Thursday, April 3, 2025
HomeSpiritualTirumala | వేడుకగా పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు

Tirumala | వేడుకగా పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు

Tirumala | తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు శనివారం రెండోరోజు నేత్రపర్వంగా సాగాయి. పరిణయోత్సవంలో రెండో రోజైన శనివారం వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్తదినమని పురాణాల ద్వారా తెలుస్తోంది. కనుక ఈ మూడు రోజుల పద్మావతి అమ్మవారి పరిణయోత్సవంలో రెండవ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంటలకు మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వేంచేపు చేయగా, వెంట స్వర్ణ పల్లకీలో శ్రీదేవి-భూదేవి అనుసరించారు.

మొదటిరోజు మాదిరే శ్రీవారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలమాలలు మార్చడం, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కొలువు చేపట్టారు. ఈ కొలువులో భూపాల, వసంత, శంకరాభరణం, మలయమారుతం, మధ్యమావతి, యమునా కల్యాణి, నీలాంబరి రాగాలను సుమధురంగా ఆలపించారు. తరువాత హరికథ, నృత్యం, పురాణం, ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీవారు దేవేరులతో బంగారు తిరుచ్చిలో తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో రెండవరోజు పరిణయోత్సవ వేడుక ముగిసింది. కార్యక్రమంలో జేఈఓ గౌతమి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు