Friday, April 4, 2025
HomeTelanganaMLC Jeevan Reddy | కాంగ్రెస్ లో కయ్యం.. కానరాని వియ్యం..

MLC Jeevan Reddy | కాంగ్రెస్ లో కయ్యం.. కానరాని వియ్యం..

రాహుల్ వేరు..రేవంత్ వేరు..

Janapadham_Epaper _TS_25-10-2024

కాంగ్రెస్ లో కయ్యం.. కానరాని వియ్యం..

రాహుల్ వేరు..రేవంత్ వేరు..

వేర్వేరు కాంగ్రెస్ లు..

ముఠా నాయకుడు పోచారం..

పది మంది చేరికలు సరికాదు..

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

పార్టీలో పరస్పర వ్యతిరేఖ ధ్రువాలు. పైకి అహా.. ఓహో.. అంటూ జబ్బలు చరుస్తున్న తీరేగానీ, లోపల మాత్రం ఎడ్డం అంటే తెడ్డం అన్న ధోరణే. ఆ మాటకొస్తే ఒకే పార్టీలో రెండు సిద్ధాంతాల మాదిరి పరిణామాలు సుస్పష్టంగా కనిపిస్తున్న ఆనవాళ్లు. హస్తినాలో ఒకరకమైన పాలసీతోసాగుతుండగా, హైదరాబాద్ లో మరోరకమైన ధోరణితో నడక సాగిస్తున్నది. నాయకులు పైకి అధిష్టానమే అల్టిమేట్ అన్నట్టుగా కలరింగ్ ఇచ్చినా., తరచిచూస్తే ఎవరికి వారే ఎవరి దారి వారిదే., ఎవడి ప్రత్యేక ధోరణి వారిదే అన్నట్టుగా మసులుకుంటున్నారు. మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటున్నారంటే నిజంగా అనుమానించాల్సిన దుస్థితిని కల్పించి మరీ పాలనను కలిసి కొనసాగిస్తున్నట్టు అనిపిస్తున్నది.

================

జనపదం, బ్యూరో

వియ్యం కానరాని కయ్యాల కాంగ్రెస్ ఇది. సీనియర్,జూనియర్ స్పష్టమైన విభజన రేఖ మధ్య అభిప్రాయ భేదాల విభజనా అతిస్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల కేటాయింపులో తీవ్ర అన్యాయంజరిగిందని, మొక్కుబడిగా అప్పగించిన పదవులతో నాలుక కూడా గీసుకోలేని పరిస్థితి అని పలువురు సీనియర్లు మొహం చాటేశారు. ముఖ్యమంత్రి తీరును తప్పుబడుతూ పాలనపై శ్రద్ధ వహించక తప్పించుకుని తిరుగుతున్నారు. అదే సమయంలో గ్రూపు రాజకీయాలు, నిన్నగాక మొన్నొచ్చిన వారికి అంధలాలు, ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నవారికి అంటీముట్టని తీరు పదవుల కట్టబెట్టడంతో అగాధాలు పెరుగుతూనే ఉన్నాయి. చూపుకు సుంగారంగా కనిపిస్తున్నా, తరచి గమనిస్తే అంతా డొల్లా అని తెలుస్తున్నది. రేవంత్ తీరుతో విసిగిపోతున్న వారు కొందరు అనుచుకుని నెట్టుకొస్తుండగా, మరికొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత వ్యవహారాలను మరోమారు తీవ్ర చర్చనీయాంశంగా నిలిపేలా చేశాయి.

కాంగ్రెస్ లో కయ్యం.. కానరాని వియ్యం..
రాహుల్ వేరు..రేవంత్ వేరు..
రాహుల్ అనుసరిస్తున్న తీరు వేరుగా కనిపిస్తుండగా, రేవంత్ ప్రవర్తిస్తున్న తీరు మరోటిగా అనిపిస్తున్నది ఒక్కమాటలో చెప్పాలంటే మొన్నటి వరకు భారత దేశమంతా ఓ రాజ్యాంగం అనుసరిస్తుంటే., కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగాన్ని వల్లెవేసినట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ఆయన తిరుగుతుంటే, అదే రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నాడని రేవంత్ మరకలు అంటించుకుంటున్నాడు. ఎవరిపైనో కోపంతో తనను తాను తగ్గించుకునే పనులకు శ్రీకారం చుట్టి పలుచనవుతున్న దాఖలాలు ప్రతిపనిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకే పార్టీరెండు విభిన్న పర్శ్వాల్లో కొట్టుమిట్టాడుతున్న విచిత్ర పరిస్థితి.
రేవంత్ తీరు పాత సీసాలో కొత్త సారా అన్నట్టుగా పాత మిత్రులందరినీ కొత్తగా పరిచయం చేస్తున్నట్టు కనిపిస్తున్నదని సహచరులే పెదవి విరుస్తున్నారు. తన వ్యక్తిగత బలాన్ని పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప పార్టీ ప్రయోజనాలను తుంగలో తొక్కేశాడని పలువురు ఒకటి రెండు సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించారు. దానికి తోడు పోచారం కూడా ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్న తీరు మరిన్ని ఆందోళనకు, అభిప్రాయభేదాలకు ఆజ్యం పోస్తున్నట్టుగా మారింది. కలిసొచ్చే వారంతా తనవారు., ఎదురు చెప్పే వారంతా పరాయి అన్నట్టుగా సాగుతున్న పాలనతో రాష్ట్రంలో కాంగ్రెస్ విభిన్న వాతావరణాలను చవిచూస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ పరిస్థితి ఎంత ఆందోళన కరంగా ఉందో చెప్పకనే చెబుతున్నది.

=======

ఇది సరికాదు..
వాళ్లు చేసిందే మనం చేస్తే వాళ్లకు మనకు తేడా ఏముంటది..
హైకమాండ్‌కు జీవన్ రెడ్డి లేఖ
ఎమ్మెల్యేల వలసలపై అసంతృప్తి..

రాష్ట్రంలో పార్టీ అనుసరిస్తున్న విధానాలు తనకు మింగుడుపడడం లేదని, ఆ మాటకొస్తే అసలు అవి జీర్ణించుకోలేపోతున్నానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చట్టంలోని లొసుగులను వాడుకుని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు దుర్మార్గమని, గతంలో బీఆర్ఎస్ పెద్దలు చేసిన తప్పిదమే మనమూ చేస్తున్నామని, దీంతో వారికి మనకు తేడా ఏముంటదని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామం ఎంతమాత్రం మంచిది కాదని ఎమ్మెల్సీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఆవేదనను వ్యక్తపరుస్తూ హైకమాండ్‌కు లేఖ రాశారు. తాను ఇలాంటి చర్యకు దిగుతున్నందుకు విచారిస్తున్నానని, ఎంతో మానసిక క్షోభతో లేఖ రాస్తున్నానన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారింది. కొంత కాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆయన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యతో తీవ్ర మనస్తాపంతో నిజాలన్నీ కక్కేశారు. రాష్ట్రం మెుత్తం కాంగ్రెస్ పాలన సాగుతుంటే జగిత్యాలలో మాత్రం బీఆర్ఎస్ పాలన సాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓ దండం అంటూ సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వ్యవహారశైలిపై సంచలన మాటలు మాట్లాడారు.

ఇదే పద్ధతి..
లొసుగులను వాడుకుని పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నామని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని కుట్రలను పన్నుతున్నామని మండిపడుతూ తన ఆవేదనను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రూపంలో పంపిచారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా సరే ఫిరాయింపులకు పాల్పడితే తక్షణమే వారిపై అనర్హత వేటు వేయాలని గతంలో పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారని గుర్తు చేస్తూనే తెలంగాణలో ప్రధాన పార్టీలు ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.

మీ కాంగ్రెస్ పార్టీకి ఓ దండం.. మమ్మల్ని బతకనివ్వండి అంటూ ఆయన చేసిన కామెంట్ష్ తీవ్ర దుమారమే రేపాయి. ‘నాడు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా దేశంలో ఒకే వ్యక్తి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ పోరాటం చేశారని, తెలివిగా అభివృద్ధి నెపంతో కొందరు పార్టీలు మారడం పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నా ఫిరాయింపుల వల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని లేఖ ద్వారా అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకు తెలిజేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లోని పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని, మానసిక వేదనతో లేఖ రాస్తున్నానని ఆవేదన వెలిబుచ్చారు.

RELATED ARTICLES

తాజా వార్తలు