– గ్రూప్స్, నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తామాని, అసెంబ్లీని స్తంభింప చేస్తామని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతిలాల్ నాయక్ తో మాట్లాడాలని, వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చర్చ జరపాలి, ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. మోతిలాల్ నాయక్ దీక్ష విరమించాలని, అందరం కలిసి ప్రభుత్వంపై పోరాటం చేద్దామని మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేశారు.
మోతీలాల్ ఆరోగ్యం పట్ల ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అనీ, ప్రొఫెసర్ కోదండరాం గారు పిల్లల హక్కుల పట్ల పూర్తి బాధ్యత తీసుకోవాలి. అమలు చేసే విధంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. మోతిలాల్ దీక్ష విరమించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన మోతీలాల్ పోరాటం చేస్తున్నట్టు చెప్పాడని, ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష విరమించనని చెప్పాడని ఎమ్మెల్యే హరిష్ రావు తెలిపారు. మోతీలాల్ నాయక్ ఏడు రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేకపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.
పదేపదే మోతీలాల్ నాయక్ ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసాం, అందరం కలిసి పోరాటం చేద్దాం, మేము మీ వెంట ఉన్నాం, ప్రాణం ముఖ్యం, తండ్రి లేని వాడివి, నిరాహార దీక్ష విరమించాలని ఒప్పించే ప్రయత్నం చేశామని హరీష్ రావు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపెట్టి నిరుద్యోగులను వాడుకొని వదిలిపెట్టారనీ, ఎన్నికలు అయిపోయాక నిరుద్యోగుల గుండెల మీద తన్నుతున్నదని ఆయన అన్నారు. ఆనాడు నిరుద్యోగుల కోసం ప్రొఫెసర్ కోదండరాం గారు, రియాజ్ గారు, బల్మూరి వెంకట్, మురళి గారు, రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్లు చుట్టూ తిరిగారు. బస్సు యాత్రలు చేశారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ కు తీసుకువచ్చి ప్రామిస్లు చేయించారని, వాళ్లకు పదవులు వచ్చాయని, నిరుద్యోగులకు రాలేదు అని అన్నారు.
రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ కు వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏడు నెలలు పూర్తయింది ఎందుకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఈ విషయమై నిరసన వ్యక్తం చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన గా అన్నారు.
అసెంబ్లీలో భట్టి విక్రమార్క గారు 1:100 ఎలిజిబిలిటీ గ్రూప్ వన్ మెయిన్స్ కి ఇవ్వాలన్నారనీ, ప్రొఫెసర్ కోదండరాం గారు ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టారని, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విద్యార్థులు న్యాయమైన డిమాండ్ అడుగుతున్నారనీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.