Thursday, April 3, 2025
HomeTelanganaKonda Surekha | నోటి దూల..

Konda Surekha | నోటి దూల..

బర్తరఫా..? సేఫా..?

JanaPadham_EPaper_TS_05-10-2024

నోటి దూల..

బర్తరఫా..? సేఫా..?

హైకమాండ్ పై ఒత్తిడి..
ప్రియాంక రంగప్రవేశం..
అమలతో బుజ్జగింపులు..
ససేమిరా అంటున్న నాగార్జున
తన కుటుంబానికి సారీ చెప్పాలని డిమాండ్..
రూ.100 కోట్లకు పరువు నష్టం దావా..?
ఐన్ స్టీన్ కు కూడా అర్థం కాని ఫార్ములా సురేఖది.. : ఆర్జీవీ

కేవలం… నోటి దూలే.
విషయం లేదు., సందర్భం కాదు., కానీ అచ్చిపచ్చి మాటలతో ఆగమాగం చేసుకున్న నోటి దూల.
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మరీ, సిల్లీగా చేసిన కామెంట్స్ తో పరువు మొత్తం తీసుకున్న దూల.
చేసిన పనికి ప్రాయశ్చితపడాల్సింది పోయి, ఇంకా సమర్థించుకునే టెంపరితనంతో మరింత పలుచనైనా దూల.
మైకుంది కదా అని రెచ్చిపోవడం, నోరుంది కదా అని వాగడంతో సభ్యసమాజంలో చులకనైన దూల.
మహిళగా సాటి మహిళను కూడా గుర్తించకుండా రాయడానికి కూడా మనసొప్పని ముచ్చట్లతో పరువు మొత్తం గంగలో కలుపుకున్న దూల.
అన్నీ జరిగాక వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి., మళ్లీ వివరాలు లాగే అతి తెలివితో బొక్కబోర్లా పడ్డ దూల.
మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం.,అంతకు మించి ప్రజలతో సంబంధాలన్నీ ఒక్క మాటతో పేకమేడలా కూలిన దూల.
అన్నింటికన్నా ముఖ్యంగా శత్రువును ఢీకొట్టే శక్తి లేక, మధ్యలో అల్పప్రాణిని బలిచేసిన దూల.
ఆఖరికి సీటు చించే వరకెళ్లిన దూల., కొంప ముంచే దుస్థితి తీసుకొచ్చిన దూల.

జనపదం, బ్యూరో

కొంప ముంచింది. నాలుక అదుపులో పెట్టుకుని ఆచీతూచి మాట్లాడితే సరిపోయేదానికి ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడి మొదటికే మోసం అయ్యేలా చేసుకుంది. ఎంతో విచక్షణతో కష్టతరమైన సమయాల్లో కూడా తెలివిగా మాట్లాడి మెప్పించిన సురేఖ ఇప్పుడు మంత్రిగా మాత్రం ఇతరులను నొప్పిస్తూ అపకీర్తిని మూటగట్టుకుంటున్నది. అంతటి స్థానంలో ఉండి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ సభ్యసమాజంలో చులకనైంది. పార్టీ కట్టుబాట్లు పట్టించుకోకుండా, సర్కార్ లో ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి తీవ్ర విమర్శల పాలవుతున్నది. పిల్లినేమీ చేయలేక., ఎలుకమీద ప్రతాపం చూపినట్టు, శత్రువును ఢీకొట్టలేక ఇంకెవరినో బలిచేసినట్టుగా మారింది ఆమె తీరు తీవ్ర దుమారం రేపుతున్నది.

హైకమాండ్ పై ఒత్తిడి..
మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఒక మహిళ అయి ఉండి మరో మహిళ పరువును బజారుకు ఇడ్చిన మంత్రి తీరును ప్రతి ఒక్కరూ ఖండిస్తూనే ఉన్నారు. బాధ్యతలు మరిచి నడుచుకుంటున్న సురేఖ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మహిళా మంత్రిపై కఠినంగా వ్యవహరించాలనే ఒత్తిడి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పార్టీ కట్టుబాట్లు, పదవి విలువలు కూడా చిన్నబుచ్చుకునేలా మాటతీరుతో పలుచనవుతున్న ఆమెపై వేటు వేసి బుద్ధి చెప్పాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ మేరకు హైకమాండ్ దృష్టికి సురేఖ ఎపిసోడ్ ను తీసుకెళ్లి తదుపరి చర్యలపై ప్రెజర్స్ పెంచుతున్నారు.

మంత్రి పదవి ఔట్.. ?

మరో బీసీకి అవకాశం..!

అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లింక్ పెడుతూ సంచలన కామెంట్స్ చేసిన మంత్రి కొండా సురేఖపై హై కమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జరిగిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి ఇంతకు మించిన ఆప్షన్ లేదని హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారట. కొండా సురేఖ స్థానంలో మరొక బీసీకి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.

ప్రియాంక రంగప్రవేశం..
మంత్రి కొండా సురేఖ తెలంగాణ రాష్ట్రంలో రేపిన దుమారం హస్తినా పెద్దలను తాకింది. పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని అధిష్టానానికి సమాచారం అందడంతో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ స్వయంగా రంగంలోకి దిగి డ్యామేజ్ జరగకుండా పూడ్చే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. అందులో భాగంగానే నాగార్జున సతీమణి అమలకు ఫోన్ చేసి జరిగిన విషయమై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపింది. వ్యవహారం చాలా తప్పిదమని, ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటామని, దీనిని ఇంతటితో వదిలే విషయమై ఆలోచించాలని ఒక రకంగా ప్రాధేయపడినట్టు వినికిడి. అమలను బుజ్జగించి అటు నుంచి తీవ్ర బెట్టు మీదున్న నాగార్జునతో కూడా మాట్లాడాలని అభ్యర్థించినట్టు వినికడి.

ససేమిరా అంటున్న నాగార్జున..
కొండా సురేఖ విషయమై నటుడు నాగార్జున తీవ్ర అసహనం తో రగిలిపోతున్న విషయం తెలిసిందే. తన కుటుంబ పరువును బజారుకీడ్చిన మంత్రిపై కోర్డులోనే తేల్చుకుంటానని ప్రకటించారు. ఎన్నో విలువలతో బతుకుతున్న సినీ కళాకారుల జీవితాలను రాజకీయ పట్టింపుల కోసం బలి చేయడం ముమ్మాటికి క్షమించారని తప్పిదమే అనే మంకుపట్టుతో న్యాయస్థానంలోనే కలుద్దామనే రీతిగా తేల్చిచెప్పారు. పైగా నటి సమంతను మెచ్చుకుంటూ ప్రకటించిన సురేఖ, తన కుటుంబాన్ని మాత్రం కనీసం క్షమించమని కూడా అడగకపోవడంపై నాగార్జున మరింత ఆగ్రహంతో ఉన్నారు. తన ఫ్యామిలీ మానసిక ప్రశాంతతను దూరం చేసిన సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు శుక్రవారమే విచారణకు రావాల్సి ఉన్నా, న్యాయమూర్తి సెలవులో ఉండడంతో సోమవారానికి వాయిదా పడింది.

ఐన్ స్టీన్ కు కూడా అర్థం కాని ఫార్ములా సురేఖది.. : ఆర్జీవీ
సురేఖ ఎపిసోడ్ లో దర్శకుడు ఆర్జీవీ తీవ్ర అసహనంతో ఉన్నారు. ఎప్పటికప్పుడు తన ట్వీట్ల ద్వారా అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. నిన్న ఇదే విషయమై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్జీవీ శుక్రవారం కూడా మరో ట్వీట్ చేశారు. సురేఖ గన్ గురిపెట్టింది కేటీఆర్ కు.., కాల్చింది మాత్రం నాగార్జున,నాగచైతన్యను. కానీ క్షమాపణ చెప్పింది సమంతకు. ఐన్ స్టీన్ కూడా తన ఈక్వేషన్ పరిష్కరించలేనంత ట్విస్ట్ ఇందులో ఉందని తనదైనా స్టైల్ లో ఆర్జీవీ కామెంట్ చేశారు.

అంతా ఒక్కతాటిపైకి..
నటి సమంతపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. పర్సనల్ లైఫ్ ను పబ్లిక్ లో మాట్లాడి కించపరిచిన కొండా తీరుపై తెలుగు సినీ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా అటు బాలీవుడ్, ఇతర రాష్ట్రాల చిత్ర పరిశ్రమలన్నీ ఒక్కతాటిపైకి వచ్చారు. రాజకీయంలో సినీ తారలను లాగి జీవితాలను నాశనం చేయొద్దని పలువురు హితవు పలికారు. నాయకులంతా రాజకీయంగా తేల్చుకోవాలేగానీ, ఇతర రంగాల్లో పేరుప్రఖ్యాతులు సంపాదించిన వారిని నడిరోడ్డపై నగ్నంగా నిలబెట్టే విధంగా నడుచుకోవద్దని పేర్కొన్నారు. రాజకీయం, చిత్రసీత మధ్య ఉన్న సత్సంబంధాలను విచ్చిన్నం చేయొద్దని, ఎవరికి వారుగా బతుకున్న తీరు కాపాడాలేగానీ కాష్టంగా రగుల్చొద్దని హితవు పలికారు.

RELATED ARTICLES

తాజా వార్తలు