Petrol Rates | వాహనదారులకు కేంద్రం తీపి కబురు అందించే అవకాశం ఉంది. గత కొన్ని నెలల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు కేంద్రం. అయితే అక్టోబర్ 5వ తేదీ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు సీఎల్ఎస్ఏ నివేదిక ద్వారా వెల్లడైంది. గత నెలలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ మాట్లాడుతూ.. పెట్రోల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలే పెట్రోల్ ధరల తగ్గింపునకు ఊతమిస్తున్నాయి.
ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించక తప్పదనే భావన కూడా ఉంది. అక్టోబర్ రెండో వారంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. నవంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. అంటే అక్టోబర్ మొదటి వారంలోనే పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా బాగా పడిపోయాయి. ఇది కూడా ఇంధన ధరలను తగ్గించేందుకు కారణమవుతుందనే భావన ఉంది.
రిటైల్ ధర తగ్గింపుతోపాటు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సయిజ్ సుంకాన్ని పెంచే అవకాశం ఉందని సీఎస్ఎల్ఏ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం పెట్రోల్‌పై 19.8 రూపాయలు, డీజిల్‌పై 15.8 రూపాయలను కేంద్రం ఎక్సయిజ్ పన్ను విధించింది. 2021నాడు గరిష్ఠ స్థాయితో పోల్చితే ప్రస్తుతం ఉన్న ఎక్సయిజ్ డ్యూటీ పెట్రోల్‌పై 40శాతం, డీజిల్‌పై 50శాతంగా ఉన్నది. పెట్రోల్, డీజిల్‌పై పెంచే ప్రతి ఒక్క రూపాయి ఎక్సయిజ్ డ్యూటీతో ప్రభుత్వ ఖజానాకు ఏటా అదనంగా పెట్రోల్‌పై 15,500 కోట్లు, డీజిల్‌పై 5,600 కోట్లు చేరుతాయి.