Pawan Kalyan| ఈ సారి ఏపీలో ఎన్నికలు మంచి రసవత్తరంగా సాగుతుండడం చూస్తూనే ఉన్నాం. మొన్నటి వరకు ప్రచారాలు జోరుగా సాగగా, ఇక ఓటర్లు ఈ రోజు తమ ఓటు హక్కు వినియోగించే సమయం వచ్చింది. ఏపీలో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలు కాగా, సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఓటు వేసేందుకు సామాన్యులు, సెలబ్రిటీలు పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్లి క్యూ లైన్‌లో నిలుచొని మరీ ఓటు వేస్తున్నారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ కొద్ది సేపటి క్రితం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య అన్నా లెజినోవాతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు.
లైన్ బారులు తీరగా, ఆ సమయంలో పవన్ లైన్‌లోనే నిలుచొని తన వంతు వచ్చాక ఓటు వేశారు.. పోలింగ్ కేంద్రానికి పవన్ కళ్యాణ్ వచ్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో పవన్ సైలెంట్‌గా నవ్వుతూ ఉన్నారు. ఇక ప్రతి ఒక్కరికి తన సందేశం ఇచ్చారు. అందరు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని పార్టీల శ్రేణులు సహకరించాలంటూ కోరారు. అయితే పవన్ కల్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నా కూడా పవన్ కల్యాణ్‌కు పిఠాపురంలో ఓటు హక్కు లేదు. మంగళగిరిలో ఆయనకు ఓటు ఉంది. అందుకే ఆయన ఇక్కడ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అయితే మంగళగిరిలో ఓటు వేసిన పవన్ కళ్యాణ్ తన పార్టీ గుర్తు గాజు గ్లాసుకి కాకుండా సైకిల్‌కి ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. పొత్తు ప్రాతిపదికన మంగళగిరిలో టీడీపీ పోటీ చేస్తుండడంతో సైకిల్‌కి తప్పక ఓటు వేసి ఉంటారని అంటున్నారు. అయితే పార్టీ అధినేత అయిన పవన్ ఇలా తన ఓటుని ఇంత లైట్ తీసుకోవడమేంటని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఈ సారి గెలవడం పక్కా, అని ఆయన కూడా గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారని కొందరు అంటున్నారు.