దాడిని బూచీగా చూపుతున్న తీరును ఎండగడుతున్నది. అరెస్టులు ఆపలేవని, అణచివేతలు మరింత ఆందోళనకు దారి తీస్తాయని హెచ్చరిస్తూ రేవంత్ సర్కార్ కు మరిన్ని సవాళ్లు విసురుతున్నది. అన్యాయంగా రైతులను లోపలేయడంతో వారి బంధువులు, కుటుంబ సభ్యులు ఎకాఎకి తెలంగాణ భవన్ కు వెళ్లి మొరపెట్టుకున్న ఘటనతో చలించిన కేటీఆర్ సర్కార్ పై విరుచుపడి తీవ్ర సర్వంతో హెచ్చరికలు ఇవ్వడంతో రాజకీయం మరింత వేడెక్కింది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఫార్మా విలేజ్ వ్యవహారం కొత్త వివాదాలకు కేంద్రమవుతోంది.

రాష్ట్రంలో ఎమర్జెన్సీ..
నాటి పాలనను రేవంత్ మరిపిస్తున్నారు..
పాలనపై ప్రజా తిరుగు బాటు కొడంగల్ నుండే ప్రారంభం…
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేశామా..?
మల్లన్నసాగర్ సందర్శనకు వెళ్తే రక్షణ కల్పించిన విషయం మరుస్తారా..?
మాజీ మంత్రి హరీష్ రావు
చర్లపల్లి జైల్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖత్

జనపదం, చర్లపల్లి :

ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నేడు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కుట్ర కేసులో చర్లపల్లి జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని గురువారం కలిసి అరెస్టు తీరు, కేసుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం బయటికి వచ్చిన హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన నియంతగా మారిందన్నారు. లగచర్లలో రైతులు మా భూములు మాకు కావాలని అడగడం తప్పా అని ప్రశ్నించారు. దానికి రైతులపై కేసులు పెడతావా ఇదెక్కడి న్యాయమన్నారు. అమాయకులైన గిరిజన రైతులను ఎందుకు జైల్లో వేశావని నిలదీశారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నాయకులను వేధించినా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని, నీ వెంట పడుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు నిలబడుతుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మర్చిపోయారని గుర్తు చేశారు. 6 గ్యారంటీలతో పాటు ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యాన్ని ఇస్తున్నానని రేవంత్ రెడ్డి ఆనాడు ప్రకటించారని తెలిపారు. మరి రైతులు మా భూములు మాకు కావాలని ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెట్టి ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నావని ప్రశ్నించారు. ఫార్మాసిటీ, ఫార్మా కంపెనీలను పెట్టాలనుకుంటే గత ప్రభుత్వం కేటాయించిన 14 వేల ఎకరాల్లో పెట్టాలని సలహా ఇచ్చారు. గిరిజన, దళిత, పేద రైతుల భూముల్లోనే ఎందుకు పెడుతున్నావని నిలదీశారు. సీఎం సోదరులు, బంధువుల కోసమే ఈ భూములను తీసుకుంటున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు. నాడు మల్లన్న సాగర్ లో రెండు రోజులు దీక్షలు చేస్తే రేవంత్ ను ఇలాగే అరెస్టు చేశామా అని ప్రశ్నించారు. ఊర్లోకి పంపి రక్షణ కల్పించామని గుర్తు చేశారు. ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయిస్తూ రేవంత్ రెడ్డి నియంతల వ్యవరిస్తున్నారని తెలిపారు. లగచర్లలో రైతులకు మానసిక ధైర్యం చెప్పేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కార్తీక్ రెడ్డి ని అరెస్టు చేశారని తెలిపారు. స్థానిక ఎంపీ డీకే అరుణ వెళ్తే ఆమెను కూడా అరెస్టు చేశారని తెలిపారు. ఇక రేవంత్ రెడ్డికి కొడంగల్ నుంచే ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ పతనమవుతుందన్నారు. ములాకత్ లో ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, నాయకులు కార్తీక్ రెడ్డి, నందికంటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

మా వాళ్లను విపరీతంగా కొట్టారు..
థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టారు..
భూమి ఇవ్వం అన్నందుకు అంతు చూస్తరా..
జరిగిన దారుణాలను చెప్పుకుని కన్నీరు పెట్టుకున్న బాధిత కుటుంబాలు..
తెలంగాణ భవన్ పరుగులు పెట్టి ఆశ్రయించిన వైనం..
కేటీఆర్ కు గోడు వెల్లబోసుకున్న మహిళలు..

లగచర్లలో జరిగిన సంఘటనకు రాజకీయ రంగు పులిమి పేదల భూములు గుంజుకునే కుట్రను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తమ భూములు కోల్పోతామని ఆవేదనతో రైతులు నిరసన తెలిపితే వాళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అమానుషంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన రైతుల కుటుంబాలకు చెందిన గిరిజన మహిళలు గురువారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. తమ ఇంట్లో మగవారిపై ఎంత కర్కషంగా వ్యవహరించారో చెబుతూ కంటతడి పెట్టారు. దాడితో సంబంధం లేకపోయినా తన భర్తను విపరీతంగా కొట్టి తీసుకెళ్లారని జ్యోతి అనే గర్భిణి మహిళ పోలీసుల దాడిని వివరిస్తూ బోరు విలపించింది. భూములు తీసుకుంటామని దాదాపు పది నెలలుగా ఇబ్బంది పెడుతున్నారని తమకు ఆ భూములే ఆధారమన్నారు. తమవారిని తీవ్రంగా కొట్టటంతో వాళ్లు నడవలేని పరిస్థితిలో ఉన్నారంటూ అవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు తీసుకుంటామని మమ్మల్ని బెదిరిస్తున్నారని మా ఆధారం పోతే ఎలా బతకాలని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

వీళ్లను చూస్తే దాడి చేసేవారిలా ఉన్నారా..
మహిళలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ ఈ గిరిజన మహిళలను చూస్తుంటే ఎవరో చెబితే దాడి చేసే వారిలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. ఫార్మా విలేజ్ వస్తే ఏం ప్రయోజనమో కూడా వారికి చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదన్నారు. జానెడు భూమి కోసం పోరాటం చేస్తున్న రైతుల పై ఇంత పాశవికంగా దాడి చేయటమేమిటని ప్రశ్నించారు. గిరిజన రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారి కుటుంబ సభ్యులను విడిపించే వరకు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. గర్భిణీ మహిళ జ్యోతికి వైద్య సాయం అందిస్తామన్నారు. లగచర్లలో రైతులపై పోలీసులు అమానుష దాడిని జాతీయ మానవహక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమాటో గా స్వీకరించి విచారణ జరపాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎదుర్కొనేందుకు ప్రజాసంఘాలు, గిరిజన, దళిత సంఘాలు, మహిళా సంఘాలు ముందుకు రావాలన్నారు. అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరముందని చెప్పారు. లగచర్ల ఘటనను స్థానిక ఎంపీగా ఉన్న డీకే అరుణ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ కోరారు.

RELATED ARTICLES

తాజా వార్తలు