Friday, December 27, 2024
HomeUncategorizedMusi Rejuvenation | నేతల వాదనంతా దాని చుట్టే..

Musi Rejuvenation | నేతల వాదనంతా దాని చుట్టే..

JanaPadham_EPaper_TS_18-11-2024

మూసీల బొర్లుతాండ్లు..
నది ప్రక్షాళనపై ముష్టి యుద్ధం..

నేతల వాదనంతా దాని చుట్టే..
మహారాష్ట్ర వేదికగా హస్తం.., కమలం.. సిగపట్లు..
దుమ్మెత్తిపోసుకుంటున్న కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి
అవకాశం చూసి విరుచుకుపడుతున్న పార్టీలు..

నాయకులంతా మూసీల బొర్లుతాండ్రు. మేం పూసుకుంటమంటే.., మేం పూసుకుంటమని పోటీపడుతాండ్రు. ఎక్కడ క్రెడిట్ పక్కోడు ఎగరేసుకుపోతడో అని ఎగిరెగిరిపడుతున్నరు. ఎంత పూసుకుంటూ అంత పనిచేస్తున్నట్టుగా భావించి పోటాపోటీగా అంటించుకుంటున్నరు. అక్కడ కాదు., ఇక్కడ కాదు., ఏకంగా పక్కరాష్ట్రమైన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా మూసీ ముచ్చట్లతోనే జనాలను వశపర్చుకోవడానికి శతథా ప్రయత్నాలు చేస్తున్నరు. ఆ ప్రక్షాళనేంటో.., అందుకు కాంగ్రెస్ సర్కార్ ప్లానేంటో.., అది ఎప్పటికి పూర్తవుతుందో.. గానీ ఇప్పుడైతే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఉతికి ఆరేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కమలం పార్టీ నేతలైతే ఏకంగా నిద్ర అంటూ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇక్కడి పేదలను ప్రసన్నం చేసుకోవడంతో పాటు దానిని అక్కడ కూడా ప్రచారం చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
===================
జనపదం, బ్యూరో

అటు తిరిగి, ఇటు తిరిగి ఆఖరుకు మూసీ వైపు మళ్లింది. రాజకీయం అంతా మూసీ కేంద్రంగా పొర్లుతున్నది. అప్పుడెప్పుడో హైడ్రాతో రగులుకున్న రవ్వకు బీఆర్ఎస్ మరింత వత్తి అంటించడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఆ తర్వాత కొద్దికొద్దిగా చెలరేగుతూ ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే స్థాయికి ఎగశాయి. మూసీ నిద్రంటూ కమలం నేతలు హడావుడి చేస్తుంటే.., నిద్ర చేయగానే సరిపోదు మూసీ నీళ్లతో స్నానం కూడా చేయాలని హస్తం నేతలు సవాళ్లు విసిరారు. మహారాష్ట్ర రాజకీయాల్లో మూసీ కూడా కీలక భూమిక పోషించేలా ఎదిగిందంటే అది ఆ రెండు పార్టీల చొరవే అని చెప్పాల్సిందే. పేద ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్పుకోవడానికా.., లేదంటే నిజంగా వారి ప్రయోజనాలు కాపాడడానికి అన్న విషయమై ఇప్పటికిప్పుడు స్పష్టంగా చెప్పలేంగానీ జనాలు మాత్రం అన్ని పార్టీల వేషాలు గమనిస్తూ ఏదైనా జరుగకపోతుందా అనే కోణంలో వెయిట్ అండ్ సీ అన్నట్టుగా ఉన్నారు.

సవాల్.. ప్రతిసవాల్..
రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. కొన్ని రోజులుగా మూసీ ప్రక్షాళన అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఘాటు విమర్శలు, జోరు సవాళ్లు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే.. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి ఓ సవాల్ విసరగా.. దాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు చేసే విమర్శలకు చాలా ఘాటుగా తిప్పికొడుతున్నారు.

సవాల్ ఏందంటే..
మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేద ఇండ్లు కూల్చితే ఊరుకునేది లేదని పేదల ఇళ్లపైకి వచ్చే బుల్డోజర్లకు తాము అడ్డుగా ఉంటామంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్తూ వస్తుండగా.. దానికి రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇలాంటి సందర్భంలోనే మూసీ ప్రక్షాళకు అడ్డొస్తే అడ్డొచ్చిన వాళ్లందరినీ బుల్డోజర్లతో తొక్కిస్తా అంటూ హాట్ కామెంట్స్ చేయటం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పేదల కోసం పరితపించే ఆ ప్రతిపక్ష నేతలు వాళ్లు ఉంటున్న ప్రాంతాల్లో ఓ రెండు మూడు రోజులు ఉండి అంతా బాగానే ఉందని చెప్తే వెంటనే ప్రాజెక్టును విరమించుకుంటానంటూ సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, ఈటల మూడు రోజులు ఉండాలని వారికి అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానని చెప్పుకొచ్చారు.

స్వీకరించిన కేంద్ర మంత్రి..
అయితే, రేవంత్ రెడ్డి చేసిన ఈ ఛాలెంజ్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఇండ్లు కూల్చొద్దంటుంటే అడ్డమొచ్చినవారిని బుల్డోజర్లతో తొక్కిస్తానంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, పేదల కోసం చావటానికైనా సిద్ధమేనని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నిద్ర కార్యక్రమం చేపట్టారు.శనివారం రాత్రి అంబర్‌పేట ప్రాంతంలోని తులసి రామ్ నగర్‌లో మూసీ పేదలు నివాసముంటున్న ప్రాంతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా.. ముఖ్య నేతలు బస్తీ నిద్ర చేశారు. కిషన్ రెడ్డితో పాటు, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కె. లక్ష్మణ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇతర నేతలు మూసీ పరివాహకంలోని 20 ప్రాంతాల్లో రాత్రి బస చేశారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆదివారం వరకు బీజేపీ నేతలు ఆయా ప్రాంతాల్లో రాత్రి బస చేశారు.

ఇటు బీఆర్ఎస్..
బీఆర్‌ఎస్‌ నేతలు కూడా మూసీ పరీవాహక ప్రాంతాల్లో జోరుగా పర్యటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు మూసీ బాధితులకు అండగా నిలిచారు. అయితే.. బీజేపీ నేతలు కేవలం పర్యటించటమే కాకుండా.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఛాలెంజ్‌ను కూడా స్వీకరించి.. బస్తీల్లో నిద్ర చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి బీజేపీ చేపడుతున్న ఈ బస్తీ నిద్రలను కూడా కాంగ్రెస్ తిప్పికొడుతుందా.. తర్వాత కార్యాచరణ ఏంటీ అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో వెలిగొండ నుంచి చార్మినార్ వరకు పాదయాత్ర చేయనున్నట్టు ప్రకటించనున్నారు.

సీఎం కొత్త స్కెచ్‌..
మూసి విషయంలో బీఆర్ఎస్ రాజకీయాన్ని కాంగ్రెస్ నల్లగొండ సెంటిమెంట్ తో ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. దీనికి దీటుగా బీఆర్ఎస్ కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కార్యాచరణను రూపొందిస్తోంది. ఆరు నూరైనా మూసీ నది పునరుజ్జీవం కోసం ముందుకు వెళతామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ దిశలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో మూసి పునర్జీవ సంకల్ప పాదయాత్రతో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. నల్లగొండ సెంటిమెంట్ ను పండించి.. బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందన్న టాక్‌ వినిపిస్తోంది. వ్యూహాత్మకంగానే సీఎం రేవంత్ తన బర్త్ డే రోజున మూసీ పునర్జీవ సంకల్ప పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ నల్లగొండ సెంటిమెంటుకు దీటుగా బీఆర్ఎస్ మూసి ఎజెండాను సిద్ధం చేస్తోంది. మూసీ పాపం కాంగ్రెస్ దే అంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. నల్లగొండ సెంట్రిక్ గా మూసీ పునర్జీవనం కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య పొలిటికల్ వార్ గా మారింది. ఈ సమయంలోనే మూసీ పునర్జీవనంపై కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య రాజకీయ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. సీఎం రేవంత్ పాల్గొన్న మూసి పునర్జీవ సంకల్ప యాత్రతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మూసీ పునర్జీవ సంకల్ప యాత్ర పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. మూసి ప్రక్షాళన చేసి తీరుతామని అధికార కాంగ్రెస్, అడ్డుకుంటామని బీఆర్ఎస్ ప్రకటించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల రాజకీయ యుద్ధం మొదలైంది. హైదరాబాద్ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్, బీజేపీ అగ్ర నేతలు విమర్శల దాడి చేస్తున్నారు. రేవంత్ సర్కార్ చేపట్టిన మూసీ పునర్జీవనంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టడంతో మూసీ ప్రకంపనలు.. ఇపుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాకాయి. మూసీనది ప్రక్షాళన, పునర్జీవనంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలతో జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కింది.

నల్లగొండ సెంటిమెంట్‌తో రాజకీయం..
రాష్ట్రంలో పొలిటికల్ వార్ గా మారిన మూసీ పునర్జీవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ గా తీసుకున్నారు. మూసీ రాజకీయాలు నల్గొండ సెంట్రిక్ గా మారాయి. మూసీ ప్రక్షాళనే తప్పు అన్నట్టుగా బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను సీఎం రేవంత్ తిప్పి కొట్టారు. జనవరి తొలివారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి నుంచి పాదయాత్ర చేస్తానని రేవంత్ ప్రకటించారు. దీంతో మూసీ వివాదంపై బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ నల్లగొండ సెంటిమెంటును ఎత్తుకున్నారు. మూసీ కాలుష్య మురుగు నీటితో అష్టకష్టాలు పడుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల బాధలు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగినట్లు ప్రచారం చేశారు. మూసి ప్రక్షాళనను వ్యతిరేకిస్తే అది నల్లగొండ ప్రజల్ని వ్యతిరేకించినట్లేనన్న సెంటిమెంటును తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోంది. మూసిని రాజకీయ అంశం చేసి సెంటిమెంట్ను రేపితే బీఆర్ఎస్ ను ఇరకాటంలో పడేయొచ్చని కాంగ్రెస్ ప్లాన్. అందుకే కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లాపై మూసీ అస్త్రం ప్రయోగిస్తోంది.

మూసీ పాపం ఎవరిది..?
కాంగ్రెస్ సర్కారు ప్రయోగిస్తున్న మూసి అస్త్రాన్ని బీఆర్ఎస్ నేతలు తిప్పికొడుతున్నారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని.. దానిలోని దోపిడీకే వ్యతిరేకమని బీఆర్ఎస్ రేవంత్ సర్కార్ పై విమర్శ దాడి కొనసాగిస్తాంది. అందుకే మూసి విషయంలో బీఆర్ఎస్ రాజకీయాన్ని కాంగ్రెస్ నల్లగొండ సెంటిమెంట్ తో ఎదుర్కొనాలని భావిస్తున్నది. దీనికి దీటుగా బీఆర్ఎస్ కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కార్యాచరణను రూపొందిస్తోందని సమాచారం. మూసి పాపం కాంగ్రెస్ దే అంటూ మూసి పరివాహక ప్రాంత ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు బీఆర్ఎస్ దండయాత్రకు సిద్ధమవుతోంది. ఉమ్మడి నల్గొండ నుండి మూసి పునర్జీవనంపై పోరును మరింత ఉధృతం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటిఆర్, హరీష్ రావులతో మూసి ఎజెండాగా జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని నేతల భావిస్తున్నారు.

క్లైమాక్స్ కు యుద్ధం..
మూసీ కోసం యుద్ధం మరో లెవల్‌కు వెళ్లింది. కాషాయసేన కదం తొక్కుతోంది. సర్కార్‌కు ఛాలెంజ్‌ విసురుతోంది. మూసీ పునరుజ్జీవం అని ప్రభుత్వం అని ప్రభుత్వం అంటుంటే, ఆ పేరుతో ఇళ్లు కూల్చొద్దని బీజేపీ అంటోంది. మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడితే బుల్జోజర్లతో తొక్కిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరికలకు బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. మూసి ప్రాంతం పేదలకు మనోధైర్యం కల్పిందేందుకు, వారికి అండగా ఉంటానని కిషన్ రెడ్డి ఘాటుగా రియాక్షన్ అయ్యారు.. సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టిన కిషన్ రెడ్డి.. బుల్డోజర్లు వస్తే చావడానికైనా సిద్ధమేనని చెప్పారు. ఈ క్రమంలోనే మొన్న రేవంత్‌ పాదయాత్ర చేస్తే మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్రకు దిగింది. ఇప్పటికే బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకించారు. తాము ఉన్నామంటూ ప్రజల తరపున కాషాయ నేతలు గళం విప్పారు. పేదల ఇళ్లు కూల్చొద్దని డిమాండ్ చేస్తున్న బీజేపీ .. మూసీ పునరుజ్జీవంపై సమగ్ర నివేదికకు పట్టు బడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సమయంలో మూసి వద్దా నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. దానికి తగినట్లుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నిద్ర కార్యక్రమం చేపట్టారు. దీంతో మూసీ ప్రక్షాళన చాటున రాజకీయం హీటెక్కినట్లుగా మారింది.

వెయిట్.. అండ్ సీ…
మూసీ ప్రక్షాళన అని కాంగ్రెస్ సర్కార్ అంకురార్పణ చేసిన నుంచి బీఆర్ఎస్, బీజేపీ విరుచుకపడుతున్నాయి. పేదల ఇండ్లను ఇష్టారీతిగా తొలగించడానికి తాము పూర్తిగా వ్యతిరేకమని పేర్కొంటూ సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆ విషయంలో బీఆఱ్ఎస్ ఓ అడుగు ముందే ఉంటూ తాము ముమ్మాటికి పేదల పక్షాన నిలుస్తామని తమ ప్రాణాలైనా అర్పించి సొంతింటి కల నెరవేర్చుకోవడానికి జీవితకాలాన్ని త్యాగం చేసిన వారికి మాత్రం లబ్ధి చేకూర్చే పనిలో ముందుంటామని గులాబీ నేతలు ప్రకటించారు. ఆ స్థాయిలో పోరాటాలు కూడా చేశారు. అప్పుడు కాస్తో కూస్తో ఖండనలు చేస్తూ, కాస్త వెనకబడినట్టుగా ఉన్న బీజేపీ మాత్రం ఈ మధ్యకాలంలో విపరీతంగా పుంజుకున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ దూకుడు పెంచిందానే చెప్పాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ నిద్రకు పిలుపునివ్వడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా విపరీతంగా మాట్లాడుతున్నారు. దానికి తానేం తక్కువ కాదన్నట్టుగా ముఖ్యమంత్రి కూడా కౌంటర్లు ఇస్తూ పోటాపోటీగా ఆటను రక్తి కట్టిస్తున్నారు. ఇలా మూడు పార్టీల మధ్య మూసి మురిగిపోతుందా.., మంచేదైనా జరుగుతుందా అనేది తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

RELATED ARTICLES

తాజా వార్తలు