Mumbai Indians| ఐపీఎల్ సీజన్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టు టైటిల్ ఫేవరేట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగింది.ఈ సారి రోహిత్‌ని పక్కన పెట్టి హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇచ్చారు. ఎలాంటి అద్భుతాలు జరుగుతాయా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. కాని మొత్తంగా 3 మ్యాచ్‌లు గెలిచి 8 మ్యాచ్‌లు ఓడింది. ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండగా, వాటిలో గెలిచిన కూడా లాభం లేదు. మొత్తానికి ఈ ఏడాది ముంబై పోరాటం చాలా చప్పగా సాగింది. అభిమానులకి నిరాశని మిగిల్చింది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో హార్దిక్ సేన 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది..170 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించలేక చతికిలపడింది. గెలిచే మ్యాచ్‌లోను ఓడిపోయి ప్లేఆఫ్స్ ఆడకుండానే ఇంటికి వెళ్లనుంది ముంబై ఇండియన్స్.
ఈ మ్యాచ్‌లో ముందుగా కేకేఆర్ బ్యాటింగ్ చేసింది. కేకేఆర్ బ్యాట్స్‌మెన్స్‌ని కూడా ముంబై ఇండియన్స్ బౌలర్స్ ఇబ్బంది పెట్టారు. అయితే వెంకటేశ్ అయ్యర్(52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) అర్ధ సెంచరీతో రాణించగా..ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మనీష్ పాండే(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) కీలక ఇన్నింగ్స్ ఆడివిలువైన పరుగులు చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. ఇక ముంబై బౌలర్లలో నువాన్ తుషారా, జస్‌ప్రీత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు దక్కించుకున్నాడు. స్పిన్నర్ పియూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది.
ఇక 170 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే పెద్ద దెబ్బ పడింది. స్టార్క్ వేసిన రెండో ఓవర్‌లోనే ఇషాన్ కిషన్(13) క్లీన్ బౌల్డ్ అయి పెవీలియన్ బాట పట్టాడు. ఇక కొద్ది సేపటికే నమన్ ధీర్(11) వరుణ్ చక్రవర్తీ బౌలింగ్ అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. రోహిత్ శర్మ(11) కూడా పెద్దగా పరుగులు చేయకుండా సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలో పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. అయితే సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) అర్ధ సెంచరీ చేసి ఔట్ కాగా, చివరిలో టిమ్ డేవిడ్ కాస్త మెరుపులు మెరిపించాడు. అయితే అతను అతని పోరాటం ఫలించలేదు.