Kavitha | మనీలాండరింగ్ కేసులో విచారణ కోసం సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవితను గురువారం సీబీఐ కోర్టు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కవితను ఐదురోజుల కస్టడీ డిమాండ్ చేస్తూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐతో పాటు కవిత తరఫు న్యాయవాది వాదనలు విన్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా దరఖాస్తుపై తీర్పును రిజర్వ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై విచారణ మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి ప్రారంభంకానున్నది. సౌత్ గ్రూప్‌కి చెందిన ఓ మద్యం వ్యాపారి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారని.. ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసేందుకు ఆయన మద్దతు కోరారని సీబీఐ గతంలో వాదించింది. కేజ్రీవాల్ ఆయనకు హామీ ఇచ్చారని.. తమవంత మెటీరియల్, వాట్సాప్ చాట్‌లు, సంబంధిత నిందితుల స్టేట్‌మెంట్లు ఉన్నాయని పేర్కొంది.
రూ.100 కోట్లు వినయ్ నాయక్‌కు ఇచ్చామని అభిషేక్ బోయినపల్లి చెప్పినట్లు ప్రభుత్వ సాక్షి దినేష్ అరోరా తన వాంగ్మూలం స్పష్టం చేసినట్లు సీబీఐ పేర్కొంది. ఇండోస్పిరిట్స్‌లో కవితకు భాగస్వామ్యం ఉందని బుచ్చిబాబు చాట్ వెల్లడించిందని.. మనీష్ సిసోడియా ఒత్తిడి కారణంగా బ్లాక్ లిస్టులో పెట్టిన తర్వాత కూడా ఇండోస్పిరిట్స్‌కు లైసెన్స్‌లు ఇచ్చినట్లు సీబీఐ ఆరోపించింది. బీఆర్‌ఎస్ నాయకురాలు కే కవిత తనకు తెలిసిన వాస్తవాలను దాస్తున్నారని సీబీఐ ఆరోపిస్తున్నది. ఇంతకు ముందు కూడా, నోటీసు ఇచ్చినప్పటికీ ఆమె విచారణకు హాజరుకాలేదు. కుట్రను బయటపెట్టాలంటే తమకు 5 రోజుల కస్టడీ అవసరమని సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. కవిత తరఫున న్యాయవాది నితీష్ రాణా సీబీఐ అభ్యర్థనను వ్యతిరేకిస్తూ అరెస్టు చట్టవిరుద్ధమన్నారు. కవిత ప్రాథమిక హక్కులను కూడా దర్యాప్తు సంస్థ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి తీసుకున్న సీబీఐ అధికారులు ఇటీవల కవితను జైలులోనే విచారించారు. మార్చి 15న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం నుంచి కవిత(46)ని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.