Wednesday, January 1, 2025
HomeTelanganaMLC Election 2024 : రేపే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌.. 52 మందిలో గ‌ట్టెక్కెదేవ‌రో..?

MLC Election 2024 : రేపే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌.. 52 మందిలో గ‌ట్టెక్కెదేవ‌రో..?

హైద‌రాబాద్ : ఖ‌మ్మం – వ‌రంగ‌ల్ – న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు ఈ నెల 27వ తేదీన పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. 52 మంది అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో 4.63 ల‌క్ష‌ల మంది గ్రాడ్యుయేట్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 2,88,189 మంది పురుషులు, 1,75,645 మంది మ‌హిళ‌లు, ఐదుగురు ట్రాన్స్‌జెండ‌ర్లు ఉన్నారు.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ జిల్లాల ప‌రిధిలోని 34 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 605 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో స‌గ‌టున 800 మంది ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. 283 పోలింగ్ కేంద్రాల్లో 800 మంది కంటే ఎక్కువ‌గా ఓట‌ర్లు ఉన్నారు. 3 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి జ‌న‌గామ ఎమ్మెల్యేగా గెలుపొంద‌డంతో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ ఉంది. బీఆర్ఎస్ త‌ర‌పున ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ త‌ర‌పున గుజ్జుల ప్రేమేంద‌ర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మ‌ల్ల‌న్న బ‌రిలో ఉన్నారు. 2021లో జ‌రిగిన ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ తీన్మార్ మ‌ల్ల‌న్న‌, ప్రేమేంద‌ర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. నాడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి గెలుపొందారు. ఇక ఏనుగుల రాకేశ్ రెడ్డి 2023 న‌వంబ‌ర్‌లో బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు తీన్మార్ మల్ల‌న్న బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఖ‌మ్మం – న‌ల్ల‌గొండ – వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం ప‌రిధిలోని 34 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 33 చోట్ల కాంగ్రెస్ పార్టీనే గెలుపొందింది. కాబ‌ట్టి ఈ ఎన్నిక కాంగ్రెస్‌కు అనుకూలంగా మార‌నుందా..? లేక మ‌ళ్లీ బీఆర్ఎస్ అభ్య‌ర్థినే గెల‌వ‌నున్నాడా..? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

2021 ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల్లో రాజేశ్వ‌ర్ రెడ్డి గెలుపొంద‌గా, తీన్మార్ మ‌ల్ల‌న్న రెండో స్థానంలో, కోదండ‌రాం మూడో స్థానంలో, ప్రేమేంద‌ర్ రెడ్డి నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పుడు కోదండ‌రాం కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికే మ‌ద్ద‌తు ఇస్తున్నాడు. నాటి ఎన్నిక‌ల్లో తీన్మార్ మ‌ల్ల‌న్న స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు