JanaPadham_EPaper_TS_16-10-2024
అడవికి అగ్గి పెట్టిండ్లు
– పచ్చటి అడవిలో ప్రభుత్వాల కార్చిచ్చు
– రాడార్ తో రాజకీయం
– 3 వేల ఎకరాల్లో కూల్చే చెట్లెన్ని..?
– ఆ అడవిలో పోయే ప్రాణలెన్ని
– కేంద్రం ఆజ్యం.. రాష్ట్రం పూజ్యం
దామగుండం కేంద్రంగా రగులుకున్న వివాదం..
పార్టీల మధ్య మాటల యుద్ధం..
వేడెక్కిన రాష్ట్ర రాజకీయం..
రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన
2901 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
పచ్చని అడవిలో నిప్పు రాజుకుంది. రాజకీయం అనే అస్త్రాన్ని రాడార్ కేంద్రంగా ప్రయోగించేందుకు ఎవరికి వారుగా సిద్ధమయ్యారు. అంతా గొంతులు చించుకున్నారు సరే మరి ఆజ్యం పోసిందెవరిని అడిగితే మాత్రం సమాధానం చెప్పేవారు లేరు. దేశ రక్షణ అంటూ బీజేపీ, మన రాష్ట్రానికి ఆ అవకాశం దక్కడం అదృష్టం., రాజకీయం ముఖ్యం కాదని కాంగ్రెస్ పేర్కొంటుండగా, ప్రకృతిని చెరబట్టి, జీవితాలను ఆగం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నది. మూడు పార్టీలు తలో రాగం గొంతుకెత్తుకుంటే అసలు నేవీ రాడార్ వెనకెవరున్నారనేది అర్థం గాక సామాన్యుడు జుట్టుపీక్కుంటున్నాడు. కేంద్రం ఆజ్యం పోస్తే, రాష్ట్రం మరింత వెలిగిస్తోందనేది మాత్రం సుస్పష్టం.
=====================
జనపదం, బ్యూరో
గురి మారింది. రైతుబంధు, రుణమాఫీ నుంచి మొదలైన జగడం వయా హైడ్రా.., మూసీ ప్రక్షాళన.., కోర్టు మొట్టెకాయలు., మీదుగా ఇప్పుడు తాజాగా దామగుండానికి షిఫ్ట్ అయ్యింది. సర్కార్ చర్యలకు ప్రతిపక్షాల కౌంటర్లు., విపక్షాల విసుర్లకు ప్రభుత్వ వర్గాల దెప్పిపొడుపులు., వెరసి రాజకీయం రసకందాయంగా మారుతున్నది. పూటకో కోటు తొడుక్కున్నదా.. అన్నట్టుగా రోజుకో మలుపు తిరుగుతూ పాలిటిక్స్ రంజుగా మారుతున్నాయి. ఇప్పుడు దామగుండంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపనతో కొత్త వివాదం పురుడుపోసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీ లపై దుమ్మెత్తిపోస్తుండగా, అసలు అనుమతి ఇచ్చిన దౌర్భాగ్యం బీఆర్ఎస్ పార్టీయే అని ఆ పార్టీల నాయకులు గతాన్ని గుర్తు చేస్తున్నారు. మూడు పార్టీల నడుమ దామగుండం పావుగా మారడంతో రాజకీయం వేడెక్కింది.
నిప్పు రాజుకుంది..
దామగుండం అడవిలో అధికారిక నిప్పు రాజుకున్నది. మొన్నటిదాకా హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన, పేదల ఇండ్లకు మార్కింగ్, అధికారుల నిలదీతలు.. కోర్టు కేసులతో వేడెక్కిన రాజకీయాలు.. ఇప్పుడు దామగుండం వైపు గురి పెట్టాయి. ఇదే సమయంలో రాజధాని హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లాలోని దామగుండం ఫారెస్ట్ లో ఏర్పాటు చేయనున్న వీఎల్ఎఫ్ నేవీ రాడారా స్టేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మంగళవారం శంకుస్థాపన పూర్తయింది. జీవవైవిధ్యం కళ్లకు కట్టినట్టు ఉండే దామగుండం ఫారెస్ట్ లో ఇలాంటి నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయటంపై స్థానికులు, పర్యావరణ సంఘాలు, విపక్ష నేతలు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ స్టేషన్ వల్ల ఎవరికి లాభం.. ఎలాంటి నష్టాలు ఉన్నాయనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
ఇప్పుడు దామగుండం..
రాష్ట్రంలో ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు ఆందోళన రేకెత్తిస్తుంటే.. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న దామగుండం ఫారెస్ట్ లో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు అంశం మళ్లీ మంట పెట్టింది. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే అడవికి ముప్పు వాటిల్లుతుందని, మూసీ అంతర్థానం అవుతుందంటూ కొంతమంది నేతలు, పలు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు ఆందోళనలు, వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే మంగళవారం నేవీ రాడార్ స్టేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో శంకుస్థాపన కూడా చేశారు.
అసలు ప్రమాదమేమిటి..?
నిజానికి నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు సముద్ర తీర ప్రాంతం అనువైన ప్రాంతంగా భావిస్తారు. కానీ ఆ ఛాన్సే లేని తెలంగాణలో రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్ నిర్మించాలని నేవీ ప్రతిపాదించింది. ఈ స్టేషన్ ఏర్పాటుకు బీఆర్ఎస్ హయాంలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం వికారాబాద్ జిల్లా పూడుర్ మండలంలోని దామగుండం ఫారెస్ట్ ఏరియాలోని 2901 ఎకరాలను నేవీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దేశంలో రెండో వీఎల్‌ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్‌ను నేవీ ఏర్పాటు చేస్తోంది. ఈ వీఎల్‌ఎఫ్ స్టేషన్ ద్వారా ఓడలు, జలాంతర్గాములతో కమ్యూనికేషన్ చేస్తారు. అలాగే రక్షణ రంగంతో పాటు రేడియో కమ్యూనికేషన్ అవసరాల కోసం ఈ సాంకేతికతను వినియోగిస్తారు. అయితే, దామగుండం ఫారెస్ట్ పూర్తి విస్తీర్ణం 3,261 ఎకరాలు కాగా ఈ అడవిని ఆనుకుని దాదాపు 20 పల్లెలు, తండాలు ఉన్నాయి. పశువుల మేతకు, ఇతరత్రా అవసరాలకు ఆయా గ్రామల ప్రజలంతా ఈ అడవి ప్రాంతం మీదే ఆధారపడతారు. అడవి మధ్యలో చిన్న చిన్న నీటి వనరులు, వాగులు వంకలు కూడా ఉన్నాయి. ఆహ్లాదకరంగా ఉండే అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యం కళ్లకు కట్టినట్టుంటుంది. ఇలాంటి ప్రాంతంలో వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తుండటం ఇప్పుడు అందరిల్లో అలజడి సృష్టిస్తోంది. నేవీ రాడార్ కోసం కేటాయించిన 2901 ఎకరాల్లో స్టేషన్‌తో పాటు ఇందులో పని చేసే సుమారు 600 మంది సిబ్బంది స్థానికంగా నివసించేందుకు టౌన్‌షిప్ కూడా నిర్మించనున్నారు. వీళ్ల కోసం ఆస్పత్రులు, బ్యాంక్, మార్కెట్ ఇలా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. మొత్తంగా రెండున్నర వేల మంది ఈ ప్రాంతంలో నివాసం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు ఆ ప్రాంతం చుట్టూ 27 కిలోమీటర్ల మేర ప్రహారీ కూడా నిర్మించనున్నారు. రాడార్ స్టేషన్ ఏర్పాటుతో 2,900 ఎకరాల్లో సుమారు 12 లక్షల చెట్లను తొలగిస్తారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా 208 రకాలకు చెందిన జీవరాశులు ప్రమాదంలో పడనున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ ద్వారా వచ్చే రేడియేషన్ వల్ల చుట్టుపక్క ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని చెప్తున్నారు.
మరోవైపు మూసీనది ప్రక్షాళన చేస్తామంటోన్న ప్రభుత్వం దాని జన్మస్థానం అయిన అనంతగిరి కొండల్లో ఈ ఫారెస్ట్ ను లేకుండా చేస్తుండటంతో మూసీ అంతర్ధానం అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాల నిర్ణయంతో హైదరాబాద్‌కు వరద ముంపు కూడా ఉండబోతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఈ రాడార్ స్టేషన్‌కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు దశాబ్దకాలంగా అటవీ సంరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో పోరాటం కూడా చేస్తున్నారు.
అధికారులు చెప్తున్నదేమిటి..
ఈ నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుపై అనుమానాలు, ఆందోళనలపై ఫారెస్ట్ అధికారులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాడార్ ప్రాజెక్ట్ కి కేటాయించిన మొత్తం అటవీ భూముల్లో కేవలం 48 శాతం మాత్రమే స్టేషన్ నిర్మాణానికి ఉపయోగించనున్నట్టు చెప్తున్నారు. మిగిలిన 52 శాతం అటవీ సంపదకు ఎలాంటి నష్టం జరగబోదని వివరిస్తున్నారు. 12 లక్షల చెట్లను తొలగిస్తారన్న వాదనల్లోనూ ఏమాత్రం వాస్తవం లేదని, కేవలం 1.93 లక్షల చెట్లను మాత్రమే తొలగించనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ సంఖ్యను కూడా ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ తొలగిస్తున్న చెట్లకు బదులుగా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో 2,348 హెక్టార్ల స్థలంలో 17.55 లక్షల మొక్కలు నాటి అటవీ సమతుల్యతను కాపాడనున్నట్టు అధికారులు వివరిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో 500 ఏళ్లుగా కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నష్టం వాటిళ్లనుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు పూర్తిగా కొట్టిపడేశారు. 32.10 ఎకరాల్లో ఉన్న ఆలయంతో పాటు కొలనుకు ఎలాంటి ముప్పు లేదని, అవి ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయని అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. ఎప్పటిలాగే భక్తులు ఆలయాన్ని దర్శించుకునే వీలు ఉంటుందని, అందులో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అటవీశాఖ అధికారులు వివరిస్తున్నారు. వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్‌ను విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ఈస్టర్న్ నావల్ కమాండ్ నిర్మించబోతోంది. రూ.2,500 కోట్లతో 2027 నాటికి ఈ స్టేషన్‌ని అందుబాటులోకి తీసుకురావాలని రక్షణ శాఖ భావిస్తోంది. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే దేశంలోని రక్షణ శాఖ కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ స్టేషన్ వల్ల పర్యావరణానికి, అటవీ సంపదకు ఎలాంటి హాని జరగదని మరీ చెప్తున్నారు.
ఏం కాదు.. చాలా నష్టం : రాజకీయ వార్
దామగుండం రాడార్ స్టేషన్లో రాజకీయ పక్షాలు ఆయుధాలను అందుకున్నాయి. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధంగా మాట్లాడుతుంటే ఇటు బీఆర్ఎస్, ప్రజా సంఘాలు, వామపక్షాలు మాత్రం విమర్శలు ఎక్కు పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకేసి అసలు రాడార్ స్టేషన్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. ఇటు కాంగ్రెస్ మాత్రం కేంద్రానికి అనుగుణంగా మాట్లాడుతూ వస్తుంది. ఈ క్రమంలో పలు ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం ఎలా డీల్ చేయనుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ నేవీ రాడార్ స్టేషన్ వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం లేదని అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పించటం వల్ల ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలను తొలగించే అవకాశం ఉందని పలువులు అభిప్రాయపడుతున్నారు.