అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అధికార, ప్రతిపక్షాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. కాపుల రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని పవన్ అడుగుతున్నారని, వారిని ప్రశ్నించే హక్కు ఆయనకు ఎక్కడదని ముద్రగడ నిలదీశారు. ఎక్కడి నుంచో ముఖానికి రంగులు వేసుకుని వచ్చేస్తే పిఠాపురం ప్రజలు ఓట్లు వేసి గెలిపించేస్తారని పవన్ అనుకుంటున్నాడేమో.. పిఠాపురం ప్రజలు మాత్రం ఆయనను తన్ని తరిమేయడానికి సిద్ధంగా ఉన్నారని ముద్రగడ స్పష్టం చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఏపీ ప్రజలు తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు. ఏపీ అధికారం చేపట్టబోయేది జగనే అని ముద్రగడ తేల్చిచెప్పారు.