ఇస్లామాబాద్: పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజండరీ ప్లేయర్ బిస్మా మరూఫ్ (Bismah Maroof ) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. 17 ఏండ్ల కెరీర్ ఇక ముగిసిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తాను చాలా ఇష్టపడే క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. తన 17 ఏండ్ల ప్రయాణం ఎన్నో సవాళ్లు, విజయాలు, మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉందని చెప్పింది. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. తనపై నమ్మకముంచి జట్టును నడిపే బాధ్యతలను అప్పగించిన పీసీబీకి ధన్యవాదాలు తెలిపినట్లు పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది.
2006లో అంతర్జాతీయ క్రికెట్‌లో మరూఫ్ అరంగేట్రం చేశారు. పాక్ మహిళ క్రికెట్ తరపున వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 136 వన్డేలు ఆడిన ఆమె 3369 పరుగులు చేశారు. బౌలర్ కూడా అయిన మరూఫ్ 44 వికెట్లు పడగొట్టింది.
ఇక 146 టీ20ల్లో 2893 పరుగులతోపాటు 36 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నది. 96 మ్యాచుల్లో పాక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమె.. చివరగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడింది.