న్యూఢిల్లీ: రైళ్లలో తాగునీటి వృధాను అరికట్టేందుకు భారతీయ రైల్వే (Indian Railways) నడుంభిగించింది. ఇకపై ఆ రైళ్లలో ప్రయాణికులకు ఇస్తున్న లీటర్ వాటర్ బాటిళ్లను (Water Bottles) బంద్ చేయాలని నిర్ణయించింది. వాటి స్థానంలో 500 మిల్లీలీటర్ల బాటిళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు అధికారులు వెళ్లడించారు.
ప్రస్తుతం వందేభారత్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణికులకు 1 లీటర్ రైల్ నీర్ బాటిళ్లను ఇస్తూ వస్తున్నారు. అయితే తక్కువ దూరం ప్రయాణించే వారు అందులో సగం అంతకంటే తక్కువ నీరు మాత్రమే తాగుతున్నారని, మిగిలినవాటిని అక్కడే వదిలి వెళ్తున్నారని గుర్తించామని అధికారులు తెలిపారు. అందువల్ల తాగునీటి వృధాను నివారించేందుకు ఇకపై ఆ రెండు రైళ్లలో ప్రయాణికులకు హాఫ్ లీటర్ బాటిళ్లను ఇవ్వనున్నామని రైల్వే సీపీఆర్వో దీపక్ కుమార్ చెప్పారు.
అవసరమైన వారు సంబంధిత సిబ్బందిని మరో అర్ధ లీటర్ బాటిల్ అడుగవచ్చని తెలిపారు. దీనికి అదనంగా ఎలాంటి చార్జ్ చేయడం లేదని వెల్లడించారు. వందే భారత్ రైలు గరిష్ఠంగా 8.5 గంటల పాటే ప్రయాణిస్తుందని, అందువల్ల ప్రయాణికులకు హాఫ్ లీటర్ బాటిల్ సరిపోతుందన్నారు. సుదూర ప్రయాణం చేసే శతాబ్దిలో రెండు హాఫ్ లీటర్ బాటిళ్లు ఇస్తామని చెప్పారు. కాగా, వందే భారత్ సెమీ స్పీడ్ రైళ్లను ప్రధాని మోదీ 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించారు. ఇవి లిమిటెడ్ స్టాప్‌లతో తక్కువ సమయంలోనే ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రైళ్లను దేశవ్యాప్తం 40 రూట్లలో భారతీయ రైల్వే నడుపుతున్నది.