World Super Rich Club | ప్రపంచంలోని సూపర్ రిచ్ క్లబ్‌లో (World Super Rich Club) భారత కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు స్థానం సంపాదించారు. 100 బిలియన్ డాలర్లకు పైగా సంపద కలిగిన వారిని సూపర్ రిచ్ అంటారు. ఇలాంటి సూపర్ రిచ్ క్లబ్‌లో సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఈ జాబితాలోకి ఇంత మంది చేరడం ఇదే మొదటిసాకని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. జాబితాలోని 15 మంది సంపద ఈ ఏడాది ఏకంగా 13 శాతం పెరిగి 2.2 ట్రిలియన్ డాలర్లకు చేరిందని తెలిపింది. కృత్రిమ మేధ, విలాస వస్తువులకు గిరాకీ పెరగడం, భౌగోళిక రాజకీయాల్లో మార్పులు, ద్రవ్యోల్బణం మొదలైన కారణాల వల్ల వీరి సంపద భారీగా వృద్ధి చెందిందని పేర్కొంది. ప్రపంచంలోని తొలి 500 మంది ధనవంతుల సంపదలో, పావు వంతు కేవలం ఈ 15 మంది వద్దే ఉండడం గమనార్హం.
ఎల్‌వీఎంహెచ్ వ్యవస్థాపకుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ 222 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 208 బి.డాలర్లు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 187 బి.డాలర్లుతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. టెస్లా షేర్ల పతనం కారణంగా ఎలాన్ మస్క్ సంపద ఈ ఏడాది ఏకంగా 40 బిలియన్ డాలర్లు కుంగడం గమనార్హం.
100 బిలియన్ డాలర్ల మైలురాయిని అందుకున్న తొలి మహిళగా ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ రికార్డు సృష్టించారు. సౌందర్య ఉత్పత్తుల కంపెనీ అయిన లోరియల్ షేర్లు రాణించడమే దీనికి కారణం. గ్లోబల్ సూపర్ రిచ్ క్లబ్‌లో 101 బిలియన్ డాలర్లతో ఆమె 14వ స్థానంలో ఉన్నారు.