పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగనున్న విశ్వ క్రీడలకు (Paris Olympics) మరో 92 రోజుల్లో తెరలేవనుంది. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగనున్న ఒలింపిక్స్ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. సుమారు రూ.62 వేల కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు. పారిస్‌లోని సీన్ నది పక్కన ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను సుమారు 3 లక్షల 20 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సుమారు 6 లక్షల మంది ఈ వేడుకలను చూసే అవకాశం ఉంది.
కాగా, కార్యక్రమం జరిగే ఆరుగంటల పాటు పారిస్ నగరంతో పాటు దానికి ఆనుకుని ఉన్న 150 కిలోమీటర్ల ఏరియాను ‘నో ఫ్లై జోన్’గా ప్రకటిస్తున్నట్టు ఎయిర్‌పోర్ట్స్ డి పారిస్ చైర్మన్ అగస్టిన్ డి రొమనెట్ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేసినట్టు చెప్పారు.
ఆటలు విస్తృతంగా బహిర్గతమవ్వాలి (Games Wide Open) అనే నినాదంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. విశ్వ క్రీడలను వీక్షించేందుకు వచ్చే పర్యటకుల వల్ల సుమారు రూ.31,980 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రజా రవాణాను 15 శాతం పెంచుతున్నారు. కొత్తగా మెట్రో స్టేషన్లను అందుబాటులోకి తెస్తున్నారు.