KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై (KA Paul) పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదయింది. నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎల్బీనగర్ టికెట్ కోసం భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఏం జరిగిందంటే..
కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీచేయాలనుకున్నాడు. దీనికోసం ప్రజాశాంతి పార్టీ అధినేత అయిన కేఏ పాల్‌ను సంప్రదించాడు. ఈ క్రమంలో టికెట్ కావాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు ఒప్పుకున్న కిరణ్.. ఆన్‌లైన్‌లో రూ.30 లక్షలు చెల్లించాడు. మరో 20 లక్షలు వివిధ మార్గాల్లో అతనికి ఇచ్చాడు. చెల్లింపులకు సంబంధించిన ఆధారాలతో సహా పోలీసులకు చూపించాడు. దీతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రజా శాంతి పార్టీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. గతంలో కూడా ఆయనపై ఇదేవిధమైన ఆరోపణలు వచ్చాయి.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన పాల్.. నోటాకు వచ్చిన ఓట్లు కూడా పొందలేకపోయారు. ఆయన పార్టీ తరపున పలు స్థానాల్లో పోటీచేసిన అభ్యర్థులు ఒక్క చోటకూడా విజయం సాధించలేదు. 2019లో ఏపీలోని భీమవరం నుంచి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ నామినేషన్ గడువు ముగిసిన తర్వాత ఫైల్ చేయటంతో అతడి నామినేషన్‌ను అధికారులు రిజెక్ట్ చేశారు. నరసాపురం లోక్‌సభకు పోటీ చేసిన ఆయనకు 3,037 ఓట్లు వచ్చాయి.