Friday, December 27, 2024
HomeUncategorizedLagacharla Pharma Issue | ల‌గ‌చ‌ర్ల ల‌డాయి..

Lagacharla Pharma Issue | ల‌గ‌చ‌ర్ల ల‌డాయి..

ల‌గ‌చ‌ర్ల ల‌డాయి..

ఢిల్లీకి చేరిన పంచాయితీ..
హ‌క్కుల క‌మిష‌న్ ఎదుట బాధితులు
అర్ధరాత్రి వేళ పోలీసుల దాడి.. మ‌హిళ‌ల‌పై దాష్టీకం
అక్రమ అరెస్టులపై వివ‌రించిన బాధితులు
ఎన్‌హెచ్ఆర్‌సీకి గ్రామ‌స్తుల ఫిర్యాదుJanaPadham_Main_Paper_TS_19-11-2024
లగచర్లలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడి విచారణ
ప్రధాన నిందితుడు సురేశ్కోసం వేట
లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
దాడి ఘటనలో డీఎస్పీపై వేటు వేసిన ప్రభుత్వం

లడాయి పెద్దగవుతూనే ఉంది. లగచర్ల లొల్లి ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. బాధితులు న్యాయం కోసం హస్తినా బాటపట్టారు. అల్పులమైన తమను అన్యాయంగా హింసిస్తున్నారని, చేసుకుంటే తప్ప బతుకులేని తమను రాచిరంపాన పెడుతున్నారని జాతీయ ఎస్టీ కమిషన్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. మగాళ్లు ఊరిలోకి రావాలంటేనే వణుకుతున్నారని, ఉన్న కొందరిని అరెస్ట్ చేసి జైళ్లలో బంధించారని కన్నీంటి పర్యంతమయ్యారు. తమ భూములు ఇవ్వం అన్న ఖర్మానికి మనుషులని కూడా చూడకుండా కొడుతున్నారని వాపోయారు. తెలియకుండా జరిగిన దాడి ఘటనను బూచీగా చూపి అభం శుభం తెలియని వారిని అదుపులోకి తీసుకుని చిత్రవధ చేస్తున్నారని ఆరోపించారు. మహిళలని కూడా చూడకుండా అర్ధరాత్రి గొంతులు పిసికి, ఎక్కడబడితే అక్కడ చేతులేసి ఊరంతా బీభత్సం సృష్టించారన్నారు.

=========================

జనపదం, బ్యూరో

లగచర్ల లడాయి ఢిల్లీకి చేరింది. బాధితులంతా జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తమ భూములను వదిలేయాలని సీఎం రేవంత్‌ రెడ్డిని లగచర్ల ఫార్మా కంపెనీ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఉన్న భూమి మొత్తం తీసుకుంటా అంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోందని.. పోలీసులు ఎప్పుడు వచ్చి ఏం చేస్తారోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్లలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు సృష్టించిన అరాచకంపై బాధితులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మా భూములు ఇచ్చేది లేదంటూ 9 నెలలుగా చాలా ధర్నాలు చేస్తున్నామని లగచర్ల బాధితులు తెలిపారు. మేం ధర్నాలు చేసినప్పుడు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, కలెక్టర్ సహా ఏ అధికారి రాలేదుగానీ మొన్న మాత్రం కలెక్టర్ సాధారణ దుస్తుల్లో పోలీసు సెక్యురిటీ లేకుండా వచ్చారని పేర్కొన్నారు. దీంతో కొంతమంది పిల్లలు తెలియకుండా దాడి చేశారని చెప్పారు. దాడిని సాకుగా చూపి అర్ధరాత్రి 500 మంది పోలీసులు వచ్చి, కరెంట్ బంద్ చేసి తమపై దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కుతిక పిసికి, కళ్లకు బట్టలు కట్టి, ఇష్టానుసారం బూతులు తిడుతూ కొట్టారని కన్నీళ్లు పెట్టుకున్నారు. మగవాళ్లందరనీ అరెస్ట్ చేశారని మిగిలిన మగవాళ్లు ఊరు వదిలి పారిపోయారని తెలిపారు.

భూములు ఇవ్వం..
తమ భూములు ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వమని లగచర్ల బాధితులు స్పష్టం చేశారు. తమ భూములను వదిలేయాలని తమ వారిని వదిలేయాలని కోరారు. తమకు ఉన్న మొత్తం భూమిని తీసుకుంటా అంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎప్పుడు పోలీసులు వచ్చి ఏం చేస్తారోనని ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోందని చెప్పారు. తమ ఇంట్లో ఉన్న మగవాళ్లందరినీ తీసుకెళ్లారని ఎనిమిది రోజులుగా తమ పిల్లలు ఎక్కడున్నారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు మేము చాలా బాగా బతికామని 9 నెలలుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. తమ ప్రాణాలు పోయినా సరే ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్తే తమను బెదిరించి పంపించారని చెప్పారు.

తెలియకుండా దాడి చేశాం..
తెలియకుండా జరిగిన దాడిని చూపించి అర్థరాత్రి 500 మంది పోలీసులు తమ ఇళ్లపైకి దౌర్జన్యానికి వచ్చారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కరెంట్‌ తీసేసి ఇంట్లోకి వచ్చి కొట్టారని బూతులు తిట్టారని తెలిపారు. అదే రోజు చాలా మంది మగవాళ్లను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. పోలీసులు చేస్తున్న దౌర్జన్యానికి భయపడి చాలా మంది ఊరు వదిలి పారిపోయారని వివరించారు.

సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు..
లగచర్ల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల దాడి ఘటన కేసు మరింత తీవ్రం అవుతోంది. కేసులో ఇప్పటికే ఏ 1గా ఉన్న పట్నం నరేందర్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏ 2గా ఉన్న సురేష్ మాత్రం ఇంత వరకు ఆచూకీ లేదు. అతని వెతికి పట్టుకునేందుకు పోలీసులు లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు. లగచర్లలో అధికారులపై జరిగిన దాడి కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేశారు. ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా ఇంత వరకు సురేష్ ఆచూకీ లభించకపోవడంపై పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కలే ఆయన్ని దాచి పెట్టి ఉన్నారని ఫోన్ సిగ్నల్‌కి కూడా దొరకడం లేదని అంటున్నారు. అందుకే వ్యక్తిని పట్టుకోవడం మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సోమవారం లుక్‌ అవుట్ నోటీసు జారీ చేశారు.

ఏం జ‌రిగిందో చెప్పండి..
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామానికి జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ సోమవారం విచార‌ణ కోసం చేరుకున్నారు. మ‌ధ్యాహ్నం లగచర్ల గ్రామానికి చేరుకుని బాధితుల‌తో మాట్లాడారు. దాడి రోజు ఏం జ‌రిగింద‌ని వివ‌రాలు సేక‌రించారు. లగచర్ల గ్రామంలో గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు, గ్రామస్తులతో మాట్లాడారు. అక్కడి నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్లి రిమాండ్లో ఉన్న లగచర్ల గ్రామస్తులను క‌లిశారు. అక్కడ గంట పాటు లగచర్ల నిందితులతో మాట్లాడారు.
భూసేకరణకు సంబంధించిన పరిణామాలను తెలుసుకునేందుకు సోమవారం జాతీయ ఎస్టీ కమిషన్‌ లగచర్లలో పర్యటించింది. రోటిబండ తండాలో కమిషన్ సభ్యులు బాధితులతో మాట్లాడారు. కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన తర్వాత గిరిజనులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే పోలీసులు అర్ధరాత్రి అరాచకం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్టీ కమిషన్ సభ్యులు పోలీసులు, కొండగల్ ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్‌ ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. గిరిజనులను పోలీసులు వేధిస్తే సహించేది లేదంటూ తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీ కోసం తమ భూములను బలవంతంగా సేకరిస్తోందని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు లగచర్ల, రోటిబండతండా గ్రామాలకు చెందిన గిరిజనులు ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే వాళ్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.

పోలీస్ అధికారిపై వేటు..
లగచర్లలో కలెక్టర్ పై దాడి అంశంపై అధికారులపై చర్యలు ప్రారంభం అయ్యాయి. పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో మరికొందరు పోలీస్ అధికారులపై సైతం చర్యలు ఉంటాయని తెలుస్తోంది. లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలోనే డీఎస్పీపై బదిలీ వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నవంబర్ 11న ఫార్మా కంపెనీల ఏర్పాటు సంబంధించి భూసేకరణకు లగచర్ల సమీపంలో కలెక్టర్, ఇతర అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కొందరు రైతులు గ్రామంలోకి వచ్చి ప్రజలతో చర్చలు జరపాలని కలెక్టర్ ను కోరారు. గ్రామంలోకి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై ఒక్కసారిగా కొందరు దాడులకు దిగారు. వాహనాలను పెద్ద పెద్ద బండరాళ్లతో ధ్వంసం చేశారు.

పోలీస్ వర్గాలపై సర్కార్ సీరియస్
రేవంత్ సర్కార్ ఈ ఘటనపై సీరియస్ అయ్యింది. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు అనేక మంది రైతులను అరెస్ట్ చేసింది. నిఘా వర్గాలతో పాటు స్థానిక పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరగడానికి వారం ముందు నుంచే గ్రామంలో కొందరు సమావేశాలు నిర్వహించి రెచ్చగొట్టినట్లు విచారణలో తేలింది. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు పరిస్థితిని అంచనా వేయకపోవడంపై సర్కార్ సీరియస్ అయ్యింది. దీంతో భారీగా పోలీస్ అధికారులపై చర్యలు ఉంటాయన్న ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. ఏకంగా రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీపై సైతం చర్యలు ఉండే అవకాశం ఉందన్న చర్చ కూడా జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో సోమవారం పరిగి డీఎస్పీపై వేటు పడింది. పరిస్థితులు కాస్త చక్క బడిన తర్వాత మరికొందరు అధికారులపై సైతం చర్యలు ఉండే అవకాశం ఉందన్న ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది.

RELATED ARTICLES

తాజా వార్తలు