తగ్గే ప్రసక్తే లేదు..
రాష్ట్రమంతా హైడా తరహా విధానమే..
వరదలకు కారణం నీరెళ్లే దారిని లాక్కోవడమే..
అక్రమ నిర్మాణాలన్నీ నేలమట్టం చేస్తాం..
ప్రకృతి విపత్తులపై బ్లూ బుక్ తయారు చేస్తాం..
మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై సమీక్షిస్తాం…
మూడు తండాలను కలిపి ఆదర్శ కాలనీ..
పువ్వాడ ఆక్రమణల తొలగింపునకు హరీష్ సహకరించాలి..
మహబూబాబాద్ జిల్లా సమీక్షల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
యువ శాస్త్రవేత్త అశ్వినీ కుటుంబ సభ్యులకు ఓదార్పు…
నిజం దేవుడికి తెలుసో లేదోగానీ, నీరు మాత్రం పల్లమెరుగాల్సిందే. పల్లాన్ని ఆమాంతంగా పట్టేసుకుంటే అమాయకపు ప్రవాహం మరెటూ పోలే తనదారిని తాను వచ్చి ఇలా నిలువునా ముంచకతప్పదుకాదా..? చెల్లుకు చెల్లు. నీరెళ్లే దారిని మనం కబ్జా చేశాం.., మన ఇళ్లను అది వశపర్చుకుంది. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలి., నష్టం ఎవరి వలన ఎవరికో గమనించాలి. బుద్ధి తెచ్చుకుని ఎవరి జాగాల్లో వారుంటే అంతా మంచిదే. అందుకే తనదారిలో అక్రమంగా వెలసిన కట్టడాలను తొలగించడం., దాని స్థావరాన్ని ఆక్రమించుకుని వేడుక చూస్తున్న వారిని దారిలోకి తేవడమే లక్ష్యం. ముప్పు మరలామరలా వస్తుందంటే మానవ తప్పిదమే తప్ప మరేమి కాదు. అందుకే అక్కడ వెలసిన నిర్మాణాలను తొలగించడానికి రాష్ట్రమంతా ‘హైడ్రా’ తరహా విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. ఆ దారిలో ఎవరు అడ్డొచ్చినా ఆలోచించేది ఉండదు., ఎంతటి వారినైనా వదిలేది అంతకన్నా ఉండదు.
(వరద దృశ్యాలను చూసి చలించిపోయి సీఎం అన్న మాటలు..)
జనపదం, బ్యూరో…
‘‘ఆక్రమణను సక్రమం చేయడమే పని. రాష్ట్రమంతా ఓ ప్రత్యేక ప్రోగ్రాం తీసుకొస్తాం. జిల్లాల కలెక్టర్లు ఎక్కడికక్కడ కబ్జాదారుల చేతుల్లో నలుగుతున్న చెరువులు, కుంటల విముక్తి సరైన విధివిధానాలను తయారు చేసుకోవాలి. చెరబట్టిన వారు ఎంతటోళ్లైనా ఉపేక్షించాల్సిన అవసరం లేదు., ఎంత పెద్దోళ్లు వచ్చి చెప్పినా పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిబంధనలు అతిక్రమించాడని తెలిస్తే చాలు వెనకముందు ఆలోచించకుండా నేలమట్టం చేయాల్సిందే…’’ అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో తీవ్ర వరద తాకిడికి గురైన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఆయన ఇవ్వాళ పర్యటించారు. వరదలు, ముంపునకు కారణం నీరు వెళ్లాల్సిన దారులన్నీ మూసుకుపోవడమే అనే విషయం ఇప్పటికైనా మనమంతా గమనించాలని. అందుకే హైడ్రా తరహా వ్యవస్థను ఇక అన్న జిల్లాల్లో చేయాల్సిన అవసరం తప్పదని పేర్కొన్నారు. ఆక్రమించి కట్టడాలు చేసిన వారు ఎంతటి ఘనులైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని, తామే దగ్గరుండి మరీ పనులు చక్కబెట్టడానికి కూడా వెనకాడబోమని సీఎం హెచ్చరించారు.
ప్రకృతి ప్రకోపంతోనే..
ప్రకృతిని చెర బడితే అది ప్రకోపిస్తుందని.. ప్రకృతి ప్రకోపంతోనే ఉత్తరాఖండ్‌లోనైనా, మన దగ్గరైనా విపత్తులు సంభవిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారీ వర్షాల సమయంలో వరదలు సంభవించి కాలనీలకే కాలనీలే మునిగిపోవడానికి కారణం చెరువులు, నాలాల ఆక్రమణే అన్నారు. హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్ వస్తోందని, కానీ ఎక్కడికక్కడ కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లో ఆక్రమణ తొలగింపును ప్రాధాన్యంగా పెట్టుకున్నామని, చెరువులు, నాలాల ఆక్రమణలో ఎంతటి వారున్నా తొలగింపునకు వెనుకాడబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముందుగా చెరువులు, నాలాల ఆక్రమణపై నివేదిక రూపొందించుకోవాలని, ఏవైనా కోర్టు కేసులు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లో కేవలం ఒక నాలాపై ఆక్రమణలు తొలగిస్తేనే రాం నగర్‌లో ముంపు బారి నుంచి బయటపడిన విషయాన్ని ముఖ్యమంత్రి ఉదాహరించారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి నివాసంలో మంగళవారం విలేకరులతో ఇష్టాగోష్టిలో, మహబూబాబాద్ జిల్లా సమీక్షలో ఈ విషయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకేరు వాగు పొంగడంతో కారు కొట్టుకుపోయి యువ శాస్త్రవేత్త నూనావత్ అశ్వినీ, ఆమె తండ్రి మోతీలాల్ మృతిచెందిన విషయం విదితమే. మంగళవారం ఉదయం ఖమ్మం నుంచి నేరుగా సింగరేణి మండలం గంగారాం తండాలోని అశ్వినీ ఇంటికి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అశ్వినీ, మోతీలాల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశ్వినీ తల్లి నేజీ, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అశ్వినీ అన్న అశోక్‌కు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి ఇల్లు లేకపోవడంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
ఆకేరు ప్రవాహం శాస్త్రీయ సర్వే చేపడతాం…
ఆకేరు వాగు ప్రవాహంపై శాస్త్రీయ సర్వే చేపడతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆకేరు వాగు పొంగడంతో ప్రతి సారి తాము ముంపు బారిన పడుతున్నామని సీతారాం తండా వాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గంగారాం తండాలో అశ్వినీ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు పొంగి కల్వర్టు, రహదారి తెగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడే అశ్వినీ, ఆమె తండ్రి మోతీలాల్ పయనిస్తున్న కారు ఆకేరు వాగు ప్రవాహానికి కొట్టుకుపోయి వారు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతాన్ని, ఆకేరు వాగును, కల్వర్టు కొట్టుకుపోయిన తీరును పరిశీలించారు. వాగు ప్రవాహ ఉద్ధృతి ఎలా ఉంటుంది.. గతంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిసారి వాగు పొంగడంతో ఇబ్బందులు పడుతున్నామని, రహదారి గతంలోనూ తెగిందని స్థానికుడు జర్పుల లక్ష్మణ్ సీఎంకు చెప్పారు. అక్కడి నుంచి ఆకేరు పొంగి ముంపు బారిన పడిన సీతారాం తండాకు చేరకున్నారు. తండాలో ఇళ్లు మునిగిన వారిని ఓదార్చి వారి సమస్యలను తెలుసుకున్నారు. తాము తీవ్రంగా నష్టపోయామని, ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి తండాతో సమీపంలోని మరో రెండు తండాలకు నిద్ర ఉండడం లేదని, తమను రక్షించాలని తండా వాసులు కోరారు. తండా వాసులను ఓదార్చిన అనంతరం మూడు తండాలను కలిపి ఒకే చోట మోడల్ కాలనీ ఏర్పాటు చేస్తామని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆకేరు వాగు పొంగి ఇళ్లలోని పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్స్ తడిచిపోయినందున ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికీ నూతన కార్డులు, సర్టిఫికెట్స్, పాసు పుస్తకాలు మంజూరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆకేరు ప్రవాహంపై శాస్త్రీయంగా అంచనా వేసి నూతన వంతెన నిర్మిస్తామని, నీటిని సమీపంలోని చెరువులు, కుంటలకు మళ్లించే ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆకేరు వాగు వరదతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
అప్రమత్తతతో ముప్పు తగ్గించగలిగాం..
గతంలో ఎన్నడూ లేనంతగా మహబూబాబాద్ జిల్లాలో వర్షపాతం నమోదైనా ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంతో ప్రాణ, ఆస్తి నష్టాలు తగ్గించగలిగామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పంట, ఆస్తి నష్టాలపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఊహించని వర్షాలు, వరదలతో మహబూబాబాద్ జిల్లాలో నలుగురు ప్రాణాలు కోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఇద్దరు, మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారు ఇద్దరన్నారు. మహబూబాబాద్ జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ఎకరాకు రూ.పది వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ముంపు బారిన పడిన 680 మందిని సహాయక శిబిరాలకు తరలించామని చెప్పారు. సీతారాం తండాలో వరద సమయంలో ప్రజలకు అండగా నిలిచిన ఎస్సై నగేష్ కి అభినందనలు తెలిపారు. విపత్తు సమయంలో సత్వరం స్పందించిన పోలీసు, రెవెన్యూ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. విపత్తుల సమయంలో ఏం జరిగింది, సమస్యను ఎలా అధిగమించారు, ఎలా సహాయక చర్యలు తీసుకున్నారనే దానిపై బ్లూబుక్ రూపొందించుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. బ్లూ బుక్ భవిష్యత్‌లో వచ్చే అధికారులకు విపత్తుల సమయంలో కరదీపికగా ఉంటుందన్నారు.
పువ్వాడ అజయ్ ఆక్రమణల తొలగింపునకు హరీష్ సహకరిస్తారా..?
ఖమ్మం ముంపు బారిన పడడానికి మాజీ మంత్రి పువ్వాడ ఆక్రమణలే కారణమని తనకు ఫిర్యాదులు అందాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి ఇష్టారీతిగా కాలువలు ఆక్రమించారని, దాంతో ఖమ్మం ముంపు బారిన పడిందని తాను పరామర్శిస్తున్నప్పుడు స్థానికులు చెప్పారన్నారు. పదేళ్ల కాలం నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఈ ఆక్రమణలపై ఏమంటారని, వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్ధయాత్రలకు పోయినట్లు హరీష్ రావు ఇప్పుడు బాధితుల పరామర్శకు బయలుదేరారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ ఆక్రమణల తొలగింపునకు హరీష్ రావు చిత్తశుద్ధితో సహకరిస్తారా..? దగ్గర ఉండి ఆక్రమణలు తొలగింపజేస్తారా అని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. ఖమ్మంలో పువ్వాడ ఆక్రమణలకు సంబంధించి వాస్తవాలు వెలికితీయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. తాము అధికారంలోకి వచ్చాక తొలిసారిగా వేసిన టెండర్ ఖమ్మం మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుకేనని గుర్తు చేశారు. ప్రస్తుతం అంతకు మించిన ఎత్తులో నీరు వచ్చినందున ఆ ఎత్తు పెంపు సమీక్షిస్తామని సీఎం తెలిపారు.
రెండింటిని పోల్చి చూసుకోండి…
తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలు కవల పిల్లల వంటివని, కృష్ణాతో పోల్చితే ఖమ్మంలోనే ఎక్కువ నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో మరింత నష్టం వాటిల్లకుండా చూసుకోగలిగామని ముఖ్యమంత్రి తెలిపారు. తాను కంటిపై కునుకు లేకుండా పర్యవేక్షణ చేశానని సీఎం చెప్పారు. ప్రకృతి విపత్తుల సమయంలో త్వరగా చేరుకోవడానికి వీలుగా హెలీకాప్టర్ ను పంపుతారని, ఖమ్మానికి విజయవాడ దగ్గర ఉన్నందునే అక్కడకు హెలీకాప్టర్లు చేరుకున్నాయని, ఇలాంటి సమయంలో ప్రాంతం, రాజధాని వంటివి చూసుకోకూడదని ముఖ్యమంత్రి అన్నారు. భారీగా నష్టం వాటిల్లినందునే కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని రాష్ట్రంలో పర్యటించాలని కోరామని సీఎం తెలిపారు.
ఏనాడైనా బాధితులను పరామర్శించారా..?
పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏనాడైనా వరద, ప్రమాద బాధితులను పరామర్శించారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరద బాధితుల వద్దకు ఏనాడూ కేసీఆర్ వెళ్లలేదని, సొంత నియోజవకర్గం మాసాయిపేటలో రైలు ప్రమాదంతో చిన్నారులు చనిపోయినా, హైదరాబాద్ ఓఆర్ఆర్ లో పశు వైద్యురాలు అత్యాచారానికి, హత్యకు గురైతే కనీసం వాళ్ల కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న కేటీఆర్ క్షేత్రంలో ఉండి సహాయక చర్యలు చేపడుతున్న మంత్రులపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో దోచుకున్న రూ.లక్ష కోట్ల నిధుల్లో రూ.వెయ్యి కోట్లో… రూ. రెండు వేల కోట్లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలని కేసీఆర్ కుటుంబానికి ముఖ్యమంత్రి సూచించారు.
సీఎంఆర్ఎఫ్ కు విరాళాలు…
వరద సహాయక చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)ది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక రోజు మూల వేతనం రూ.135 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్ రూపంలో అందజేశారు. వారికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
* మహబూబాబాద్ కు చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు తాను దాచుకున్న రూ.3 వేలను ముఖ్యమంత్రికి అందజేయగా, విద్యార్థినిని ముఖ్యమంత్రి అభినందించారు. రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు.
మహబూబాబాద్ జిల్లా సమీక్షలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రామచంద్ర నాయక్, యశస్వినీ రెడ్డి, గండ్ర సత్యానారాయణరావు, నాగరాజు, కోరం కనకయ్య, అధికారులు పాల్గొన్నారు.