హైదరాబాద్: తెలంగాణలో (Telangana) ఎండలు మండిపోతున్నాయి. పొద్దుగాల ఏడు గంటల నుంచే భానుడు నిప్పులు గక్కుతున్నాడు. భానుడి భగభగలకు ప్రజలు ఆగమాగం అవుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంట్లో నుంచి కాలు తీసి బయటపెట్టాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. సాయత్రం ఆరేడు గంటల వరకు కూడా వేడి గాలులు వీస్తూనే ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో నల్లగొండ జిల్లాలోని గుడాపూర్‌లో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలోని బొమ్మన్ దేవ్‌పల్లిలో 21.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాగల మూడు రోజుల్లో అత్యధికంగా 41 నుంచి 45 డిగ్రీల వరకు, అత్యల్పంగా 26 నుంచి 29 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
జీహెచ్ఎంపీ పరిధిలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు, అత్యల్పంగా 24.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాగల మూడు రోజుల్లో అత్యధికంగా 41 నుంచి 43 డిగ్రీల వరకు, అత్యల్పంగా 28 నుంచి 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఉమ్మడి నల్లగొండలో..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇబ్రహీంపేటలో 46.6, నాంపల్లి, మునగాలలో 46.4, తేల్దెవరపల్లి, కేతేపల్లి, మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.