Lord Ganesh | వినాయక చవితి నేపథ్యంలో గల్లీ గల్లీకో గణేషుడు కొలువుదీరాడు. ఒక్కొక్క రూపంలో భక్తులకు గణనాథులు దర్శనమిస్తున్నారు. కొందరు విఘ్నేశ్వరుడిని ప్రత్యేకంగా, వినూత్నంగా తీర్చిదిద్ది.. ఓ కొత్త సందేశం ఇచ్చేలా తీర్చిదిద్దారు. ఇక రకరకాలుగా వినాయకుడి విగ్రహాలను అలంకరించి పూజలు చేస్తున్నారు. అయితే ఓ లంబోదరుడిని మాత్రం కరెన్సీ నోట్లతో అలంకరించారు. అదేదో వందల రూపాయాల్లో కాదు.. ఏకంగా ఒక కోటి 10 లక్షల రూపాయాలతో గణనాథుడిని అలంకరించి అందరి దృష్టిని ఆకర్షించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో కాపు సంఘం గణేశ్ ఉత్సవ కమిటీ.. వినూత్నంగా ఆలోచించింది. లక్ష్మీ వారమైన శుక్రవారం నాడు.. కరెన్సీ నోట్లతో గణనాథుడిని అలంకరించారు. రూ. 1.10 కోట్ల విలువ చేసే రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లతో అలంకరించి, అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక శనివారం నాడు ఆ కరెన్సీ నోట్లను తొలగించారు.
ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ ఎన్‌పీ నాయుడు మాట్లాడుతూ.. గత 28 ఏండ్ల నుంచి అంబేద్కర్ సెంటర్‌లో వినాయకుడి విగ్రహాన్ని పెడుతున్నామని, ప్రతి ఏడాది వినూత్న పద్ధతుల్లో పూజలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది లక్ష్మీ వారమైనా శుక్రవారం నాడు కరెన్సీ నోట్లతో లంబోదరుడిని అలంకరించి పూజలు చేశాం. శనివారం మళ్లీ ఆ నోట్లను తొలగించామని తెలిపారు. గతేడాది ఒక కోటి రూపాయాలతో అలంకరించినట్లు చెప్పారు. ఈ ఏడాది రూ. 10 లక్షలు పెంచామని గుర్తు చేశారు. ఇక కరెన్సీ నోట్లతో అలంకరించినట్లు తెలుసుకున్న భక్తులు భారీగా తరలివచ్చి సెల్ఫీలు దిగారని ఎన్‌పీ నాయుడు తెలిపారు.