Sunita Williams | భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఆమె నేటి రాత్రి 10 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. వాస్తవానికి మే 7న అంతరిక్షంలోకి వెళ్లాల్సి ఉండగా.. స్పేస్ షెటిల్ ఆక్సిజన్ వాల్వ్‌లో సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడింది. అంతా సరిగ్గా జరిగితే.. స్టార్‌లైనర్ ఇంటర్‌నేషనల్ స్పేస్ షెటిల్‌కి చేరనున్నది.
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌తో కలిసి వారం రోజుల పాటు స్టేషన్‌లోనే ఉండనున్నారు. సునీత విలియమ్స్ రికార్డు స్థాయిలో 322 అంతరిక్షంలో గడిపి.. అత్యధికంగా గంటల స్పేస్ వాక్ చేసిన మహిళా ఆస్ట్రోనాట్‌గా రికార్డు సృష్టించారు. సునీతా విలియమ్స్ తొలిసారిగా 9 డిసెంబర్ 2006న అంతరిక్షంలోకి వెళ్లారు.
22 జూన్ 2007 వరకు అంతరిక్షంలోనే గడిపారు. సునీతా విలియమ్స్ రికార్డు స్థాయిలో 29 గంటల 17 నిమిషాల పాటు నాలుగు సార్లు స్పేస్‌వాక్ చేశారు. ఆ తర్వాత మళ్లీ సునీతా విలియమ్స్ 14 జూలై 2012న రెండోసారి అంతరిక్ష యాత్రకు వెళ్లి 18 నవంబర్ 2012 వరకు అంతరిక్షంలో ఉన్నారు. ఈ సందర్భంగా సునీతా విలియమ్స్ మాట్లాడుతూ తొలిసారి అంతరిక్ష పర్యటన సందర్భంలో కొంచెం భయపడ్డానని.. ప్రస్తుతం కొత్త స్పేస్ షెటిల్‌లో వెళ్లేందుకు ఉత్సాహంగా ఉందన్నారు. ఇంటర్‌నేషనల్ స్పేస్‌స్టేషన్ తనకు రెండో ఇల్లులాంటిదన్నారు.