జనపదం – ఆదివారం -25-08-2024 E-Paper
హైడ్రా దడా..
నేలమట్టమవుతున్న కట్టడాలు..
కోర్టుకెళ్లే లోపే ఎన్ కన్వెన్షన్ నేలమట్టం
నెక్ట్స్ టార్గెట్ అనురాగ్ పల్లా..
పల్లాపై కేసు నమోదు..
మల్లారెడ్డికీ తప్పని ఆక్రమణ భయం..
కబ్జాదారుల వెన్నులో వణుకు..
హైడ్రా… గో ఏహెడ్… : సీఎం రేవంత్
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం : హీరో నాగార్జున
ఎలాంటి అనుమతులు లేవు : రంగనాథ్
నార్సింగ్ లో 28 అక్రమ కట్టడాల కూల్చివేత..
హైదరాబాద్ వణుకుతోంది. కాకపోతే ఈసారి నగరం వణకడం కాదు., నగర చెరువులను చెరబట్టిన వారు వణికిపోతున్నారు. దర్జాగా తమ కంబంధ హస్తాల్లో దాచుకున్న ఆక్రమణలను బలవంతంగా విడిపిస్తున్న తీరుకు భయకంపితులవుతున్నారు. ఎప్పుడేం వినాల్సి వస్తుందోనని హడలుతున్నారు. వాస్తవానికైతే వర్షం పడితే చాలు జంట నగరాలు చివురుటాకులా వణికేవి. రోడ్లే చెరువులుగా మారి ప్రజాజీవనం అస్తవ్యస్తమైన తీరుతో రాజధాని నానా అవస్థలు పడేది. కానీ, ఇప్పుడు ‘హైడ్రా’ పుణ్యానా స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ నగరం నవ్వుతుండగా, లాక్కున్న వారు బిక్కుబిక్కున గడుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ పూర్తి అధికారాలు కట్టబెట్టి ‘హైడ్రా.. గో ఎహెడ్…’ అంటుండగా., పదేళ్లుగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కాంక్రీట్ కట్టడాలతో విధ్వంసం సృష్టించిన వారు కోర్టుకు పరుగులు తీస్తున్నారు.
=========================
జనపదం, హైదరాబాద్ బ్యూరో
హైడ్రా దడదడలాడిస్తున్నది. గజగజ వణుకుతున్న నగరానికి కబ్జాల బంధ విముక్తులను చేస్తూ ముందుకు సాగుతున్నది. పదేళ్లుగా చెరువులు, కుంటలను అప్పనంగా ఆక్రమించి ఇష్టారీతిగా కట్టడాలు నిర్మించిన వారు హైడ్రా దెబ్బకు ఆగమాగం అవుతున్నారు. కంటిమీద కునుకు లేకుండా టెన్షన్ టెన్షన్ గా గడుపుతున్నారు. హైడ్రా ఒక్కొక్కటిగా చిట్టా విప్పుతూ, ఆధారాలతో పాటు క్షేత్రస్థాయికి వెళ్లి కూల్చివేతలకు దిగడంతో ఆపే అవకాశం లేక, ఎదురించే సాహసం చేయలేక బడాబాబులంతా బేజారవుతున్నారు. ప్రజా ఆస్తులను ప్రైవేట్ గా మలుచుకుని, మహానగరంలో వరదలకు కారుకులైన వారి పాపం హైడ్రా కడిగేస్తుండడంతో గ్రేటర్ లో హైటెన్షన్ నెలకొంది.
========================
హైడ్రా దడా..
హైడ్రా రంగప్రవేశంతో హైదరాబాద్ ఊపిరిపీల్చుకుంటున్నది. ఏదైనా పాపం పండే వరకే తప్ప, ఒక్కసారి పాపం పండిందంటే ప్రాయశ్చిత్తం చేసుకుందామన్నా అవకాశాలుండవనేది హైడ్రా ఆక్రమణ తవ్వకాల్లో తెలిసిపోతున్నది. తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత నుంచి రాజధానిలో చెరువులు, కుంటలు, నాలాలు, ఇతరత్ర ప్రభుత్వ స్థలాల్లో కబ్జాల పర్వం యథేచ్ఛగా సాగింది. అడ్డూఅదుపులేకుండా వెలసిన బహుళ అంతస్తులతో నగర నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. అలాంటి వాటన్నింటికి హైడ్రాతో చెక్ పడుతుండడంతో ఆ బాపతు గాళ్లంతా హైరానా పడుతున్నారు. పదేళ్లు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా మారిన వ్యవహారం ఇప్పుడు బెడిసి కొడుతుండడంతో హైడ్రా అంటేనే వణుకుతున్నారు.
నేలమట్టమవుతున్న కట్టడాలు..
రంగనాథ్ కమిషనర్ గా ప్రత్యేకంగా ఏర్పాటైన హైడ్రా తో నగరంలో వెలసిన కట్టడాలు నేలమట్టమవుతున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో బడా బడా నిర్మాణాలు కూల్చివేతలకు గురయ్యాయి. ప్రత్యేక టీమ్ లతో రాజకీయ ప్రమేయానికి అవకాశం లేకుండా తనపని తాను చేసుకెళ్తున్న హైడ్రా విధానాలతో హైదరాబాద్ చుట్టుపక్కల అక్రమంగా వెలసిన నిర్మాణాలు భూస్థాపితం అవుతున్నాయి.
కోర్టుకెళ్లే లోపే ఎన్ కన్వెన్షన్ నేలమట్టం
హీరో నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ ను శనివారం తెల్లవారుజామునే హైడ్రా టీం కూల్చడం మొదలుపెట్టింది. తుమ్మిడి కుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా హైడ్రా ముందుగు సాగుతున్న క్రమంలోనే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ విభాగాలతో కలిసి హైడ్రా కూల్చేసింది. తుమ్మిడికుంట చెరువులోని అనధికార నివాసాల్లో ఎన్ కన్వెన్వన్ ఒకటని గతంలోనే మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
కాగా, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించే లోపే హైడ్రా తనపని తాను పూర్తి చేసింది. చెరువులోని ఎకరం 12 గుంటల మేర స్థలంలో నిర్మాణం, బఫర్ జోన్ లోని 2 ఎకరాల 18 గుంటల విస్తీర్ణంలో నిర్మాణం విస్తరించి ఉన్న మేరకు కూల్చేశారు. తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖ కథానాయకుడికి చెందిన కట్టడాలు కూల్చేస్తున్న విషయం తెలియడంతో నగరమంతా హాట్ టాపిగ్ గా మారింది. ఆయన న్యాయస్థానాన్ని శరణు కోరే సమయం కూడా ఇవ్వకుండా న్యాయబద్ధంగా హైడ్రా పని కంప్లీట్ చేసి తన పట్టును నిరూపించుకుంది.
ఇదిలా ఉండగా ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం కాదని, నిబంధనల మేరకే చేశామని హీరో నాగార్జున పేర్కొన్నారు. అని అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణాలు చేశామని, గతంలోనే తమ కట్టడం కూల్చివేతపై కోర్టు స్టే ఇచ్చిందని, ఇప్పుడు అక్రమంగా కూల్చడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాగార్జున వివరించారు .
నెక్ట్స్ టార్గెట్ అనురాగ్ పల్లా..
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ కూడా చెరువు ఆక్రమణలోనే విస్తరించిందని హైడ్రాకు ఫిర్యాదు అందింది. ఇరిగేషన్ విభాగాధికారులే స్వయంగా పల్లా ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు. గతంలోనే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ, నీలిమ ఆస్పత్రి, నీలిమ మెడికల్ కాలేజీలు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని నాడెం చెరువు బఫర్ జోన్ లో చేశారని జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖాధికారులు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయినా స్పందించకపోవడంతో నంగారాభేరి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గణేశ్ నాయక్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా, హైడ్రా రంగప్రవేశంతో అప్రమత్తమైన ఇరిగేషన్ శాఖాధికారులు పోచారం ఐటీ కారిడార్ పీఎస్ లో అనురాగ్ యూనివర్సిటీ, పల్లా పై ఫిర్యాదు చేయడంతో పల్లాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మల్లారెడ్డికీ తప్పని ఆక్రమణ భయం..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థలు కూడా ఆక్రమించిన భూముల్లోనే ఉన్నాయని గతంలోనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన కొత్తలో కూడా కూల్చివేతలకు శ్రీకారం కూడా చుట్టింది. దుండిగల్ లోని చిన్న దామర చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లు కూల్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చెరువులను కాపాడేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా ఇక అడ్డూ అదుపు లేకుండా చట్టబద్ధంగా తనపని తాను చేసుకెళ్లే క్రమంలో మల్లారెడ్డి విద్యాసంస్థలపై విరుచుపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
హైడ్రా… గో ఏహెడ్… : సీఎం రేవంత్
హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కి పూర్తి అధికారాలిచ్చేందే ఆక్రమణల భరతం పట్టడానికని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నగరంలో అడ్డదిడ్డంగా వెలసిన భారీ ప్రాజెక్టులు, బహుళ అంతస్తులతో సామాన్య ప్రజాజీవనం ఆగమైన విషయం తెలిసిందే. నిబంధనలు తుంగలో తొక్కి, పెద్దలంతా ప్రకృతికి విరుద్ధంగా చేసిన పనులను సక్రమంగా చేయడానికే హైడ్రాను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. హైడ్రాను ఆపేది లేదని, తన పని తాను చేసుకుంటూ వెళ్లొచ్చని సీఎం పేర్కొన్నారు. అతి సామాన్య ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాలని, హైడ్రా.. గో ఎహెడ్ .. అంటూ తనదైన శైలిలో సీఎం భరోసా ఇచ్చారు.
నార్సింగ్ లో 28 అక్రమ కట్టడాల కూల్చివేత..
నార్సింగ్ మున్సిపాలిటీలో వెలసిన అక్రమ నిర్మాణాలపై శనివారం హైడ్రా కొరఢా ఝులిపించింది. గండిపేట గ్రామంలోని ప్రధాన రహదారిలో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన బిల్డింగ్ లను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేశారు. నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని గండిపేట సర్వే నెంబర్ 60,61లలో అక్రమంగా చేసిన 28 షెట్టర్లను నేలమట్టం చేశారు.