Sunday, December 29, 2024
HomeTelanganaTelangana Politics | చూసుకుందాం రండి.. కోర్టుకెక్కిన రాజకీయాలు

Telangana Politics | చూసుకుందాం రండి.. కోర్టుకెక్కిన రాజకీయాలు

JanaPadham_EPaper_TS_11-10-2024

చూసుకుందాం రండి..

కోర్టుకెక్కిన రాజకీయాలు

నాంపల్లి న్యాయస్థానంలో 320కిపైగా పొలిటికల్ నోటీసులు
ఇటీవల పెరిగిన లీగల్ వార్
గతంలో కాంగ్రెస్ కూడా ఇదే వ్యూహం
మాణిక్ ఠాగూర్తో పాటు ఏఐసీసీ నేతలకు కూడా లీగల్ నోటీసులు
ఇప్పుడూ అదే ట్రెండ్..

ప్రజా సమస్యలపై పెగలాల్సిన నోళ్లు పర్సనల్ తిట్లకోసం ఆరాటపడుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా కొట్లాడాల్సిన పెద్దరికాలు, చట్టసభలు చిన్నబోయేలా కోర్టు మెట్లు ఎక్కడానికి ఇష్టపడుతున్నాయి. జనం ఎటు పోతే మాకేంటి.., రాష్ట్రం ఏమైతే పోయేదేంటి.. అనుకుంటున్నారోఏమోగానీ మేము, మా పార్టీ., ఆస్తుల రక్షణ, మా కుటుంబం అక్కర్లు అన్నట్టుగానే నేతలంతా న్యాయస్థానాల్లోనే తేల్చుకుందామని తహతహలాడుతున్నారు. పరువుల పరువు గంగలో కలుస్తున్నా, మాటలు వినడానికి కూడా సిగ్గుపడాల్సినంత దరిద్రంగా సాగుతున్నా, అడ్డుకట్టలేయడం వదిలేసి అన్నీ అక్కడే చూసుకుందామని బహిరంగ సవాళ్లు విసురుకుంటూ దాన్నే హీరోయిజం అనుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే చట్టాలు పురుడుపోసుకోవాల్సిన పవిత్ర సభలను వదిలి న్యాయదేవతను శరణుకోరుతున్న రాజకీయాలు రాష్ట్రంలో రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. లీడర్ల వ్యవహారం చూస్తుంటే చట్ట సభ కొంపదీసి న్యాయస్థానానికి షిఫ్ట్ అయ్యిందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

===================

జనపదం, బ్యూరో

రాజకీయాలు కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. ఇక్కడా.. అక్కడా.. విమర్శలు కాదు.. వచ్చిన మాటలన్నింటిపైనా లీగల్ వార్కు రెడీ అవుతున్నాయి. “ మాటలతోనే మజా ఏముంటుంది. దానిక్కాస్త లీగల్‌ ఫైట్‌ టచప్‌ కూడా ఇస్తే సంవాదం ఇంకా బలంగా ఉంటుంది” అన్నట్టుగా మారింది రాష్ట్ర రాజకీయం. రాష్ట్ర రాజకీయాల్లో లీగల్‌ నోటీసులతో కొత్త ట్రెండ్‌ మొదలుపెట్టింది. బీఆర్‌ఎస్‌ అగ్రనేతల్లో ఒకరు లీగల్‌ నోటీస్‌ అందుకుంటే మరొకరు కాంగ్రెస్‌ నేతలకు, ప్రజాప్రతినిధులకు లీగల్‌ నోటీసులు ఇస్తున్నారు. కేవలం మాటలే కాదు అవసరమైతే కోర్టులో చూసుకుందాం.. అన్నట్టుగా అంతం కాదిది ఆరంభం అన్నట్లుగా మారిపోయింది.

చూసుకుందాం..
రాష్ట్ర పాలిటిక్స్ లో కొత్తగా లీగల్ ట్రెండ్‌ కనిపిస్తున్నది. ఏకవచన సంబోధనలు, వ్యక్తిగత ఆరోపణలకు దాకా వెళ్లే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ఒరవడిని స్పీడ్ చేశారు. మాటకు మాటతో సరిపోవడం లేదు. కౌంటర్‌కి రివర్స్ కౌంటర్‌ ఇస్తే చాలడం లేదు. ఎన్ని చెప్పుకున్నా ఎంత తిట్టుకున్నా సంతృప్తి చెందడం లేదు. అంతకుమించి అన్నట్లు లీగల్‌ నోటీసులతో ప్రత్యర్థులు, ఆరోపణలు చేసినవాళ్లను కోర్టుకీడుస్తున్నారు. ఇటీవల కొద్దికాలంగా లీగల్‌ నోటీసులతో రాజకీయాలు సాగుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా లీగల్ నోటీసుల వరకూ వెళ్లినా మళ్లీ వెనకడుగు వేశారు. ఏఐసీసీ అప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా పని చేసిన మాణిక్కం ఠాగూర్ రాష్ట్ర బీఆర్ఎస్ అగ్రనేతలకు మధురై కోర్టునుంచి నోటీసులు పంపించారు. ఆ తర్వాత ఆయన మారిపోవడం, రాష్ట్రంలో ఎన్నికలు, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొంత మేరకు గ్యాప్ ఇచ్చారు. కానీ, మళ్లీ ఇప్పుడు లీగల్ నోటీసుల రాజకీయం మొదలైంది.

హైడ్రాతో మొదలైంది..
ఇటీవల కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌కి మాజీ మంత్రి హరీశ్రావు లీగల్‌ నోటీసు ఇచ్చారు. అవాస్తవ ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారని హరీష్‌రావు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఎప్పట్నించో రాజకీయాల్లో ఉన్న హరీష్‌రావుకు ఆరోపణలు, సవాళ్లు కొత్తకాకపోయినా ఈసారి కౌంటర్‌తో సరిపెట్టకుండా కాంగ్రెస్‌ ఎంపీకి లీగల్‌ నోటీస్‌ కూడా పంపారు. హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలతో పాటు మూసీ ప్రక్షాళన రాజకీయాలను షేక్‌ చేస్తోంది. విపక్షపార్టీలు ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి హరీష్‌రావు, కేటీఆర్‌తో పాటు ముఖ్యనేతలు బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇదే సమయంలో హరీష్‌రావుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆనంద్ కన్వెన్షన్‌లో హరీష్‌కి వాటాలున్నాయని ఆరోపించారు. మూసీ పర్యటన పేరుతో రాజకీయ డ్రామాలు చేస్తున్నారని, ఎందుకంటే హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన కన్వెన్షన్‌లో హరీష్ రావుకు వాటాలున్నాయని అనిల్ సంచలన ట్వీట్‌ చేశారు. కన్వెన్షన్‌ని కాపాడుకునేందుకే హరీష్‌ డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ ఆరోపించారు. ఆస్తులను కాపాడుకునేందుకు సామాన్య ప్రజలను అడ్డుపెట్టుకుంటున్న అగ్గిపెట్టె హరీష్.. ఖబర్దార్ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. అనిల్ కుమార్ యాదవ్ ట్వీట్‌కి అదేస్థాయిలో హరీశ్రావు కౌంటర్‌ ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురదజల్లే వికృత రాజకీయాలకి కాంగ్రెస్‌ తెరలేపిందని హరీష్‌రావు రియాక్టయ్యారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాల్ని ఆశ్రయిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. రేపు గోల్కొండ కోట, చార్మినార్‌లో కూడా వాటాలు ఉన్నాయంటారేమో.. అబద్ధపు ప్రచారాలు చేస్తున్నందుకు లీగల్ నోటీస్ పంపుతున్నానని స్పందించారు. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావాకి రెడీగా ఉండాలని అనిల్ కుమార్ యాదవ్‌ని హెచ్చరించారు.

కేటీఆర్ కు…
అనిల్ కుమార్ యాదవ్ ఘటనకు కొద్ది రోజుల ముందే సీఎం రేవంత్రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కి లీగల్‌ నోటీస్‌ పంపారు. అమృత్ పథకం టెండర్ల విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీకి లీగల్ నోటీసులిచ్చారు. తనపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పట్టణాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో సీఎం కుటుంబసభ్యులు అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్‌ చేసిన ఆరోపణలు దీనికి కారణమయ్యాయి. అయితే, సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి బావమరిది సృజన్ రెడ్డికి పనులు అప్పగించారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం కుటుంబాన్ని కేటీఆర్‌ టార్గెట్‌ చేసుకోవడటంతో కాంగ్రెస్‌ కీలకనేతలంతా స్పందించారు. మంత్రి పొంగులేటి ఆధారాలు చూపాలని సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి కూడా తన అల్లుడు సృజన్‌రెడ్డికి నిబంధనల ప్రకారమే టెండర్‌ దక్కిందని వివరణ ఇచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో సీఎం సెంట్రిక్‌గా బీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేయటంతో కేటీఆర్‌కి లీగల్‌ నోటీసులు ఇచ్చారు సృజన్‌రెడ్డి. లీగల్‌ నోటీసులకు అటు కేటీఆర్‌, ఇటు అనిల్‌కుమార్‌యాదవ్‌ ఇద్దరూ ఇప్పటికైతే ఎలాంటి సారీ చెప్పలేదు.

ఇప్పుడు సురేఖకు…
తాజాగా నాగ చైతన్య, సమంత వ్యవహారం హాట్ హాట్గా నడుస్తున్నది. ఇది రాజకీయంగా ఎలా ఉన్నా ఇప్పుడు లీగల్ నోటీసులు మాత్రం చేరుకున్నాయి. ఇప్పటికే సురేఖపై సినీహీరో నాగార్జున లీగల్ నోటీసులు ఇవ్వడం, ఆయన కోర్టులో వాంగ్మూలం కూడా ఇచ్చారు. అంతేకాకుండా సురేఖకు నాంపల్లి కోర్టు నుంచి సమన్లు కూడా వచ్చాయి. ఇది సాగుతుండగా ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి సురేఖకు లీగల్ నోటీసు ఇచ్చారు. పరువు నష్టం దావా వేశారు.

హద్దులు దాటుతున్నారు..
రాష్ట్ర రాజకీయాలు రోజుకో ఇష్యూతో హీటెక్కుతున్నాయి. కొద్ది నెలలుగా తరుచూ ఏదో ఒక అంశంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య రోజుకొక అంశంపై మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రచ్చన్న యుద్ధం మొదలైంది. రుణమాఫీ, రైతుభరోసా, ఆరు గ్యారెంటీలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పై అదే స్థాయిలో విరుచుకుపడుతుంది. ఇప్పుడు తెలంగాణలోని పార్టీలు ప్రజల సమస్యలను పక్కకు వదిలి వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. అంతటితో ఆగక కనీసం సభ్య సమాజంలో ఉన్నామా అన్న సంగతి మరిచి నేతలు విమర్శలకు దిగుతున్నారు. నేతల రాజకీయ రచ్చలో అసలు విషయాలు పక్కనదారినపడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

సొంత వైరమేనా..?
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదటి నుంచి కూడా రాజకీయంగా వైరం ఉంది. ఇప్పుడు ఆ రాజకీయ శత్రుత్వం పార్టీల నుంచి కాస్తా నేతలకు చేరింది. ఇటీవల జరుగుతున్న పరిణమాలు చూస్తుంటే తెలంగాణలో నేతలు హద్దులు మీరుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో ఉన్నామా అన్న సంగతి మరిచి మరీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోయేలా రాజకీయాలు ఉంటున్నాయి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ, అటు బీఆర్ఎస్ ముఖ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఒక దశలో ఈ విమర్శలు కంట్రోల్ తప్పుతున్నారు. నోటికి ఏది వస్తే అదే విమర్శించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా దుమ్మెత్తిపోసుకోవడంలో నేతలు తమ స్థాయిని మరిచిపోతున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. రాజకీయాల్లో చాలా సీనియర్లుగా చెప్పుకునే నేతలు సైతం తమ పరిధిని దాటి మాట్లాడుతున్నారు. ఐదారుసార్లు ఎమ్మెల్యేలుగా చేసిన నేతల భాష, వ్యవహరిస్తున్న తీరుపై కూడా రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. వీధి రౌడీల్లా, గుండాల్లా నేతల ప్రవర్తన ఉందని సామాన్య ప్రజలు అనుకునేలా నేతల ప్రవర్తన ఉంటుంది. ఇటీవల సీనియర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీ మాట్లాడిన తీరు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. ఆ తర్వాత కొద్ది రోజులకు హైదరాబాద్ లో మరో ఘటన అందరినీ షాక్ గురి చేసింది. సీనియర్ ఎమ్మెల్యే ఐన అరికపూడి గాంధీ తన అనుచరులతో కలిసి మరో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీదకు దాడికి వెళ్లే యత్నం చేశారు. ఇది మరిచిపోతున్నారనుకుంటున్న క్రమంలో తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యవహారం రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషనల్ గా మారాయి. తెలిసో తెలియకో కొండా సురేఖ సినీ పరిశ్రమను కూడా రాజకీయాల్లోకి లాగింది. సురేఖ ఏ ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేసిందో ఇప్పుడు ఆ కామెంట్స్ రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు