విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఐదో తరగతి బాలిక కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన కేసులో పోక్సో ప్రత్యేక కోర్టు (POCSO Court) సంచలన తీర్పు వెలువరించింది. 2017వ సంవత్సరంలో సంచలనం సృటించిన ఈ కేసులో నిందితుడు గణేశ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అదేవిధంగా బాధితురాలుకి రూ.4 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.
న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదవ్వగా, దిశ ఎఫెక్ట్‌తో విచారణ వేగవంతంగా జరిగింది. ముద్దాయికి కఠిన శిక్ష పడేలా వాదించిన స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.
కాగా, సొంత మనవరాలిపై లైంగికదాడికి పాల్పడిన ఓ వృద్ధుడికి పోక్సో కోర్టు ఇదే తరహా శిక్ష విధించిన విషయం తెలిసిందే. విశాఖపట్టణం జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధుడు శ్యామ్ సుందర్ కుటుంబంతో నివసిస్తున్నాడు. ఇంట్లో 5వ తరగతి చదువుతున్న మనవరాలు ఉంది. కొన్ని రోజులుగా బాలికపై శ్యామ్ సుందర్ కన్నేశాడు. లైంగిక వాంఛ తీర్చుకోవాలని అదును చూస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మనవరాలిపై లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విశాఖపట్టణం ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.