ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేండ్ల నుంచి అభివృద్ధి జరగలేదని, ఈ పరిస్థితి మారాలంటే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైఎస్సార్‌సీపీ మోసం చేసింది. పేదల వికాసం కోసం కాదు.. మాఫియా వికాసం కోసం వైఎస్సార్‌సీపీ పని చేసిందని మోదీ విమర్శించారు. అన్నమయ్య జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు.
జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. పుంగనూరులో ఐదేండ్లుగా రౌడీ రాజ్యం నడుస్తోంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అన్ని మాఫియాలకు పక్కా ట్రీట్‌మెంట్ ఇస్తామని మోదీ అన్నారు.
ఎన్డీఏ అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టులన్నీంటిని పూర్తి చేస్తాం. ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం. రైతులను ఆదుకుంటాం. ఉపాధి కోసం వలస వెళ్లేవారిని అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఇక దక్షిణాదిలో కూడా బుల్లెట్ రైలు కావాలని బీజేపీ కోరుకుంటోంది. నంద్యాల – ఎర్రకుంట్ల రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయి. కడప – బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ మంజూరైంది. కడప విమానాశ్రయం కొత్త టెర్మినల్ నిర్మాణంలో ఉంది. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తాం అని మోదీ హామీ ఇచ్చారు.