Saturday, December 28, 2024
HomeTelanganaLok Sabha Elections | ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ శాతాలిలా..

Lok Sabha Elections | ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ శాతాలిలా..

Lok Sabha Elections | హైద‌రాబాద్ : తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. ఎండ ముద‌ర‌క ముందే ఓటు వేయాల‌నే ల‌క్ష్యంతో ఓట‌ర్లు పోలింగ్ కేంద్రాల‌కు భారీగా చేరుకుంటున్నారు. ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు తెలంగాణ‌లో 9.48 శాతం, ఏపీలో 9.51 శాతం పోలింగ్ న‌మోదైంది. నల్గొండ లోక్​సభ పరిధిలో ఉదయం 9 గంటల వరకు 11 శాతం పోలింగ్​ నమోదు అయింది. ఇక పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు కూడా ఆటంకం క‌ల‌గ‌డంతో పోలింగ్ ప్ర‌క్రియ ప‌లు చోట్ల నిలిచిపోయింది.

కుమ్రంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం జగన్నాథపూర్‌లో గ్రామస్థులు ధర్నాకు దిగారు. తమ ఊరికి రోడ్డు వేయలేదంటూ ఓటు వేసేందుకు గ్రామస్థులు నిరాకరించారు. ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలం రాయమాదారంలో పోలింగ్‌ బహిష్కరించిన గ్రామస్థులు. ఎన్​ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేందంటూ పోలింగ్​ను బహిష్కరించారు. అలాగే యాదాద్రి పోచంపల్లి మండలం కనుముక్కలలో గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ధర్నాకు దిగారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేసేందుకు పోలింగ్​ కేంద్రానికి వెళతామని నిరసన చేపట్టారు.

తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ మాట్లాడుతూ.. సాంకేతిక కార‌ణాల‌తో ప‌లు చోట్ల పోలింగ్ ఆల‌స్య‌మైంద‌న్నారు. వర్షాలు, విద్యుత్​ సమస్యల పోలింగ్‌కు అంత‌రాయం క‌లిగింద‌న్నారు. ఆయా ప్రాంతాల్లో నెల‌కొన్న స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రించామ‌ని, ప్ర‌స్తుతం పోలింగ్​ ప్రశాంతంగా కొనగసాగుతోందని స్పష్టం చేశారు.

సిద్దిపేటలోని దుబ్బాక బొప్పాపూర్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్​రావు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఖమ్మంలో కుటుంబ సమేతంగా బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్​ సెంట్రల్​ నర్సరీలో డీజీపీ రవిగుప్తా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్‌లో ఓటు హక్కును బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్​ వినియోగించుకున్నారు. చేవెళ్లలోని గొల్లపల్లిలో ఓటు హక్కును బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి వినియోగించుకున్నారు. అలాగే నాగర్​ కర్నూల్​ గుండూరులో బీజేపీ అభ్యర్థి భరత్​ ప్రసాద్​ ఓటేశారు. నాగర్‌కర్నూల్​లోని అలంపూర్‌లో ఓటు హక్కును బీఆర్​ఎస్​ అభ్యర్థి ప్రవీణ్​ కుమార్​ వినియోగించుకున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పసుమాములలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్​ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్​లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ దంపతులు ఓటు వేశారు. కరీంనగర్​ జిల్లాలోని జ్యోతినగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్​ ఓటేశారు. అలాగే మేడ్చల్​లోని పూడూరులో బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మహబూబాబాద్​ మాదాపురంలో ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థి రఘురాంరెడ్డి, హనుమకొండ టీచర్స్​ కాలనీలో వరంగల్​ కాంగ్రెస్​ అభ్యర్థి కడియం కావ్య, సూర్యాపేట జిల్లా మఠంపల్లి గుండ్లపల్లిలో నల్గొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.​

RELATED ARTICLES

తాజా వార్తలు