హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రజలు ఓటేయడానికి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూకట్టారు. యాదాద్రి జిల్లా, నాగర్‌కర్నూల్, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాల్లో సమస్యలు పరిష్కరించే వరకు ఓట్లు వేసేదని ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద నిరసన తెలిపారు. ఇక జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం చిన్నకొలువాయిలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. గ్రామంలో 100 శాతం ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో 110 ఓట్లు ఉండగా, అంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 100 శాతం పోలింగ్ నమోదుకావడంతో జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా చిన్న కొలువాయి ఓటర్లను అభినందించారు. ఇక కామారెడ్డి జిల్లాలోని పిప్రియాల్ తండాలో మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
ఇక తొలిసారి ఓటు వేసేందుకు వచ్చిన యువ ఓటర్లకు ఎన్నికల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మహబూబ్‌గర్ జిల్లా జడ్చర్లలో పోలింగ్ కేంద్రాలను అందంగా ముస్తాబు చేశారు. పూలతోరణాలు, బెలూన్లు కట్టి అలంకరించారు. ఆదర్శపొలింగ్ కేంద్రం కావడంతో సరికొత్తగా తీర్చిదిద్దినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ ప్రారంభంలో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించగా అధికారులు సరిచేశారు. అనంతరం ఓటింగ్ ప్రశాంతంగా సాగింది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 5 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగిలిన 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 525 అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో 50 మంది మహిళలు ఉన్నారు. కాగా, తుది ఓటింగ్ శాతాన్ని మంగళవారం ఉదయం ప్రకటిస్తామని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.