Lok Sabha Elections | లోకసభ ఎన్నికల గడువు దగ్గర పడుతున్నా కొద్ది జాతీయ పార్టీలు తెలంగాణ కేంద్రంగా రాజకీయ రణం చేస్తున్నాయి. ఆపరేషన్ సౌత్‌లో భాగంగా ఈ రాష్ట్రం నుండి మేజార్టీ సీట్లను గెలుచుకునేందుకు పోటా పోటీ పర్యటనలు, సభలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పుడూ ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యతనిచ్చేవి కానీ ఢిల్లీ పీఠం దక్కించుకోవాలంటే దక్షిణాదే దగ్గరి దారి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ దాని అనుబంధ అగ్రనాయకత్వాలన్నీ తెలంగాణ కేంద్రగా సర్వశక్తులొడ్డుతున్నాయి. ఇక కాంగ్రెస్ దాని సాంప్రదాయ ఓటర్లను కాపాడుకునే ఉనికి పోరాటంలో ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ జనం ఎన్డీఏ వెన్ను తడుతరా.. ఇండియా కూటమి తలుపు తడుతారా అన్న చర్చైతే దేశ వ్యాప్తంగా నడుస్తున్నది.
తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో మే 13వ తేదీన జరిగే ఎన్నికలు జరుగబోతున్నాయి. రెండు జాతీయ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నట్టుగా క్షేత్రం స్పష్టీకరిస్తున్నది. 17 సీట్లలో ఒకటి ఎంఐఎంకి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో మిగిలిన 16 సీట్ల కోసం మేజార్టీ సీట్ల కైవసానికి కాంగ్రెస్, బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. 14 ఏండ్ల ఉద్యమ పార్టీ, 10 ఏండ్ల అధికార పార్టీ వెరసి 24 ఏండ్ల గులాబీ పార్టీ ఎందుకో ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి పోరాటం చేస్తున్నది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ తన అనారోగ్యాన్ని సైతం ఖాతరు చేయకుండా రోజూ బస్సు యాత్రలతో క్యాడర్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ రోల్ ఏంటనే చర్చ మాత్రం క్షేత్రంలో నడుస్తున్నది. ఇక బీజేపీ, కాంగ్రెస్ రెండంకెల సీట్ల కోసం పోటీ పడుతున్నాయని చెప్పాలి.
ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 14 సీట్లను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ముగ్గురు ఎంపీలున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎవ్నికల్లో 39.30 ఓట్ల శాతంతో 64 ఎమ్మెల్యే స్థానాలను ఆ పార్టీ గెలుచుకున్నది. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఓట్ల శాతాన్ని మరింత పెంచుకుని డబుల్ డిజిట్ ఎంపీ స్థానాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇక బీజేపి గత పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకున్నది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతం ఓట్లతో 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నది. పదేండ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ 37.35 శాతంతో 39 ఎంఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్నప్పటికీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. కాబ్టటి పార్లమెట్ ఎన్నికల్లో తిరిగి ఆ ఓట్ల శాతాన్ని రాబట్టుకోవడం కష్టంగా కనిపిస్తుంది. బిఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపికి బదాలయింపు జరిగేతే బీజేపి ఓట్ల శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నది. మోదీ గ్యారంటీ, పదేండ్ల అబివృద్ది, రామజన్మ భూమి ఇతరత్రా అంశాలను ప్రధాన ప్రచార అస్త్రంగా ఎంచుకున్నది. అయితే కాంగ్రెస్ ఈ సారి తన ప్రచారంలో దూకుడు పెంచి రిజర్వేషన్ల ఎత్తివేత, గాడిద గుడ్డు వంటి అంశాలు ప్రచారం చేస్తోంది.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 6వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఇబ్రహీంపట్నంలో రోడ్ షో, కార్నర్ మీటింగ్, 7.30 గంటలకు ఉప్పల్‌లో రోడ్ షో, కార్నర్ మీటింగ్, రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ. 7వ తేదీన ఉదయం 11 గంటలకు నర్సాపూర్ జనజాతర సభలో రాహుల్ పాల్గొననున్నారు. అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు వరంగల్ ఈస్ట్‌లో రోడ్ షో, కార్నర్ మీటింగ్, రాత్రి 7.45 గంటలకు వరంగల్ వెస్ట్‌లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. 8వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఆర్మూర్ కార్నర్ మీటింగ్, 7 గంటలకు నిజామాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. 9న ఉదయం 11 గంటలకు కరీంనగర్ జన జాతర సభలో, సాయంత్రం 6 గంటలకు ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే జనజాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి జన జాతర సభలో, సాయంత్రం 4 గంటలకు తాండూరు జన జాతరసభలో, 6 గంటలకు షాద్‌నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారంపై బీజేపి ఫోకస్ పెట్టంది. తెలంగాణకు బీజేపీ అగ్ర నేతలు వస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా ప్రచారం నిర్వహించిన మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు మరోసారి తెలంగాణకు రాబోతున్నరు. ఈనెల 8 న కరీంనగర్, వరంగల్ పార్లమెంట్ పరిధిలో మోడీ బహిరంగ సభలు, 10న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్బీ స్టేడియంలో మోడీ బహిరంగ సభ కు పార్టీ ప్లాన్ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్ మల్కాజ్‌గిరి పార్లమెంటులో ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొననున్న అమిత్ షా.. అలాగే పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ బహిరంగ సభల్లో జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.