కొచ్చి: కేరళలోని కొచ్చిలో (Kochi) దారుణం చోటుచేసుకున్నది. నవజాత శిశువును (Newborn baby) నడిరోడ్డుపై పడేయడంతో ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ అత్యాచా బాధితురాలు బాత్‌రూమ్‌లో శిశువుకి జన్మనిచ్చిందని, ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదని.. ఆ నవజాత శిశువును రోడ్డుపైకి విసిరేసిందని విచారణలో తేలింది.
కొచ్చిలోని పానంపిళ్లై నగర్‌కు చెందిన 24 ఏండ్ల ఎంబీఏ యువతి శుక్రవారం ఉదయం తన అపార్ట్మెంట్ బాత్‌రూమ్‌లో నవజాత శిశువుకు జన్మనిచ్చింది. అయితే విషయం తన తల్లిదండ్రులకు తెలియకూడదని భావించిన ఆమె.. అమెజాన్ డెలివరీ పార్శిల్ కవర్లో ఆ శిశువును చుట్టి అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి బయటకు విసిరేసింది. దీంతో రోడ్డుపై పడిన ఆ నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయింది.
కాగా, అదే సమయంలో అక్కడ ఉన్న కార్మికులు పార్శిల్ కవర్లో ఉన్న శిశువు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అమెజాన్ పార్శిల్ కవర్‌పై ఉన్న అడ్రస్ ఆధారంగా నిందితురాలిని గుర్తించారు. నిందితురాలు ప్రసవం కోసం వాడిన బాత్‌రూమ్‌లో రక్తపు మరకలు ఉండడం కూడా పోలీసులు యువతిపై అనుమానాన్ని మరింత పెంచాయి. అయితే మహిళపై అత్యాచారం లేదా లైంగిక వేధింపుల నిజంగా జరిగిందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.