జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తనమీద నమోదైన కేసుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ప్రహరీ గోడ కూల్చివేత, తనపై నమోదైన కేసు అంశంపై అధికారులకు ప్రివిలైజ్ నోటీస్ ఇస్తానని వెల్లడించారు. అలాగే ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. ప్రహరీ గోడ కూల్చివేసిన ఘటనకు సంబంధించి తనపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.
జూబ్లీహిల్స్ డివిజన్‌లోని నందగిరిహిల్స్‌లో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న విషయం తెలిసి తాను అక్కడకు వెళ్లానన్నారు. తాను ప్రజాప్రతినిధిగా అక్కడకు వెళ్లానని… తనను అడ్డుకునే అధికారం ఏ అధికారికీ లేదన్నారు. ప్రజాప్రతినిధిగా జనాల సమస్యలు తీర్చడమే తన బాధ్యత అన్నారు. కేసులు తనకు కొత్తేమీ కాదన్నారు.