Sunday, December 29, 2024
HomeTelanganaGovt Survey | ఉరికిచ్చిండ్రు.. మర్లబడ్డ మూసీ..

Govt Survey | ఉరికిచ్చిండ్రు.. మర్లబడ్డ మూసీ..

JanaPadham EPaper 2024-09-27

ఉరికిచ్చిండ్రు…
మర్లబడ్డ మూసీ..
మా ఇళ్లు ముట్టుకోవద్దు..
విషం ఇచ్చి మార్కింగ్ చేయండి..
అధికారులను పరిగెత్తించిన మూసీ నిర్వాసితులు
సర్వే కసరత్తు వేగవంతం..
5 బృందాలుగా ఏర్పడి మార్కింగ్..

జనం విసిగిపోయారు. సర్కార్ అతితనానికి ముహం వాచి మర్లబడడం మొదలుపెట్టారు. ఓపికను పరీక్షిస్తున్న తీరుతో వెగటుపుట్టి బతకాలంటే బరితెగించాలనే మూడ్ లోకి వెళ్లారు. చేస్తున్నదంతా చూస్తూ ఉంటే ఎంతకైనా తెగిస్తారనే విషయాన్ని అర్థం చేసుకుని నిలదీయడం., ఎదురుతిరగడం నేర్చుకున్నారు. కళ్లముందే కలల సౌధాలు కూలుతుంటే గుండెలగడం షురూ అవుతున్న హెచ్చరికను గమనించి ఇక లాభం లేదని గిరిగీసి బరిలో కడిగిపారేయాల్సిందే అని నిర్ణయించుకున్నారు. ‘హైడ్రా’ అంటే చాలు అంతెత్తుకు లేచి పరుగు పెట్టించేలా కయ్యానికి దిగుతున్నారు. చెలరేగిపోతున్న అధికారుల తీరును కడిగిపారేస్తున్నారు. తమ కట్టడాలనైనా ఉంచాలి., మీరైనా మిగలాలి అంటూ అడ్డంగా పడుకుంటున్నారు. తమ ప్రాణాలు తీసిన తర్వాతే కూల్చివేతలు చేయాలని మూసీ సాక్షిగా మర్లబడుతున్నారు. రాష్ట్ర సర్కార్ పై దుమ్మెత్తిపోస్తూ, అధికారుల కనికరం లేని తీరును తీవ్రంగా అసహ్యించుకుంటూ సాధ్యమైనంత వరకు ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తున్నారు.

జనపదం, బ్యూరో

మూసీ పరివాహక ప్రాంతంలో అధికారులు చేపట్టిన సర్వే ఉద్రికత్తకు దారితీసింది. సర్వేను అడ్డుకున్న స్థానికులు అధికారుల చేతుల్లో నుంచి పత్రాలను లాక్కున్నారు. గోడలపై మార్క్ కూడా చేయనివ్వలేదు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెళ్లిపోయారు. హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు చేపట్టిన సర్వేను స్థానికులు అడ్డుకున్నారు. కొందరు నిర్వాసితులు అధికారుల దగ్గర నుంచి సర్వే పత్రాలను లాక్కొని చించేశారు. అధికారులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గోడలకు మార్క్ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా అడ్డుకున్నారు. దీంతో కొత్తపేట, మారుతినగర్‌, సత్యానగర్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అధికారులు సర్వే నిర్వహించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇళ్లు ఖాళీ చేయం..
తాము ఇళ్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదని స్థానికులు చెబుతున్నారు. ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లను అధికారులు ఇష్టారీతిన నిర్ణయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని ఎంత పెద్ద వర్షం వచ్చినా తమ కాలనీల్లోకి నీళ్లు రాలేదని చెబుతున్నారు. వరదలు వచ్చినట్లు తమ తండ్రులు, తాతలు కూడా చెప్పలేదని అంటున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విషం ఇచ్చి ఇళ్లకు మార్కింగ్ చేయండి..
చైతన్యపురి ఫణిగిరి కాలనీ, న్యూమారుతి నగర్, సత్యనగర్‌లలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు పోలీసులు, రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు విషం ఇచ్చి తమ ఇళ్లకు మార్కింగ్ చేసి తొలగించండి అంటూ ఆందోళన చేశారు. అధికారులు రివర్‌ బెడ్‌లో ఉన్న ఇంటి వివరాలు, యజమానుల వివరాలు నమోదుచేసే పత్రాలను ఒక్కసారిగా ఆగ్రహంతో స్థానికులు చింపేశారు. మార్కింగ్ చేసేందుకు ఉపయోగించే ఎరుపు రంగును సిబ్బంది నుంచి లాక్కున్న ఓ యువకుడు, దూరంగా విసిరేశాడు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రివర్‌బెడ్‌లో ఉన్న నిర్మాణాల సర్వే, మార్కింగ్‌ ప్రక్రియ అంతా ఆయా ప్రాంతాలకు చెందిన కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లు, పోలీసులు, విజిలెన్స్ అధికారుల సమక్షంలో జరిగింది. ఈ నేపథ్యంలో నిర్వాసితులు మాత్రం తమ ఇళ్ల తొలగింపునకు ససేమిరా అంటున్నారు. అధికారులు మాత్రం పునరావాస చట్టం ప్రకారం బాధితులకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు, పరిహారం చెల్లించాకే మూసీ నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
————-

“మేముంటున్న ఇంటిపై లోన్ కూడా తీసుకున్నాం. అది ఇంకా తీరలేదు. మేము కట్టుకున్నంత ఇళ్లు ఇస్తానంటే సరే, లేకుంటే ఇక్కడ నుంచి వెళ్లేది లేదు. ఆక్రమించిన పెద్దోళ్ల ఇళ్లు కూల్చేది లేదు కానీ పేదోళ్ల బతుకులతో ఆడుకుంటున్నారు. మేము తెలియక కొన్న స్థలాలపై మాత్రం ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడకని పోవాలి. ఇప్పటివరకు మూసీ నది నీళ్లు ఒక్కచుక్క కూడా రాలేదు. మరి ఎందుకని ఇప్పుడు విరగగొడుతున్నారు.”
-ఓ బాధితుడి ఆవేదన

కసరత్తు వేగవంతం..
మూసీ ప్రక్షాలళన దిశగా అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేసి నదీ గర్భంలో ఉన్న ఇళ్లకు అధికారులు మార్కింగ్ చేశారు. పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల సహా వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. మూసీ రివర్‌ బెడ్‌లో ఉన్న ఇళ్ల వివరాలు, నిర్వాసితుల వివరాలను సేకరించారు. వారికి మరోచోట రెండు పడకగదుల ఇళ్లను కేటాయించి, పరిహారం కూడా చెల్లించాకే, మార్కింగ్ చేసిన ఇళ్లను తొలిగింపు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు. అప్పటివరకు బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే సర్వేలో భాగంగా మార్కింగ్‌ ప్రక్రియను కొన్నిచోట్ల స్థానికులు అడ్డుకున్నారు. తమ ఇళ్లను తొలిగిస్తే ఊరుకోబోమని, ప్రభుత్వం ఇచ్చే డబుల్‌ బెడ్ రూం ఇళ్లు వద్దని ఆందోళనకు దిగారు.

5 బృందాలుగా ఏర్పడి మార్కింగ్..
చాదర్‌ఘాట్, శంకర్‌నగర్‌లో మూసీ నది బఫర్‌ జోన్‌లో ఉన్న నిర్మాణాలకు అధికారులు మార్కింగ్ చేశారు. బహదూర్‌పురా, కిషన్‌బాగ్, అసద్‌బాబా నగర్ తదితర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు 5 టీంలుగా ఏర్పడి పోలీసుల సహాయంతో సర్వే చేస్తూ మార్కింగ్ చేశారు. లంగర్‌హౌజ్ ఆస్రంనగర్‌లో మార్కింగ్ ప్రక్రియను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసుల సహాయంతో వారికి నచ్చచెప్తూ అధికారులు ముందుకుసాగారు. చేసేదేం లేక స్థానికులు నిరసనకు దిగారు. తాము అన్ని అనుమతులు తెచ్చుకొని కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేయడమంటే, తమ బతుకులతో ఆడుకోవడమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఇంట్లో తాము మూడు, నాలుగు కుటుంబాలుగా కలిసి ఉంటున్నామని ఇప్పుడు ప్రభుత్వం ఇస్తానంటున్న ఒక్క డబుల్‌ బెడ్ రూం ఇంట్లో తమ కుటుంబాలన్నీ ఎలా ఉండగలవని ఆందోళన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు