Lord Hanuman | హిందువులందరూ ప్రతి రోజు ఏదో ఒక దేవుడిని పూజిస్తారు. మంగళవారం వచ్చిందంటే చాలు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తమకు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటారు. ఆయురారోగ్యాల కోసం హనుమంతుడిని పూజించే వారు.. స్వామికి ఎంతో ఇష్టమైన సింధూరం సమర్పిస్తుంటారు. మరికొందు వడమాల, ఇంకొందరు తమలపాకులు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మరి హనుమంతుడికి తమలపాకులంటే ఎందుకంత ఇష్టం.. దీని గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
సీతారాములు వనవాసానికి వెళ్లిన సమయంలో రావణుడు సీతను అపహరిస్తాడు. మారీచుడి మాయ నుంచి బయటపడిన తర్వాత రామలక్ష్మణులు పర్ణశాలకు వచ్చి చూసిన తర్వాత సీత కనిపించదు. దీంతో ఆమె ఆచూకీ కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. ఈ అన్వేషణ చేస్తున్న సమయంలో పవన సుతుడిని రామలక్ష్మణులు కలుసుకుంటారు. జటాయువు ద్వారా సీతను రావణుడు అపహరించినట్లు తెలుసుకుంటారు. శ్రీరాముడి ఆజ్ఞతో లంకకు వెళ్లిన ఆంజనేయుడు అశోకవనంలో ఉన్న సీతమ్మను చూసి..రాముడి ఆనవాలు ఇస్తాడు. ఆ తర్వాత లంకాదహనం చేసి తిరిగి వస్తాడు. లంక నుంచి బయలుదేరి శ్రీరాముడి దగ్గరకు వచ్చే సమయంలో సీతాదేవి ముందు అంజలి ఘటిస్తాడు హనుమంతుడు. ఆ సమయంలో దీవించేందుకు పూలు లేకపోవడంతో ఆ పక్కనే ఉన్న తమలపాకు తీగనుంచి ఓ ఆకు తెంపి హనుమంతుడి తలపై పెట్టి దీవిస్తుంది. అప్పటి నుంచి పవన సుతుడికి తమలపాకులంటే ప్రీతి. వాటితో పూజిస్తే చాలు వరాలు గుమ్మరిస్తాడని భక్తుల విశ్వాసం..
వైవాహిక జీవితంలో కలతలు తొలగిపోతాయట..!
ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే వైవాహిక జీవితంలో కలతలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. నిత్యం అనారోగ్యంతో బాధపడే పిల్లల పేరుమీద ఆంజనేయుడికి ఈ ఆకులతో పూజచేస్తే త్వరగా కోలుకుంటారు. శనిదోషం వెంటాడుతున్న వారు పవనసుతుడికి తమలపాకులతో పూజచేస్తే ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు, గ్రహసంబంధ పీడలు తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు మాయమవుతాయి. మరీ ముఖ్యంగా సుందరకాండ పారాయణం చేసి హనుమాన్ కి తమలపాకు హారం సమర్పిస్తే చేపట్టే అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది.