Mumbai Rains | ముంబయి నగరంలో సోమవారం సాయంత్రం దుమ్ముధూళితో భారీ వర్షం కురిసింది. పెనుగాలులకు ఘాట్కోపర్ ప్రాంతంలోని చెడ్డానగర్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన 230 అడుగుల పొడవైన భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. హోర్డింగ్ పెట్రోల్ బంక్‌పై పడిపోయింది. దారి బరువుకు బంక్ పైకప్పు నేలకూలింది. దాంతో దాని కింద చిక్కుకున్న 14 మంది మృతి చెందారు. మరో 70 మందికిపైగా గాయాలకు గురయ్యారు. ఘటన అనంతరం సంఘటనా శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ రంగంలోకి దిగింది.
మంగళవారం తెల్లవాఉ జాము వరకు ఎనిమిది మంది మృతదేహాలను వెలికి తీసింది. మరో నలుగురు శిథిలాల్లో చిక్కుకుపోయినట్లుగా గుర్తించింది. పెట్రోల్ బంకులో భారీ స్థాయిలో పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి. సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని ఎన్‌డీఆర్‌ఎప్ అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండవచ్చని బీఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున సహాయం ప్రకటించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అయితే, హోర్డింగ్‌ను అనుమతి లేకుండా ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. స్థల యజమానితో పాటు హోర్డింగ్ ఏర్పాటు చేసిన వ్యక్తులపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.