Narendra Modi | న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముహుర్తం ఖరారైంది. రాష్ట్రపతి భవన్‌లో 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని బీజేపీ నేత ప్రహ్లాద్ జోషీ తెలిపారు. శుక్రవారం జరిగిన ఎన్డీఏ మీటింగ్‌లో ప్రహ్లాద్ జోషి ఈ విషయాన్ని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 ఎంపీ సీట్లను గెలుచుకున్నది. అయితే 272 మ్యాజిక్ మార్క్ దాటినా.. బీజేపీ మాత్రం ఒంటరిగా ఆ ఫిగర్‌ను అందుకోలేదు. దీంతో జేడీయూ, టీడీపీ కీలకంగా మారాయి.
ఇక మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాల ప్రతినిధులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో మూడంచెల భద్రతా ఏర్పాటు చేశారు. భద్రతకు ఐదు కంపెనీల పారా మిలటరీ దళాలు, ఎన్ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్‌లను పోలీసులు రంగంలోకి దించారు.
బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్ తదితర దేశాలకు చెందిన అగ్రనేతలు మోదీ ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉంది. వారు ఐటీసీ మౌర్య, లీలా, తాజ్, ఒబెరాయ్ వంటి ప్రముఖ హోటల్స్‌లో బస చేసే అవకాశం ఉన్నందున, వాటిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మోదీ ప్రమాణం చేసే రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ఎన్ఎస్‌జీ కమాండోలను మోహరించారు.