Sunday, December 29, 2024
HomeTelanganaLiquor Sales | పెట్టె నిండింది.. గిట్టుబాటైంది..

Liquor Sales | పెట్టె నిండింది.. గిట్టుబాటైంది..

JanaPadham_EPaper_TS_15-10-2024

పెట్టె నిండింది.. గిట్టుబాటైంది..

ఖజానా భర్తీకి సర్కార్ కసరత్తు..
ఫుల్ కిక్కిచ్చిన మద్యం అమ్మకాలు..
ప్రయాణంలోనూ వడ్డింపునకు దిగిన ప్రభుత్వం..
చార్జీల మోతతో మరింత రాబడి..
పెద్దపండుగ వేళ భారీగా కలెక్షన్ల వాన..
రేవంత్ ప్రభుత్వానికి కొత్త జోష్ ఇచ్చిన దసరా..

ఎట్లైనా సరే నింపుకోవాలి. ఎవ్వరు ఏమన్నా అనుకోని., ఎట్లనన్నా అర్థం చేసుకోని. గల్లపెట్టె గలగలలాడాలంటే ఏదైనా చేయాల్సిందే. మడికట్టుకుని కూర్చుంటే ఆరిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. పేరు పెద్దరికం.., తీరు దౌర్భాగ్యం.. కాకముందే సదురుకుంటేనే మంచిది. ఖజానాకు మూటలు తరలొచ్చే దారులను పెంచుకుని, మున్ముందు పైసల కష్టాలు లేకుండా చేసుకుంటేనే బాగుంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే అని సర్కార్ కసరత్తు ఫలితాలిచ్చినట్టే అనిపిస్తున్నది. అందునా దసరా కలిసొచ్చింది. అటు మద్యం అమ్మకాలు మత్తు దించేలా జరగ్గా, ఇటు ఊర్లకు పయనమైన ప్రజలకు వడ్డింపులతో వచ్చిన రాబడి మరింత ఊపునిచ్చింది. పండుగ పూట ఇంటిళ్లిపాది సంబురాలతో పల్లెలన్నీ పులకించగా, రాష్ట్ర సర్కార్ కూడా అంచనాకు మించిన రాబడితో ఫుల్ జోష్ లో మునిగిపోయింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టల మాదిరిగా, ఒక్క పండక్కు రెండు వైపుల ఆదాయంతో కొంచెం చెయ్యి తిప్పుకున్నట్టైంది.
==================
రాష్ట్ర ప్రభుత్వానికి దసరా మాంచి జోష్ తీసుకొచ్చింది. పుట్టెడు కష్టాల్లో, అందునా అప్పుల్లో ఉన్న సర్కార్ కు పండుగ మంచిగనే గిట్టుబాటైంది. తెలంగాణలో పెద్దపండుగ బతుకమ్మ, దసరా. పల్లెలన్నీ పిల్లాపాపలు., బంధుమిత్రులతో కళకళలాడాయి. మర్యాదల్లో తగ్గేదేలే.. అన్నట్టుగా మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. నగరమంతా ఊరిబాటపట్టడంతో అటు ఆర్టీసీ కూడా దొరికిందే బుక్క అన్నట్టుగా క్యాష్ చేసుకునే ప్రయత్నంలో సక్సెస్ అయింది. వడ్డింపులు డబుల్ చేసి డబ్బులు రాల్చుకుంది. ఇటు మద్యం ఏరులై పారగా, అటు బస్సు ప్రయాణాలతో కూడా లెక్కకు మించి ఆదాయం సమకూరింది. దసరాతో రాష్ట్ర సర్కార్ కు కొంచెం మెడలు తిప్పుకునే వెసులుబాటు కలిగింది.

రేవంత్ సర్కార్ దసరా టార్గెట్ గా గల్లపెట్టె నింపుకుంది. ప్రజల అవసరాలను క్యాష్ చేసుకోవడానికి ఏ మాత్రం వెనకాడకుండా చర్యలకు ఉపక్రమించింది. అమ్మకాలకు సరిపడ మద్యం సరఫరా చేసి అటు మద్యం ప్రియులను సంతృప్తి పర్చడమే కాకుండా, ఇటు తనకు తాను కూడా ఎంతో సంతోషంగా ఉండేలా సంపాదించింది. కేవలం 11 రోజుల వ్యవధిలోనే వందల కోట్ల అమ్మకాలు జరిగిందంటే ఎంతటి డిమాండ్ నైనా ఎలాంటి లోపాలు లేకుండా సప్లై చేసి సర్కార్ రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి.

ఫుల్లుగా తాగేశారు..
అంచనాకు మించి లిక్కర్ సేల్స్..
దసరాకు గుంజుడే గుంజుడు..

11 రోజుల్లో రూ.1057 కోట్ల మద్యం విక్రయాలు..

జనపదం, హైదరాబాద్ సిటీ

రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ, దసరా ఉత్సవాలను జరుపుకున్నారు. దసరా పండుగ ప్రారంభం అవుతుందంటే వారం రోజుల నుంచే మందు బాబులకు అసలైన పండుగ మొదలైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దసరా పండుగకు 15 నుంచి 25 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. దసరా పండగకు మద్యం ఎక్కువగా అమ్ముడవుతుందని ఊహించిన వ్యాపారులు ముందుగానే స్టాక్ పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే స్టాక్ అంతా సేల్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్ షాపులతోపాటు వెయ్యి కంటే ఎక్కువగా బార్లు, క్లబ్‌లు, పబ్‌లు ఉన్నాయి. వీటిన్నింటికి దసరా ముందు రోజు అనగా శుక్రవారం దాదాపుగా రూ.205 కోట్ల స్టాక్‌ ఎక్సైజ్‌ డిపోల నుంచి చేరిందని గణాంకాలు తెలుపుతున్నాయి. మిగతా రోజులతో పోలిస్తే దసరా పండుగ రోజుల్లో మద్యం అమ్మకాలు 20 నుంచి 25 శాతం పెరిగాయి. అక్టోబర్ 10వ తేదీన అయితే రూ.139 కోట్ల మద్యం వైన్‌ షాపులకు చేరింది. అక్టోబర్ ఒకటవ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు రూ.1,057.42 కోట్ల విలువైన మద్యం అమ్ముడైందని గణాంకాలను అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో 10.44 లక్షల కేసుల లిక్కర్‌, 17.59 లక్షల కేసుల బీరు అమ్ముడు పోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఈ నెల 10వ తేదీ వరకు రూ.852.4 కోట్ల విలువైన 8.36 లక్షల కేసుల లిక్కర్‌, 14.53 లక్షల కేసుల బీరు సేల్ అయినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.

తాగేశారు..
రాష్ట్రంలో దసరా పండుగ నేపథ్యంలో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డులకు చేరాయి. పండుగ వేళల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. నవరాత్రి పర్వదినాల్లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.1057 కోట్ల విక్రయాలు జరిగాయి. పండుగ వేళల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. నవరాత్రి పర్వదినాల్లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.1000 కోట్లకుపైగా విక్రయాలు జరిగాయి. వైన్స్ లు, మద్యం దుకాణాలతో పాటు పబ్బుల్లోనూ విక్రయాలు పెరగడంతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌ నగరంలోనే పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు సాగాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో అమ్మకాలు రెట్టింపయ్యాయని చెప్పారు.

డబ్బులే డబ్బులు..
నిజానికి పితృ అమావాస్య, పండుగ చివరి వరకు మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణలో మొత్తం 2,260 మద్యం దుకాణాలు ఉండగా 1,171 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. అదే సమయంలో హైదరాబాద్‌లో పబ్‌లు సైతం ఉన్నాయి. యేటా దసరా పండగ మొదలైనప్పటి నుంచి మద్యం విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతూ వస్తుంటాయి. ఈ క్రమంలో ఎక్సైజ్‌శాఖ సైతం రాష్ట్రవ్యాప్తంగా భారీగానే మద్యం నిల్వలను అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి వరకు రూ.2,838.92 కోట్ల విక్రయాలు జరిగాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి 11 వరకు రూ.1,057కోట్ల విలువైన 10.44లక్షల మద్యం కేసులను విక్రయించినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. వీటితో పాటు రూ.17.59 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. ఇక మద్యం విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలువగా ఆ తర్వాత కరీంనగర్‌, నల్గొండ, వరంగల్‌ నిలిచాయి. దసరా పండుగ చివరి మూడురోజుల్లోనే విక్రయాలు మరీ ఎక్కువగా జరిగాయి. ఎక్సైజ్‌ డిపోల నుంచే రూ.205.42కోట్ల మద్యం వైన్స్ లకు చేరింది.

RELATED ARTICLES

తాజా వార్తలు