జనపదం – బుధవారం -28-08-2024 E-Paper
ఆసుపత్రుల్లో మందుల కొరత ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం – మాజీ మంత్రి హరీష్ రావు
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కాంగ్రెస్ పాలనలో దిక్కులేకుండా పోయింది. నిత్యం వేలాదిమందికి వైద్యసేవలు అందించే ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది.
ఆసుపత్రిలో మందుల కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందులు లేవని చేతులెత్తేయడంతో చేసేది లేక రోగులు ప్రైవేటు ఫార్మసీలకు వెళ్తున్నారు. డబ్బులు చెల్లించి మందులు కొనుగోలు చేస్తూ ఆర్థిక భారాన్ని మోస్తున్నారు.
మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. ఒక్క ఎంజీఎం ఆసుపత్రే కాదు దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు నిండుకున్నాయి.
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మూడు నెలలకు సరిపడా మందులు బఫర్ స్టాక్ గా పెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తున్నది.
ప్రైవేటు మెడికల్ షాపులకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల సరఫరా నిలివేస్తున్నట్లా?
ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో ప్రైవేటు ఫార్మసీలను ఎందుకు కొనసాగిస్తున్నట్లు?
ఆసుపత్రులకు మందులు సరఫరా చేయాల్సిన టిఎస్ఎంఎస్ఐడీసీ ఏం చేస్తున్నట్లు?
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రులకు శాపంగా మారుతున్నది. బిఆర్ఎస్ పాలనలో ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వ ఆసుపత్రులు కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాయి.
ఇప్పటికైనా స్పందించి అన్ని రకాల మందులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోగులపై ఆర్థిక భారం పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.