Thursday, April 3, 2025
HomeTelanganaMusi Riverfront | మూసీపై ముష్టియుద్ధం..

Musi Riverfront | మూసీపై ముష్టియుద్ధం..

JanaPadham_EPaper_TS_19-10-2024

Janapadham _4pm News_19.10.2024

మూసీపై ముష్టియుద్ధం..

కంపు రేపుతున్న పార్టీల పైత్యం..
సిగపట్లకు దిగుతున్న నాయకులు..
ఎవరి లెక్కల్లో వాళ్లు.. ఎదుటివారిపై తప్పుల నిందలు..

రాజకీయానికి వేదికగా రాజధాని నది..
ప్రజలకు ఒరిగింది శూన్యం..

కంపుకు కేరాఫ్ గా మారిన మూసీ కంటే వాళ్ల తీరు ఇంకా కంపరం రేపుతున్నది. నాయకులు నోరు తెరిస్తే చాలు భరించలేని కంపు బయటకొస్తున్నది. శుద్ధీకరణో.., సుందరీకరణో.., అదీ కాదంటే పునరుజ్జీవనమోగానీ… గీత దాటుతున్న మాటలతో మూసీ చుట్టు రాజకీయం రోజురోజుకు ముదురుతూనే ఉన్నది. వాళ్లు చేశారని వీళ్లు., వీళ్లు చేశారని ఇంకొకళ్లు.., ఒకరిపై ఒకరు మూసీ నీళ్లు చల్లకుంటూ మురుగును ఆశ్వాదిస్తున్నారు. మరోవైపు సర్కార్ దుందుడుకుతో గుండెలాగుతున్న సామాన్యుడి గోడు మాత్రం ఆ దేవుడికే తప్ప నాయక ఘనుడికి పట్టింది లేదు. ఓట్ల రూపకపు సానుభూతి కోసం సన్నాయి నొక్కులు నొక్కడమే తప్ప, నిక్కచితనపు పోకడతో పరిష్కారం దిశగా అడుగులు వేసేది అతి తక్కువే అని ఎప్పుడో తేలిపోయింది. రంగుల జెండాలను మూసీ లో ముంచి జనం సింపథిని పొందడానికి ఆ నీటిని పిండుతూ ఆనందించడం వారి వంతు అవుతుండగా, ఆ గుడ్డ పిండిన నీటి కంపు మాత్రం ప్రజల నెత్తిన ఇంకా పిడుచకట్టుకుపోతున్నది.

=====================

జనపదం, బ్యూరో

మూసీ చుట్టు రాజకీయం ముందురుతూనే ఉంది. నిర్మాణాల తొలగింపుతో ముదిరిపాకాన పడిన వ్యవహారం ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతూ రక్తికట్టిస్తున్నది. పేదలను మురికి కూపంలోనే ఉంచాలా.., వాళ్లు అందరిలా బతకడం ఇష్టం లేదా.. ? అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, అన్యాయంగా కట్టడాలు కూల్చుతూ జీవితాలను నాలుగు రోడ్ల కూడలిలో నిలబెట్టి పైశాచికం పొందుతున్నారని, బీదవాడి ఉసురు తాకకుండా పోదని ప్రతిపక్షం బీఆర్ఎస్ దుయ్యబడుతున్నది. అదే క్రమంలో బీజేపీ కూడా కలుగ జేసుకుని కారోళ్లు ఆజ్యం పోశారు., కాంగ్రెసోళ్లు పూర్తి చేస్తున్నారని వారిదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.

కంపు రేపుతున్న పార్టీల పైత్యం..
నిత్యం పార్టీలకు ఇప్పుడు మూసీ వివాదం తప్ప మరోటి ప్రధానమైనది లేదు. అధికార పక్షం ఏమంటుందా.., దానికి ఎప్పుడెప్పుడు కౌంటర్ ఇద్దామా.. అని ప్రతిపక్షం ఎదురు చూస్తుండగా, మొన్నటి దాకా వెలబెట్టినవాళ్లు ఇప్పుడు ఏదేదో వాగుతూ అనవసరంగా రాజకీయం చేస్తున్నారని, వాళ్ల చేతులను వారి నెత్తిమీదే పెట్టి ప్రజాక్షేత్రంలో మరోమారు భరతం పట్టాల్సిందే అనే ధోరణిలో అధికార కాంగ్రెస్ కాచుక్కూర్చున్నది. వాళ్లతో ఇలాగే జరుగుతుంది., మేం వస్తే మీరు గుండె మీద చేతులేసుకుని బతుకొచ్చు.., అవకాశం ఇవ్వండి., వాళ్ల ఆటలు కట్టించండి అన్నట్టుగా బీజేపీ ప్రవర్తిస్తున్నది. ఒక్కో పార్టీ ఒక్కో వాదాన్ని నెత్తికెత్తుకుని గడుపుతున్న తీరు, సాగదీస్తున్న విధానం మూసీ పరివాహక ప్రజలకేమోగానీ, మూసీకైతే తీవ్ర అసౌకర్యంగానే మారి ఉండొచ్చన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

RELATED ARTICLES

తాజా వార్తలు