Janapadham_EPaper_TS_11-11-2024-F
తప్పదు మరి..?!
వేలం.. వెర్రి..?!
క్యాప్షన్ : గ్యారంటీల తొర్రి..
పోటాపోటీ జాతీయ పార్టీల హామీల వర్షం..
తిట్టిన నోటనే తప్పని ముచ్చట్లు…
ఇప్పటికే గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్..
తాజాగా బీజేపీది అదే మంత్రం..
మహారాష్ట్రలో 10 గ్యారంటీలతో మేనిఫెస్టో ప్రకటించిన కమలం నేతలు..
=====================
ఉల్లిగడ్డ ఊరందరికీ వద్దన్న గానీ, ఇంట్లో వద్దన్ననా.. అన్నట్టుంది బీజేపీ పరిస్థితి. గ్యారంటీలు, ఉచితాలు వద్దే వద్దు అని మొన్నటి వరకు బడాయిపోయిన కమలం నేతలు ఇప్పుడు తప్పని సరై అన్నట్టుగా ఆ పంథానే ఎంచుకున్నారు. కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోసిన పెద్దలు, తాజాగా ఆ మార్గంలోనే నడక సాగిస్తామనే సంకేతాలు ఇచ్చారు. హస్తం పార్టీ గ్యారంటీలపై విరుచుకుపడిన బీజేపీ నాయకులు ఇప్పుడు అవే గ్యారంటీలతో మేనిఫెస్టోలను విడుదల చేస్తూ ప్రజలను ముగ్గులోకి దింపడానికి తంటాలు పడుతున్నారు. ఎలాగైనా సరే పీఠం దక్కించుకోవాలనే ఒకేఒక ముందుచూపుతో ఎడాపెడా హామీలు గుప్పిస్తూ తాము ఆ తాను ముక్కలమే అని స్పష్టంగా నిరూపించుకుంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో పది గ్యారంటీలతో విడుదల చేసిన కాగితాలు అందుకు నిదర్శనం.
=====================
జనపదం, బ్యూరో
గ్యారంటీ గారడీ చేస్తున్నది అనేకంటే చేయిస్తున్నది. నేను లేకుండా మీ పప్పులు ఉడకవు గాక ఉడకవు అన్నట్టుగా పంతం నెగ్గించుకుంటున్నది. ఒడ్డెక్కాలన్నా.., ఓట్లు పడాలన్నా., నేను లేకపోతే మీకు దిక్కే లేదన్నట్టుగా తయారైంది. ఆ మాటకొస్తే పార్టీ ఏదైనా సరే గ్యారంటీగా గ్యారంటీని ఆశ్రయించాల్సిందే., లేదంటే దిక్కులేనిదై పోవాల్సిందే అనే స్థాయికి గ్యారంటీ రెచ్చిపోయింది. కాంగ్రెస్ ను గ్యారంటీ పేరు చెప్పి తిట్టిపోసిన కమలం నేతలు ఇప్పుడు తప్పని సరై అన్నట్టుగా గ్యారంటీలను మేనిఫెస్టో లో చేర్చారంటే దాని పవర్ ఏంటో తెలిసిపోతున్నది.
=====================
అప్పుడు రాద్ధాంతం.. ఇప్పుడు రాజమార్గం…
మల్లికార్జున ఖర్గే మాటలను విపరీతంగా వాడుకున్న బీజేపీ ఇప్పుడు అడిగే వారికి ఏం సమాధానం చెబుతారో తెలియదు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్టీ ముఖ్యలతో ఆచరణ సాధ్యం కాని వాటి జోలికి వెళ్లొద్దని, ప్రజలకు అంతోఇంతో చేసే స్కోప్ ఉన్న వాటినే ప్రచారంలో ప్రధానంగా వాడాలని చేసిన వ్యాఖ్యలను బీజేపీ విపరీతంగా ట్రోల్ చేసింది. గ్యారంటీ లేని పార్టీ కాంగ్రెస్ అని, గ్యారంటీపైనే ఆధారపడడం తప్ప మరేమి తెలియని నైజం తనదని తాము అలా కాదని ఎన్నో రకాలుగా చేసిన బీజేపీ నాయకులు ఇప్పుడు మహారాష్ట్రలో అచ్చంగా కాంగ్రెస్ బాటలోనే నడక సాగించేందుకు నిర్ణయించడం ముక్కున వేలేసుకోవాల్సిన పరిణామమే.
========================
ఒక్కోటి పెంచుతున్న హస్తం..
కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సందర్భంలో తెలంగాణలో ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్లింది. గెలిపిస్తే తాము చేసే ఉచితాలను పకడ్బందీగా ప్రచారం చేసుకుంది. దానికి బీఆర్ఎస్ పై ఉన్న ప్రజాగ్రహం మరో బలమైంది అనేది అప్రస్తుతమిక్కగానీ, ఆరు గ్యారంటీలు మాత్రం బాగానే వర్కౌట్ అయ్యింది. సీన్ కట్ చేస్తే పగ్గాలు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అందుకు ముందు కర్ణాటకలో కూడా ఐదు గ్యారంటీలతో యాత్రను విజయతీరాలకు చేర్చింది. దీంతో మొన్నటి హర్యానా ఎన్నికల్లో కూడా ఏడు గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్లినా ఫలితం తారుమారైంది. అనుకున్నది దక్కలేదు. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఎనిమిది గ్యారంటీలతో ఎలాగైనా పాగా వేయాలనే పథకంలో హస్తం తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఇలా గ్యారంటీలు పెరుగుతున్నాయి.., వాటి ఆచరణలు మాత్రం గందరగోళంగా మారుతున్నాయి.
====================
పాగా వేయడానికి కమలం..
కాంగ్రెస్ గ్యారంటీలను తిట్టిపోసిన కమలం కూడా ఇప్పుడు వాటినే ఆశ్రయించాల్సిన దుస్థితికి జారుకున్నది. అసలు ఉచితాలు అవసరం లేదు., ప్రజలకు హస్తం గ్యారంటీలు తప్పుడు సంకేతాలు ఇస్తోందని దుమ్మెత్తిపోసిన ఆ పార్టీ నేతలు మహారాష్ట్రలో తప్పనిసరై అన్నట్టుగా ఏకంగా పది గ్యారంటీలతో ప్రచారంలోకి దిగుతున్నారు. దక్షిణాదిలో మహారాష్ట్రను కొడితే ఇక పట్టు సాధించడం అంత పెద్ద సమస్య ఏమీ కాకపోదు అనే ఆలోచనతో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం గ్యారంటీలను ఆశ్రయించాల్సిందే అనే దారిలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా విడుదల చేసిన మేనిఫెస్టోలో పది గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.
=========================
జాతీయ పార్టీలు ఇప్పుడు స్థానికంగా పాగా వేయడానికి దిగజారి ప్రవర్తిస్తున్న చాయలు సుస్ఫష్టం. ప్రాంతీయ పార్టీలను నిలువరించాల్సిన సందర్భాన్ని పురస్కరించుకుని హామీల విషయంలో ఒకదానికి మించి మరోటి గుప్పిస్తూ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నాయి. కాంగ్రెస్, బీజేపీ., ఇలా పార్టీ ఏదైతేనేం తన మార్గం అధికార పీఠం., అనుసరించేది దొడ్డి దారి అన్నట్టుగా గ్యారంటీలతో పబ్బం గడుపుకోవడానికి వెనకాడడం లేదు. మున్ముందు గ్యారంటీల తీవ్రత మరింత పెరిగి ప్రజాస్వామ్య అసలు స్వరూపంపై దుష్ర్పభావం పడే రోజులు కూడా లేకపోలేదని మేధావులు పేర్కొంటున్నారు.
===============
మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల..
సంకల్ప పత్ర పేరిట మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..
రైతులు, మహిళలు యువతకు బీజేపీ హామీలు..
బీజేపీ మేనిఫెస్టోలో పది గ్యారంటీలు..
రైతు రుణమాఫీ, యువతకు 25 లక్షల ఉద్యోగాలు
మహారాష్ట్ర బీజేపీ మేనిఫెస్టో విడుదల
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలో బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘సంకల్ప్ పత్ర’ పేరుతో దీనిని విడుదల చేసి మాట్లాడారు. అ మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని అన్నారు. యువకులు, పేదలు, రైతులు, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు. నైపుణ్య గణన, స్టార్టప్‌ల అభివృద్ధి కోసం శివాజీ మహారాజ్ కేంద్రం, ఇంక్యుబేషన్ సెంటర్లు, వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష మహా వికాస్ అఘాడిపై అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష కూటమి వాగ్దానాలను విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ దేశంలో మత ఆధారిత రిజర్వేషన్లను బీజేపీ అనుమతించదని పునరుద్ఘాటించారు. మహారాష్ట్రలో సుస్థిరమైన, విశ్వసనీయమైన పరిపాలన ఉండాలంటే మహాయుతి ప్రభుత్వం అధికారంలో కొనసాగాలని వ్యాఖ్యానించారు. అన్ని కులాలు, వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చామని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. రాష్ట్రాన్ని వికసిత్ మహారాష్ట్రగా మార్చేందుకు రోడ్ మ్యాప్‌ను రూపొందించామన్నారు.
కీలక అంశాలివే..
• యువతకు 25 లక్షల ఉద్యోగాలు
• ప్రస్తుతం 11 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తున్న ‘లఖపతి దీదీ’ పథకాన్ని 50 లక్షల మంది మహిళలకు విస్తరించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం
• పారిశ్రామిక అభివృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
• రైతులకు రుణమాఫీ చేసి, వారిపై రుణ భారాన్ని తగ్గించడానికి చర్యలు
• వృద్ధుల పెన్షన్‌ను రూ.1,500 నుంచి రూ.2,100కు పెంచడం
• రైతు రుణాల మాఫీ, విద్యార్థులకు నెలకు రూ. 10 వేలు..
• మహిళలకు నెలకు రూ. 2,100, ఆశా వర్కర్లకు రూ. 15 వేలు..
• 25 వేల మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు..
• కరెంటు చార్జీల్లో 30 శాతం రాయితీ..
• 45 వేల గ్రామాలకు రోడ్ కనెక్టవిటీ