అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్‌కు సినీప్రముఖుల మద్దతు రోజురోజుకు అధికమవుతున్నది. నటులు అనసూయ, జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వంటివారు పవన్‌కు బహిరంగాగానే సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) మద్దతు ప్రకటించారు. అంతకుముందే మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని గెలిపించాలని ప్రజలను కోరారు.
‘ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు.. మీరు పెద్ద రాజకీయ యుద్దాన్ని ఎదుర్కోబోతున్నారు. ఈ పొలిటికల్ యుద్ధంలో మీరు అనుకున్న విజయం సాధిస్తారని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని సినిమా కుటుంబానికి చెందిన సభ్యుడిగా ఆశిస్తున్నా. నాతోపాటు మనవాళ్లు అందరూ మీకు తోడుగా ఉంటారని భావిస్తున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ సర్’ అంటూ నాని ఎక్స్‌లో రాసుకొచ్చారు. మెగా ఫ్యామిలీ కాకుండా బయట నుంచి పవన్‌కు సపోర్ట్ చేసిన పెద్ద హీరో నానినే కావడం విశేషం.
మెగా ఫ్యామిలీ హీరోలు సాయి ధరమ్ తేజ్, వరణ్ తేజ్ ఇప్పటికే పిఠాపురంలో తమ వంతుగా ప్రచారం చేస్తున్నారు. కాగా, 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్.. రెండు చోట్లా ఓడిపోయారు. ఈ సారి పవన్ ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలన్న పట్టుదలతో పని చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి మాజీ ఎంపీ వంగా గీత పిఠాపురం నుంచి పోటీస్తున్నారు.
Dear @PawanKalyan gaaru as you are about to face the big battle of politics. As a member of your film family I hope you achieve everything you wish and keep all your promises. I am rooting for you and I am confident the entire fraternity is too. All the very best sir 🙏🏼
— Hi Nani (@NameisNani) May 7, 2024
పవన్‌కు చిరంజీవి సపోర్ట్..
‘కొణిదెల పవన్ కల్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా.. అందరికీ మంచి చేయాలి. మేలు జరగాలనే విషయంలో ముందుంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం మా తమ్ముడు కల్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ, కల్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు వద్ద ప్రాణాలను ఒడ్డి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందివ్వడం.. ఇలా ఎన్నెన్నో చేసిన పనులు చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా.. జనాలకు కావాల్సింది అనిపిస్తుంటుంది’ అంటూ చిరంజీవి సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వీడియో సందేశం ఇచ్చారు.
ఇంకా ఏమన్నారంటే.. సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడని.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చినట్లు తెలిపారు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుందన్న మెగాస్టార్.. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే అలాగే బాధేస్తుందన్నారు. ‘అలా బాధ పడుతున్న అమ్మకు ఈ అన్నయ్య ఒక మాట చెప్పాడు.. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అని చెప్పాను’ అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లే ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టమని నమ్మి జనం కోసం జనసైనికుడు అయ్యాడు.
తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్’ అన్నారు. ‘ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్ట సభల్లో ఆయన గొంతును మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో మీరు చూడాలంటే.. పిఠాపురం ప్రజలు పవన్‌ని గెలిపించాలి’ అని కోరారు. ‘సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు. మీ కోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కల నిజం చేస్తాడు. పిఠాపురం ప్రజలకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ కల్యాన్‌ని గెలిపించండి. జైహింద్’ అంటూ చిరంజీవి పవన్‌కి సపోర్టుగా ప్రజలకు సందేశం ఇచ్చారు.
జనమే జయం అని నమ్మే జనసేనాని ని గెలిపించండి. pic.twitter.com/zifXEqt30t
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2024