Janapadham_EPaper_TS_27-10-2024
పోయేకాలం…
రాష్ట్ర సర్కార్ కు చెడు ఘడియలు..
రాష్ట్ర చరిత్రలోనే రికార్డు ఘట్టం..
పోలీసులు రోడ్డెక్కడం దేనికి సంకేతం..
మార్పు దిశగా వ్యవస్థ..?
గొంతిప్పిన మౌనం..
రోడ్డెక్కిన రక్షక భటులు…
‘ఏక్ స్టేట్.. ఏక్ పోలీస్’ అమలు చేయాలని డిమాండ్..
సీఎం సారు.. మా తల్లుల బాధ అర్థం చేసుకోండి..
ఇబ్రహీంపట్నంలో పోలీస్ కుటుంబాల అభ్యర్థన..
సాగర్ రహదారిపై రాస్తారోకో.. బైఠాయింపు
రాష్ట్ర చరిత్రలోనే ఇదో మచ్చ. ఆ మాటకొస్తే ఇదే ఓ చరిత్ర. అవును మరి. నిజంగానే హిస్టరీయే. అదీ ఒక్క రకంగా కాదు., రెండు రకాలుగా ఓ ప్రత్యేకమే. ఆందోళనలను అదుపు చేయడం, ఆందోళనకారులను చెదరగొట్టడం వంటి పనులు చేయాల్సిన పోలీసులే ఆందోళనకు దిగడం ఓ రకమైన చరిత్ర అయితే.., రక్షకభటులు రోడ్డెక్కి న్యాయం జరగాలని, భార్యాపిల్లలు కూడాప్లకార్డులు పట్టి నిరసనలకు దిగడం మరోరకం. ప్రజా సర్కార్ చేతగానితనానికి తోడు ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తే వ్యవస్థలోని కొన్ని శక్తులు తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదనేదే చరిత్ర చెప్పిన గుణపాఠం. ఇప్పుడు బెటాలియన్ కానిస్టేబుళ్ల నిరసన ప్రదర్శనలు., వారి కుటుంబ సభ్యుల నినాదాల ఎపిసోడ్ తో కఠోర సత్యంగా తెలిసిపోయింది. ఇన్నాళ్లు ఎక్కడ గొంతెత్తితో నొక్కేసే యత్నాలు జరుగుతాయని, అప్పటితో ఆగకుండా తొక్కేసేందుకు కూడా వెనకాడని వ్యవస్థలున్నాయని భయపడిన పోలీసింగ్ ఇప్పుడు అన్నీ వదిలి., బతుకుదెరువు కోసం తెగించాలనే స్థాయికి చేరిన ఆనవాళ్లు వారి ఆవేదనను చూస్తే తెలిసిపోతున్నది.
================
జనపదం, బ్యూరో
మౌనం గ్రహణాన్ని వీడింది. అన్నీ భరించిన ఓపిక కట్టలు తెంచుకుంది. పట్టుదలగా విధి నిర్వహణలో తలమునకలైన బాధ్యత తన కష్టాన్నీ గుర్తించమని గోడు వెల్లబోసుకుంటున్నది. ప్రాణాలు లెక్కచేయక.., కుటుంబాలను పట్టించుకోకుండా మరో ప్రాణికి అడ్డం పడే తమ ఇక్కట్ల గురించి దేవుడెరుగు కనీసం భార్యాపిల్లల గురించైనా ఆలోచంచండి అని వేడుకున్నది. వృత్తే దైవంగా భావించే పోలీసులు రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా యూనిఫామ్ తోనే న్యాయం కోసం రోడ్డెక్కింది. నిరసనకారులను తరిమి, నేతల రక్షణకు శ్రమించే ఖాకీ నిరసనకు దిగింది. రోడ్డుపై కూర్చుని జీవితాన్ని రోడ్డున పడేయొద్దని కోరింది. కొట్లాటలొద్దు.., లడాయి చేయాల్సిన అవసరమూ లేదు.., మాకు న్యాయం చేయండి చాలూ.. అని పెద్దలను అర్తించింది. ఏక్ స్టేట్.. ఏక్ పోలీస్.. విధానాన్ని అమలు చేసి బుక్కెడు బువ్వ మనస్ఫూర్తిగా తినే అవకాశం కల్పించాలని బతిమిలాడింది.
యూనిఫామ్ లో..
మొట్టమొదటి సారి పోలీసులు నిరసనకు దిగారు. యూనిఫామ్ లో ఉండి మరీ తమకు న్యాయం చేయండని వేడుకున్నారు. ఎన్నో ఏండ్లుగా నలిగిపోతున్న బతుకులకు కాస్త ఊరట కల్పించండని బతిమిలాడారు. రాష్ట్ర మంతా ఒకే పోలీస్ విధానం(ఏక్ స్టేట్.. ఏక్ పోలీస్) విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్నాళ్లు ప్రజాప్రతినిధులకు రక్షణగా, ప్రజలకు కాపాడే భటులుగా విధులు నిర్వహించి కానిస్టేబుళ్లు ఇప్పుడు తమ కుటుంబాలను రక్షించండి మహా ప్రభో అని సర్కార్ ను అడుక్కుంటున్నారు. గొడ్డు చాకిరీ చేశామో.., వెట్టిచాకిరే చేయించారోగానీ ఇప్పటికైనా తమను ఉద్యోగులుగా గుర్తించి, భార్యాపిల్లలతో గడిపేందుకు సమయం కుదిరేలా చూడాలని కోరుతున్నారు.
సర్కార్ కు వ్యతిరేక నినాదాలు..
తెలంగాణలోని బెటాలియన్ కానిస్టేబుళ్లు ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ పలు పోలీస్ బెటాలియన్లలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద నాగార్జున సాగర్ హైవేపై బెటాలియన్ పోలీసు కుటుంబాలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడికి చేరుకున్న సాధారణ పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. బెటాలియన్ పోలీసు కుటుంబాలపై మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డీసీపీ తీరుపై మండిపడ్డ నిరసనకారులు సాగర్ రహదారిపై రాకపోకలు స్తంభింపజేశారు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ దగ్గర పోలీసులు ధర్నాకు దిగారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమకు విధులు వేసి మా సంసారాన్ని కుటుంబానికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాతో కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారు.. అలాగే, పెద్ద అధికారుల ఇళ్లలో పాచీ పనులు, బోల్లు తోమడం, ఇళ్లు ఊడవడం, పిల్లలను స్కూల్ కి పంపడం, మందు తాగి పబ్బులో పడిపోతే తీసుకురావడంలో లాంటి వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. మాపై ఆంధ్రా అధికారుల పెత్తనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రోడ్డెక్కిన కానిస్టేబుల్స్ భార్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో సిబ్బంది మరోసారి నిరసన చేపట్టారు. నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజుల క్రితం ఆందోళన చేస్తున్న తమతో పాటు తమ కుటుంబ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ కానిస్టేబుళ్లు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బెటాలియన్ నుంచి రోడ్డుపైకి ర్యాలీగా వచ్చే ప్రయత్నం చేసిన కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులను పోలీసులు బారీకేడ్లు వేసి అడ్డుకున్నారు.
ఆందోళనల వెనక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు : డీజీపీ
రాష్ట్రంలో బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనపై డీజీపీ జితేందర్ తీవ్రంగా స్పందించారు. ఆందోళనల వెనుక రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక శక్తులున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్ల సెలవులపై పాత పద్ధతినే అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఆందోళన చేయడం సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ రిక్రూట్‌మెంట్ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని డీజీపీ ఘాటుగా హెచ్చరించారు.
బెటాలియన్ కుటుంబ సభ్యుల డిమాండ్లివే….
మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలి.
ఏక్ పోలీస్ విధానం అమలయ్యే వరకు ఫ్యామిలీ వెల్ఫేర్ సోషల్ పాటు కల్పించాలి.
బ్రిటిష్ కాలం నాటి విధానాలను ప్రస్తుత కాలానికి మార్చాలి.
ఓకే చోట ఐదు సంవత్సరాలు పోస్టింగ్ ఇచ్చి, కుటుంబాలకు కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
బెటాలియన్ వ్యవస్థలో ఫటిక్ పేరుతో చేసే వెట్టి చాకిరీ నశించాలి.
ఉన్నతాధికారుల ఇండ్లలో బానిస బతుకుల నుండి విముక్తి కల్పించాలి.
హోంశాఖ మీ చేతుల్లోనే ఉంది.. తమ బతుకులు కూడా సీఎం చేతుల్లోనే ఉన్నాయంటూ నినాదాలు ఫ్లకార్డులు ప్రదర్శించారు.
=================
‘సీఎం సారు.. మా తల్లుల బాధ అర్థం చేసుకోండి”
ఇబ్రహీంపట్నంలో రోడ్డెక్కిన పోలీస్ కుటుంబాలు
సాగర్ రహదారిపై రాస్తారోకో.. బైఠాయింపు
మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి మాటలతో తీవ్ర ఉద్రిక్తత
జనపదం, ఇబ్రహీం పట్నం
‘సీఎం సారు.. మా తల్లుల బాధ అర్థం చేసుకోండి” అంటూ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాలు రోడ్డెక్కాయి. ఇబ్రహీంపట్నంలోని సాగర్ రహదారిపై 3వ బెటాలియన్ కానిస్టేబుల్ భార్య పిల్లలతో కలిసి శనివారం ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేపట్టారు. ఏక్ స్టేట్-ఏక్ పోలీస్ అనే నినాదంతో రోడ్డుపైకి చేరుకుని ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని రోడ్డుమీద బైఠాయించారు. కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ధర్నాతో సాగర్ రహదారిపై కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ స్తంభించింది. ర్యాలీ నిర్వహిస్తున్న వారిని మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి అడ్డుకోవడంతో పాటు వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క సారిగా కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు తిరగబడి పోలీసుల మీదకు చొచ్చుకెళ్ళారు. పోలీసు కుటుంబ సభ్యులను పోలీసులే అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందుకు వెళ్లడంతో ఆమె వెనక్కు తగ్గారు. పరిస్థితులు చేయిదాటే క్రమంలో స్థానిక పోలీసులు ఆందోళన చేపడుతున్న పోలీసుల కుటుంబ సభ్యులతో చర్చించి ఆందోళన చేయవద్దని వారించారు.
ఈ సందర్భంగా పోలీసుల భార్యలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. మా భర్తలకు ఇష్టారీతిగా డ్యూటీలు వేసి మాకు, మా కుటుంబాలకు దూరం చేస్తున్నారని, వారిని బానిసలుగా మారుస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. మా భర్తలను బెటాలియన్ లోపల కూలీ పనులు చేయిస్తున్నారని, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేపిస్తున్నారని అన్నారు. పోలీసు డ్యూటీకి మా భర్తలు చేస్తున్న పనికి సంబంధం లేదని మండిపడ్డారు. ఇంటికి అప్పుడప్పుడు వచ్చే తండ్రిని చూసి తమ పిల్లలు బంధువులుగా ఫీల్ అవుతున్నారని, ఇంకొన్నాళ్లు పోతే తండ్రికి, పిల్లలకు సంబంధం లేకుండా పోతుందేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగా లేకున్నా ఆసుపత్రులకు తీసుకోని పోయే పరిస్థితి లేదని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్న పోలీస్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు పరచాలని డిమాండ్ చేశారు. తమ భర్తల డ్యూటీ విషయంలో ఇటీవల పోరాటానికి దిగిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులను అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలన్నారు.