Sunday, December 29, 2024
HomeTelanganaBRS | విచార‌ణ క‌మిష‌న్ కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జ‌గ‌దీష్ రెడ్డి లేఖ‌

BRS | విచార‌ణ క‌మిష‌న్ కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జ‌గ‌దీష్ రెడ్డి లేఖ‌

✴️ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమీషన్‌కు మెయిల్ ద్వారా నా అభిప్రాయాన్ని పంపాను: జగదీష్ రెడ్డి

✴️ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

మాజీ మంత్రి, సూర్య‌పేట BRS ఎమ్మెల్యే జ‌గ‌దీష్ రెడ్డి తెలంగాణ భ‌వ‌న్ లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. గ‌త ప్ర‌భుత్వంలో విద్యుత్ కొనుగోళ్ళ‌కు సంబంధించి ఏర్పాటు చేసిన విచార‌ణ క‌మీష‌న్ కు మెయిల్ ద్వారా త‌న అభిప్రాయాన్ని పంపాన‌ని ఈ ప్రెస్ మీట్ లో వెల్ల‌డించారు.

కమీషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడంపై అభ్యంతరం తెలియ‌జేశారు. బిఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఛత్తీస్‌ఘడ్ నుండి 3.90 పైసలకు విద్యుత్ కొన్నామని ఆ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల నుండి విద్యుత్‌ను 17 రూపాయలకు కొంటున్న పరిస్థితి వుండేద‌ని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ విషయంలో ఇరుకున పెట్టాలని అప్ప‌టి సిఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశార‌ని, ఏడు మండలాలను ఆంధ్రాకు తీసుకుని సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీలో కలుపుకున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పీజీసీఎల్‌లో వాటా ఉండాలంటే ఏదో ఒక సంస్ధతో విద్యుత్ ఒప్పందం ఉండాల‌ని, తెలంగాణ విద్యుత్ కొనుగోలు చేసిన‌ప్పుడే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు 4.90 పైసలకు విద్యుత్ కొనుగోలు చేశాయ‌ని అన్నారు.

కేసీఆర్‌పై నింద వేద్దామని ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఈ ఆరోపణలు చేస్తున్న‌ద‌ని, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టార‌ని గుర్తు చేశారు.

సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 17 ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయ‌ని జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు. త‌మ ప్ర‌భుత్వంలో భద్రాద్రి 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, యాదాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టామ‌ని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయింద‌ని, అన్నీ అనుకూలంగా ఉన్న తర్వాతనే దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టామ‌ని వివ‌రించారు.

బొగ్గు కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంద‌ని, ప్రతి పవర్ ప్లాంట్ 10 శాతం విదేశీ బొగ్గును వాడాలని కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింద‌ని, సింగరేణి బొగ్గు ఉండటం వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఒప్పుకోలేద‌ని తెలిపారు.

త‌మ ప్ర‌భుత్వం(బిఆర్ఎస్) కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని తక్కువ రేటుకు ఇస్తే ఏపీ ప్రభుత్వం ఎక్కువ రేటుకు ఇచ్చింద‌ని ఆయ‌న అన్నారు.

విద్యుత్ విచారణ కమీషన్ ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేసింద‌ని, విద్యుత్ కొనుగోళ్ళలో ఆరు వేల కోట్ల నష్టం జరిగిందని తప్పుడు ప్రచారం చేశార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఛత్తీస్‌ఘడ్ నుండి తెలంగాణ ప్ర‌భుత్వం (ముఖ్య‌మంత్రి కేసీఆర్) మాత్ర‌మే విద్యుత్ కొనుగోళ్ళ ఒప్పందం చేసుకోలేద‌ని జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్, రమన్ సింగ్ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రులుగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం జరిగింద‌ని ఆయ‌న తెలిపారు.

విచారణ కమీషన్ సరిగా లేదని , వాస్తవాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే త‌ను విద్యుత్ విచారణ కమీషన్‌కు లేఖ రాశాన‌ని అన్నారు. విద్యుత్ ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగాయ‌ని, ఈ ఒప్పందాల‌లో లంచం తీసుకునే అవ‌కాశం ఉండ‌ద‌ని, త‌న లేఖ చూసిన త‌ర్వాతనైనా విచార‌ణ క‌మీష‌న్ ఛైర్మ‌న్ మ‌న‌సు మార్చుకుంటార‌ని భావిస్తున్నామ‌ని జ‌గ‌దీష్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

తాజా వార్తలు