PBKS vs RCB | వరుసగా ఆరు ఓటముతో డీలా పడిన ఆర్సీబీ జట్టు తిరిగి పుంజుకుంది. వరుస విజయాలు అందుకుంటూ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ధర్మశాల వేదికగా గురువారం (మే 09) జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 60 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఈ క్రమంలో టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అయితే ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ నుండి టోర్నీ నుండి నిష్క్రమించింది. ముందు ముంబై ఇండియన్స్ నిష్క్రమించగా, ఆ తర్వాత నిష్క్రమించిన జట్టుగా పంజాబ్ నిలిచింది. అయితే గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు రజత్ పటిదార్ (55; 23 బంతుల్లో, 3×4, 6×6), కామెరూన్ గ్రీన్ (46; 27 బంతుల్లో, 5×4, 1×6) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆర్సీబీకి భారీ స్కోరు దక్కింది.
పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు (3/38) రాణించగా, అరంగేట్ర ప్లేయర్ విద్వాత్ కవెరప్ప (2/36) రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. ఇక భారీ లక్ష్య చేధనతో బరిలోలకి దిగిన పంజాబ్ జట్టుకి ఆదిలోనే దెబ్బ పడింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (6; 4 బంతుల్లో, 1×6)ను స్వప్నిల్ తొలి ఓవర్‌లోనే ఔట్ చేసి పెవీలియన్‌కి పంపాడు. ఆ తర్వాత బెయిర్‌స్టో (27; 16 బంతుల్లో, 4×4, 1×6)తో కలిసి రొసో (61; 27 బంతుల్లో, 9×4, 3×6) పరుగుల వరద పారించాడు. వీరిద్దరు బాగానే పరుగులు రాబట్టారు. 4.1 ఓవర్లలో 50 స్కోరు మార్క్‌ను చేరుకున్న పంజాబ్ పవర్‌ప్లే పూర్తయ్యే సరికి 75 పరుగులు చేశారు.
రొసోను కర్ణ్ శర్మ ఔట్ చేయడంతో పంజాబ్ కాస్త ఇబ్బందుల్లో పడింది. 10 ఓవర్లకు పంజాబ్ జట్టు 114/3తో మంచి స్ధితిలో ఉండగా, తర్వాత వరుస వికెట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. పంజాబ్ 56 పరుగుల వ్యవధిలోనే చివరి ఏడు వికెట్లు కోల్పోవడం జరిగింది. శశాంక్ సింగ్ (37; 19 బంతుల్లో, 4×4, 2×6), సామ్ కరన్ (22; 16 బంతుల్లో, 2×4) భారీగా పరుగులు చేయలేకపోవడంతో పంజాబ్ కి ఓటమి తప్పలేదు. అయితే ఆర్సీబీ ఈ విజయంతో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోగా, ఆ జట్టు ప్లే ఆఫ్ రేసుకి చేరుకోవాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌లు ఢిల్లీ, చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో ఆర్సీబీ గెలిస్తే ప్లే ఆఫ్స్‌కి వెళ్లే అవకాశం ఉంది.