MP | న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇక 18వ లోక్‌సభ కొలువుదీరడమే మిగిలింది. అయితే లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలకు కేంద్రం చాలా రకాల సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రతి ఎంపీకి నెలకు రూ. లక్ష జీతం, విలాసవంతమైన వసతి సదుపాయం, ఉచిత విమాన ప్రయాణాలతో పాటు చివరకు ఇంట్లో వాడుకునే నీటి వరకు అన్ని ఉచితంగానే ఇవ్వనున్నారు.
ఎంపీలకు ఉండే అలవెన్సులు ఇవే..
- లోక్‌సభకు ఎన్నికైన ప్రతి ఎంపీకి నెలకు రూ. లక్ష జీతంతో పాటు నియోజకవర్గ అలవెన్స్ కింద నెలకు రూ. 70 వేలు కేంద్రం ఇవ్వనుంది. ఇక కార్యాలయం ఖర్చుల కింద నెలకు మరో రూ. 60 వేలు కూడా చెల్లిస్తారు. పార్లమెంటరీ సెషన్‌ల సమయంలో రోజు వారీ ఖర్చుల నిమిత్తం.. రూ. 2 వేల చొప్పున అదనంగా చెల్లిస్తారు.
- ఎంపీలకు ఐదేండ్ల పదవీకాలం ఉంటుంది. ఈ ఐదేండ్ల పాటు ఎలాంటి అద్దె తీసుకోకుండా ఉచితంగా వసతి కల్పించబడుతుంది. ఎంపీల సీనియార్టీని బట్టి బంగ్లాలు, ప్లాట్లు కేటాయిస్తారు. అధికారిక వసతి వద్దనుకున్న వారు నెలకు రూ.2,00,000 గృహ భత్యాన్ని క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది.
- ఎంపీలు, వారి కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఆరోగ్య సేవలు ఉచితంగా పొందవచ్చు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు.. ఈ పథకం కింద వచ్చే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలను ఉచితంగా పొందొచ్చు. పదవి కోల్పోయిన అనంతరం మాజీ ఎంపీలకు ఒక్కొక్కరికి నెలకు రూ.25 వేల పింఛన్ సైతం వస్తుంది. ప్రతి ఏడాది నెలకు రూ.2,000 ఇంక్రిమెంట్ కూడా పొందుతారు.
- ఏడాదిలో 34 సార్లు ఎంపీతో పాటు ఆయన భార్యకు ఉచిత విమాన ప్రయాణం కల్పిస్తారు. అధికారిక, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉచిత ఫస్ట్-క్లాస్ రైలు ప్రయాణం కూడా చేయొచ్చు. ఇక రోడ్డు రవాణా అయితే, కిలోమీటరుకు రూ.16 చొప్పున చెల్లిస్తారు.
- మూడు టెలిఫోన్లను ఉపయోగించుకోవచ్చు. వాటిని తనకు ఇష్టమైన చోట ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదిలో ఎంపీలకు 1,50,000 టెలిఫోన్ కాల్స్ ఫ్రీ. వారు తమ నివాసాలు, కార్యాలయాల్లో ఉచిత హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌లను కూడా పొందుతారు. ఏటా 50,000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 4,000 కిలోలీటర్ల వరకు ఉచిత నీరు అందిస్తారు.