Lok Sabha Elections | హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది.
తెలంగాణలో 17, ఏపీలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. సమస్యాత్మక నియోజవకర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. పోలింగ్ సమయం ముగిసే వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు.
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 525 మంది బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. మొత్తం 3.32 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 9,900 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి పటిష్ట బందోబస్తు కల్పించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది, 175 శాసనసభ నియోజకవర్గాలకు 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 4 కోట్ల 14 లక్షల 18 వందల 87 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో 2 కోట్ల 3 లక్షల 39 వేల 851 మంది పురుష ఓటర్లు, 2 కోట్ల 10 లక్షల 58 వేల 615 మంది మహిళా ఓటర్లు, 3,421 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు, 46 వేల 389 కేంద్రాల్ని, ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. లక్షా 60 వేల ఈవీఎంలు వినియోగిస్తోంది.