Saturday, December 28, 2024
HomeNationalSimultanious Polls | జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Simultanious Polls | జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

JanaPadham EPaper-19-09-01

వన్ నేషన్.. వన్ ఎలక్షన్
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
శీతాకాల సమావేశాల్లో బిల్లు
32 పార్టీల మద్దతు..
మరోసారి అభిప్రాయాలు తీసుకుంటామన్న కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
ఆచరణాత్మకం కాదన్న మల్లిఖార్జున ఖర్గే

పాతదే అయినా కొత్త అడుగు. వాళ్లు అనుసరించిందే అయినా ఈ సారి వీళ్ల విడత. ఏకంగా మూడు పర్యాయాలు దేశమంతా ఒక్కటే సారి అని సాగిన ఎన్నికల ప్రహసనం., ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆగమాగం అయ్యాయి. ఆ మాటకొస్తే ప్రస్తుతం యాడాదికోసారి ఏదో ఓ రాష్ట్రంలో ఎన్నికల పరంపర కొనసాగుతూనే ఉంది. ఉండే ఐదేళ్ల సమయంలో సుమారు 6 నెలలు కోడ్ పేరుతో ఆటంకాలు., ప్రజలను మచ్చిక చేసుకోవడానికి తాయిలాలు.. వంటి విన్యాసాలతో గడిచిపోతున్న తీరును చూసి బీజేపీ సాహసోపేతమైన నిర్ణయానికి సిద్ధమైంది. షరామామూలుగానే వాళ్లు చేసేదానికి మనమెందుకు ఓకే అనాలనో., మరో కారణమోగానీ హస్తం ఆదిలోనే ‘నో’ అంటూ నోటిదూలను ప్రదర్శిస్తూనే ఉంది. సాధ్యాసాధ్యాయాలు పరిశీలనలు, నిపుణుల అభిప్రాయాలు., తీసుకుందామనే దశలోనే తొందరపాటుగా కక్కేస్తున్నది. ఏదిఏమైనా దేశభవిష్యత్ యువత చేతిలో అన్నట్టుగా ఆ యువతే మొగ్గుచూపుతున్న ఈ ప్రక్రియ పట్టాలెక్కతుందా..? పక్కకు పడిపోతుందా..?

========================
జనపదం, బ్యూరో

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు కేంద్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ నివేదికలో ఇచ్చిన సూచనల మేరకు తొలి దశగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో దేశం మొత్తం నిర్ణీత వ్యవధిలో అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించవచ్చు. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలో ఒకేసారి లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగగా మిగతా రాష్ట్రాల్లో ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగడం లేదు.

కేంద్ర కేబినెట్ ఆమోదం..
దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూపొందించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. దేశంలో ఒకేసారి ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికను కేబినెట్‌ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం, రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించింది. అనంతరం ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్టవ్‌ వెల్లడించారు.
దేశంలోని పెద్ద సంఖ్యలో రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయా పార్టీల నేతలు మరోసారి తమ అభిప్రాయాలు చెబుతారని అన్నారు. జమిలి ఎన్నికలను దేశాన్ని బలోపేతం చేసే అంశంగా వర్ణించారు. మరోవైపు జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రతిపక్షాల్లో అంతర్గత ఒత్తిడి..
కాంగ్రెస్ నేత ఖర్గే వ్యాఖ్యలపై కూడా మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. జమిలి ఎన్నికల విషయంలో ప్రతిపక్షాలు అంతర్గత ఒత్తిడి ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. 80 శాతానికిపైగా ప్రజలు జమిలి ఎన్నికల వైపు మొగ్గు చూపారని తెలిపారు. ముఖ్యంగా యువత ఆసక్తి కనబరిచారని చెప్పారు. ప్రస్తుత ఎన్డీఏ సర్కారు హయాంలోనే జమిలి ఎన్నికలు అమలుచేసి చూపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల స్పష్టం చేశారు. గత నెల స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఏటా ఏదోఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనినుంచి బయటపడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారమని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక హామీల్లో జమిలి ఎన్నికలు ఒకటి.

32 పార్టీలు ఒకే..
ఈ ప్రతిపాదనపై పని చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మార్చిలో తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. కమిటీ 62 రాజకీయ పార్టీలను సంప్రదించింది. వీరిలో 32 ఒక దేశం, ఒక ఎన్నికలకు మద్దతు ఇవ్వగా, 15 పార్టీలు వ్యతిరేకించాయి, మరో 15 పార్టీలు స్పందించలేదు. అందులో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో బీజేపీతో పాటు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ, చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్జేపీ (ఆర్) పెద్ద పార్టీలు. జేడీయూ, ఎల్జేపీ (ఆర్‌)లు ఒకే దేశం, ఒకే ఎన్నికలకు అంగీకరించగా, టీడీపీ మాత్రం దీనిపై ఎలాంటి సమాధానం చెప్పలేదు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, బీఎస్పీ సహా 15 పార్టీలు దీనిని వ్యతిరేకించాయి. అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా, టీడీపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సహా 15 పార్టీలు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

భారీ ఖర్చు.. అభివృద్ధికి ఆటంకం
ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అది పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు భారీ మొత్తం లో ఖర్చు చేస్తోంది. దీని వల్ల ప్రజాధనం వృథాగా అవుతోందని ప్రధాని మోదీ, అమిత్ షాతో సహా బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఒకసారి లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో వన్ నేషన్, వన్ ఎలక్షన్ నినాదాన్ని తెర మీదకు తెచ్చింది. ఇది అమల్లోకి వస్తే భారీగా ఖర్చు తగ్గుతుందని, అలాగే అభివృద్ధికి ఆటంకం కలగదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ లో ప్రవేశ పెట్టబోయే ఈ బిల్లు ఆమోదం పొందుతుందో లేదో వేచి చూడాలి. కాంగ్రెస్ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది.

కమిటీ సిఫార్సులు..
రామ్ నాథ్ కోవిడ్ కమిటీ పలు కీలక సిఫారుసులు చేసింది. అందులో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికలు (మున్సిపాలిటీలు, పంచాయతీలు వంటివి) 100 రోజులలోగా నిర్వహించాలి. ఈ సిఫార్సుల అమలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఉమ్మడి ఓటరు జాబితా, ఒకే ఓటరు గుర్తింపు కార్డు వ్యవస్థ ఉండాలి, దీనిని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదించి తయారు చేయాలి వంటి ముఖ్యమైన అంశాలను కేంద్రానికి సిఫార్సు చేసింది.
===========================

 

ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే : ఖర్గే
జమిలి ఎన్నికలు దేశంలో సాధ్యం కావు. కేంద్రం ప్రతిపాదనను ఎవరు అంగీకరించరు. దేశంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకే జమిలి ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు ఎన్నిక వస్తే అప్పుడు నిర్వహించాల్సిందే. జమిలి ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడవదు. జమిలి ఎన్నికను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.

జమిలి ఎన్నికలతో దేశం సర్వనాశనం
ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు మాత్రమే లబ్ధి
కేంద్ర నిర్ణయం ఫెడరలిజాన్ని నాశనం చేస్తుంది

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
జమిలి ఎన్నికలతో దేశం సర్వనాశనం అవుతుందని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అగ్రనేత అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, దీని వలన ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ఆయన విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జమిలి ఎన్నికలపై స్పందించారు. దేశంలో బీజేపీ మాత్రమే ఈ జమిలి ఎన్నికలను సమర్ధిస్తుందని అన్నారు. కేంద్ర నిర్ణయం ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, దీంతో కొత్త సమస్యలు కొనితెచ్చుకోవడం అవుతుందని తెలిపారు. మున్సిపల్ , స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ప్రధాని మోడీ, అమిత్ షాలకు ఉందని, ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరికీ ఆ అవసరం ఉన్నంతమాత్రన మనకు జమిలి ఎన్నికలు అవసరం లేదని ఒవైసీ పేర్కొన్నారు. విడతలవారీగా నిర్వహించే ఎన్నికలే ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు