నిడివి ఎంతున్నా చూస్తారా?..
‘సినిమా బాగుందా?’ ఈ ప్రశ్న అడగడం మర్చిపోయారు ప్రేక్షకులు. ‘సినిమా ఎంతసేపుంది?’ దీనికి వాళ్లు కోరుకున్న సమాధానం వస్తేనే.. ఆ చిత్రాన్ని చూసే సాహసం చేస్తున్నారు! ఓటీటీలో 1.25 స్పీడుతో సినిమాలు చూస్తున్న నేటి సమాజానికి కొత్త సినిమాలు సవాలు విసురుతున్నాయ్.
నిడివి ఎంతున్నా చూస్తారా?.. మీసం మెలేసి మరీ పిలుస్తున్న సినిమాలు!
‘సినిమా బాగుందా?’ ఈ ప్రశ్న అడగడం మర్చిపోయారు ప్రేక్షకులు. ‘సినిమా ఎంతసేపుంది?’ దీనికి వాళ్లు కోరుకున్న సమాధానం వస్తేనే.. ఆ చిత్రాన్ని చూసే సాహసం చేస్తున్నారు! ఓటీటీలో 1.25 స్పీడుతో సినిమాలు చూస్తున్న నేటి సమాజానికి కొత్త సినిమాలు సవాలు విసురుతున్నాయ్. మూడు గంటలకు పైగా నిడివితో ‘నేడే చూడండి’ అని తొడగొడుతున్నాయ్! ప్రేక్షకులను పడగొట్టే సినిమాలు కావివి! అందుకే మీసం మెలేసి మరీ పిలుస్తున్నాయ్. పది నిమిషాలు ఎక్కువైనా ఫర్వాలేదు షేర్‌ఖాన్.. ప్రతి సీనూ చిరిగిపోవాల్సిందే! అని ఫిక్సయిన బాపతు చిత్రాలు ఇవి.
వారం కిందట బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘కల్కి…’ సినిమా రన్‌టైమ్ మూడు గంటల ఒరు నిమిషం. ఈ వారం టాకీసుల్లో కేక పుట్టించడానికి వస్తున్న ‘భారతీయుడు-2’ సినిమా రన్ టైమ్ మూడు గంటల నాలుగు నిమిషాలు. రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాలకు అలవాటుపడిన తెలుగు ప్రేక్షకుణ్ని మూడేసి గంటలు కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు. పైగా ప్రయోగాత్మక చిత్రాల్లో కట్టడి చేయాలంటే సాహసమనే చెప్పాలి. ఈ లాంగ్ టైమ్‌లో ఓ పది నిమిషాలు బోర్ అనిపించినా సినిమా ఫసక్!
‘కల్కి..’ సినిమా రన్‌టైమ్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ కాస్తయినా కంగారుపడలేదు. రెండోపార్టు ఉన్నప్పుడు మొదటి భాగాన్ని కాస్త కుదించొచ్చు! కానీ, చెప్పాల్సిన కథను చెబుతూ, వేయాల్సిన చిక్కుముడులు వేస్తూ మెస్మరైజ్ చేశాడు. స్క్రిప్ట్‌లో కాస్త బోర్ అవుతారని అనుమానం వచ్చిన చోట క్యామియో అప్పియరెన్స్‌ను తెరపైకి తెచ్చి.. ప్రేక్షకులకు ఊరటనిచ్చాడు. ఆర్జీవీ అరంగేట్రం.. రాజమౌళి రంగప్రవేశం.. స్క్రీన్ బోరింగ్ కాకుండా ప్రేక్షకులను బోల్తా కొట్టించడానికే!
నాగ్ అశ్విన్ మాయ పూర్తయింది. ఇప్పుడు శంకర్ మార్కుకు టైమ్ వచ్చింది. కమర్షియల్ సినిమాలతో సమాజాన్ని కదిలించే కథ, కథనాలు పండించడంలో ఆయన సిద్ధహస్తుడు. కానీ, శంకర్‌కు కొంతకాలంగా కాలం కలిసి రావడం లేదు.
2010లో ‘రోబో’తో ఆల్‌టైమ్ రికార్డ్స్ అందుకున్న శంకర్ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేదు. ఇక లాభం లేదనుకొని తన అమ్ములపొదిలోని సేనాపతిని నమ్ముకున్నాడు.103 ఏండ్ల వృద్ధుడితో బాక్సాఫీస్‌పైకి దండయాత్రకు పూనుకుంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. సినిమా రన్‌టైమ్ మూడు గంటలా నాలుగు నిమిషాలన్న వార్త ఇండస్ట్రీలో కాస్త కలకలం రేపుతున్నది. సీరియస్ సబ్జెక్ట్‌తో అంత సమయం ప్రేక్షకులను సీట్లో కూర్చోబెట్టగలడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
‘భారతీయుడు’ సినిమాను వేలం వెర్రిగా చూసిన ఆ తరం కుర్రకారు.. ఇప్పుడు ఫ్యామిలీ బాధ్యతల్లో కూరుకుపోయిన కోవలోకి చేరిపోయారు. బాక్సాఫీస్‌ను శాసించే జనరేషన్ జెడ్ నిమిషం కుదురుగా కూర్చోదు. అలాంటి యంగ్ తరంగ్‌లను మూడు గంటలకు పైగా థియేటర్‌లో కురువృద్ధ సేనాపతి కూర్చోబెట్టగలడా? అన్నది డౌట్! ఆ పెద్దాయన అలా కూర్చోబెట్టేలా శంకర్ ఏం మాయ చేశాడన్నది చూడాలి! ‘భారతీయుడు-3’ కూడా ఉండబోతున్నదని ఆయన ప్రకటించేశాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిడివి ఓ పదిహేను నిమిషాలు కుదించుకుంటే బాగుండేది అంటున్నారు శంకర్ శ్రేయోభిలాషులు. సబ్జెక్ట్ డిమాండ్ చేయడం వల్ల.. తప్పడం లేదని ఆయన వాదన. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ సినిమా పరాజయానికి నిడివి కూడా ఒక కారణమే! అదే బంపర్ హిట్ అవ్వాల్సిన ‘శివాజి’ కాస్త జోరు తగ్గింది. గత అనుభవాల నేపథ్యంలో.. ‘భారతీయుడు 2’ను చిత్ర నిడివి ఏ గట్టున నిలుపుతుందో చూడాలి.
మూడు గంటలకు పైగా నిడివితో తెలుగులో, హిందీలో చాలా సినిమాలు ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో మూడేసి గంటలు కామన్. చిత్రరాజాల జాబితాలో చోటు దక్కించుకున్న పాతాళభైరవి నిడివి 3 గంటల 18 నిమిషాలు. మిస్సమ్మ కూడా మూడు గంటల పది నిమిషాలలోపు సినిమా. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక రన్‌టైమ్ ఉన్న సినిమా ‘దానవీరశూర కర్ణ’. ఈ చిత్రం రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 46 నిమిషాలు. ఎన్టీయార్ త్రిపాత్రాభినయం, మాటలు, యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకుడిని కట్టిపడేశాయి. అంజలీదేవి, ఎన్టీయార్ సీతారాములుగా నటించి తెలుగువారి నీరాజనాలు అందుకున్న సినిమా ‘లవకుశ’. ఉత్తర రామాయణ కథతో తెరకెక్కిన ఈ సినిమా నిడివి 3 గంటల 28 నిమిషాలు. పాటలు, పద్యాలు, కథలో భావోద్వేగాలు పక్కాగా పండటంతో లవకుశ ఆల్‌టైమ్ హిట్ జాబితాకెక్కింది.
బాలీవుడ్‌లోనూ భారీ రన్‌టైమ్ చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిస్తే.. కొన్ని నిర్మాతలకు కన్నీళ్లు మిగిల్చినవీ ఉన్నాయి. షో మ్యాన్ రాజ్‌కపూర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మేరా నామ్ జోకర్’. ఆ రోజుల్లో భారీ సెట్లతో, విదేశాల్లో షూటింగ్ జరుపుకొన్న ఈ చిత్రం గురించి విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రం నిడివి తెలిశాక కొందరికి గుండె ఆగినంత పనైంది. ఈ సినిమా రన్‌టైమ్ 4 గంటల 15 నిమిషాలు. రెండు ఇంటర్వెల్స్ కూడా ఇచ్చారట. అయితే ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉండటంతో భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ‘మేరా నామ్ జోకర్’కు ముందు రాజ్‌కపూర్, రాజేంద్రకుమార్, వైజయంతిమాల కాంబినేషన్‌లో ‘సంగం’ సినిమా వచ్చింది. ఆ సినిమా నాలుగు గంటల రన్‌టైమ్‌తో తెరపై ఆడింది.
పాటలు హిట్టవ్వడం, కథ బాగుండటం, భావోద్వేగాలు బలంగా పండటంతో సినిమా ఆడింది. నాలుగు గంటల మార్క్ దాటిన మరో హిందీ సినిమా ‘ఎల్‌ఓసీ- కార్గిల్’. 1999 కార్గిల్ యుద్ధంలో భారతీయ సైనికుల త్యాగాలను ఇతివృత్తంగా చేసుకొని ఈ సినిమా తీశారు. ఇది మంచి విజయాన్ని అందుకుంది. క్రికెట్ నేపథ్యంలో ఆమిర్‌ఖాన్ హీరోగా వచ్చిన సినిమా ‘లగాన్’. ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటల 44 నిమిషాలు. ఈ సినిమా రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. షారుఖ్, అమితాబ్, ఐశ్వర్యరాయ్ కాంబోలో వచ్చిన ‘మొహబ్బతే’ నిడివి 3 గంటల 36 నిమిషాలు ఇదీ సూపర్ హిట్ అయింది. ‘కబీ అల్విదా న కెహెనా’, ‘సలామ్ ఇష్క్’, ‘ఖతర్నాక్’ (1990), ‘జోదా అక్బర్’, ‘మొఘల్ ఎ ఆజమ్’ సినిమాల రన్ టైమ్ మూడు గంటల మార్కు దాటినవే! మంచి కథ, కథనాలు ఉన్నవి విజయాలు సాధించాయి. స్క్రిప్ట్ బలహీనంగా ఉన్నవి పరాజయాన్ని మూటగట్టుకున్నాయి.
చివరగా.. సినిమా ఎంత నిడివి ఉందన్నది ముఖ్యం కాదు. స్క్రిప్ట్ ఎంత పకడ్బందీగా ఉందన్నది ప్రధానం. ప్రేక్షకులు బోర్ ఫీలవ్వకుండా చేయగలిగితే.. ఆ సినిమా మూడున్నర గంటలున్నా ముచ్చటగానే ఉంటుంది. ప్రాధాన్యం లేని పాత్రలతో.. పనికిరాని ప్రయోగాలు చేస్తే… నిడివి తక్కువుంటే చెప్పలేం కానీ, ఎక్కువుంటే మాత్రం నిర్మాత బొక్కబోర్లా పడటం ఖాయం.