Lok Sabha Elections | న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఇవాళ ఆరో దశ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. చివరి దశ పోలింగ్ జూన్ 1వ తేదీన జరగనుంది. జూన్ 4 ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే ఆరో దశలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 889మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 11.13 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఈ దశలో పోటీ పడుతున్న ప్రముఖులు వీరే..
మనోజ్ తివారీ
తివారీ భోజ్‌పూరి ఫిలిం ఇండస్ట్రీలో పాపులర్ నటుడు, సింగర్ కూడా. సినీ జీవితాన్ని వదులుకుని బీజేపీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఢిల్లీ బీజేపీ యూనిట్ చీఫ్‌గా పని చేశారు. 2019 ఎన్నికల్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై 3.6 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై మనోజ్ తివారీ పోటీ చేస్తున్నారు.
కన్హయ్య కుమార్
2016లో కన్హయ్య కుమార్‌ను దేశద్రోహం ఆరోపణలపై ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేయడంతో ఆయన వార్తల్లో నిలిచారు. పార్లమెంట్‌పై దాడి ఘటనలో దోషిగా తేలిన అఫ్జల్ గురును ఉరితీసిన దినాన్ని ఢిల్లీలోని జేఎన్‌యూలో కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 2019లో బీహార్‌లోని బెగుసరాయ్ నుంచి సీపీఐ అభ్యర్థిగా బరిలో దిగాడు. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేతిలో 4 లక్షల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు బీజేపీ నాయకుడు మనోజ్ తివారీపై నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.
బన్సూరి స్వరాజ్
మాజీ విదేశాంగ మంత్రి, దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తెనే బన్సూరి స్వరాజ్. ఈ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి మీనాక్షి లేఖికి ఈ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. బన్సూరి స్వరాజ్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ తరపున సోమనాథ్ భారతి పోటీలో ఉన్నారు. ఢిల్లీలోని మాళవియా నగర్ నుంచి మూడు సార్లు సోమనాథ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
మనేకా గాంధీ
అటల్ బీహారీ వాజ్‌పేయి, నరేంద్ర మోదీ కేబినెట్లలో మంత్రిగా పని చేశారు మనేకా గాంధీ. నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న సుల్తాన్‌పూర్ నుంచి ఆమె బరిలో ఉన్నారు. మనేకా గాంధీపై సమాజ్‌వాదీ పార్టీ నాయకులు రామ్ భుల్ నిషాద్ పోటీ చేస్తున్నారు. ఇక ఫిలిబిత్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మనేకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే.
మనోహర్ లాల్ ఖట్టర్
హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దింపింది బీజేపీ. దశాబ్ద కాలంగా బీజేపీకి కంచుకోటగా ఉన్న కర్నాల్ లోక్‌సభ స్థానం నుంచి ఖట్టర్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న సంజయ్ భాటియాకు టికెట్ దక్కలేదు. మనోహర్ లాల్ ఖట్టర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి దివ్యాంశ్ బుద్దిరాజా పోటీ పడుతున్నారు.
మెహబుబా ముఫ్తీ
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబుబా ముఫ్తీ అనంత్ నాగ్ – రాజౌరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి మియాన్ అల్తాఫ్.. ముఫ్తీతో పోటీ పడుతున్నారు. అయితే పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ రెండు కూడా ఇండియా కూటమిలో భాగస్వామ్యమే. అయితే సీట్ల పంపకాలపై వివాదాలు తలెత్తడంతో ఇద్దరూ పరస్పరం పోటీ పడుతున్నారు.