Live-in Relationship | లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవిత భాగస్వామి ఉండగా.. వేరొకరితో సహజీవనంలో ఉండే ముస్లింలు ఎలాంటి హక్కులను పొందలేరని.. అలాంటి బంధం ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న స్నేహాదేవి, మహ్మద్ షాదాబ్ ఖాన్ జంట దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ ఏఆర్ మసూది, జస్టిస్ ఏకే శ్రీవాస్తవ నేతృత్వంలోని లక్నో బెంచ్ విచారణ జరిపింది.
పిటిషనర్లు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండగా.. తమ కూతురిని కిడ్నాప్ చేశారంటూ స్నేహాదేవి తల్లిదండ్రులు మహ్మద్‌ఖాన్‌పై కిడ్నాప్ కేసుపెట్టారు. దాంతో ఆమెను తల్లిదండ్రుల వద్దకు పంపాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే, తాము స్వేచ్ఛగా జీవించేందుకు రక్షణ కల్పించాలంటూ స్నేహాదేవి, మహ్మద్ షాదాబ్ కోర్టును ఆశ్రయించగా.. అలా సాధ్యం కాదని స్పష్టం చేసింది. సహజీవన స్వేచ్ఛకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించిన కోర్టు.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
ఇస్లాం సహజీవనాన్ని అనుమతించదని.. ఇద్దరు వ్యక్తులు అవివాహితులైతే పరిస్థితులుగా వేరుగా ఉంటాయని.. జీవితభాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉంటుందని బెంచ్ పేర్కొంది. మహ్మద్‌కి 2020లో ఫరీదా ఖాతూన్ అనే మహిళతో వివాహం అయ్యింది. ఖాన్ దంపతులకు ఓ కూతురు కూడా ఉందని విచారణలో తేలింది. వివాహ వ్యవస్థల విషయంలో రాజ్యాంగ నైతికత, సాంఘిక నైతికతలు సమతుల్యంగా ఉండాలని.. ఈ విషయంలో వైఫల్యాలు చోటుచేసుకుంటే సమాజంలో శాంతి, సామరస్య పరిస్థితులు మసకబారతాయంటూ వ్యాఖ్యానించింది.